ఆ కాంట్రాక్టర్ టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడు.. విద్యుత్ శాఖలో పైరవీలతో వివిధ కాంట్రాక్టులు సొంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నికల కోడ్ సమయంలో సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులు దక్కించుకున్నాడు.. అంతటితో ఆగకుండా... వాటిల్లో ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి అక్రమ వసూళ్లకు తెరదీశాడు. ఇలా దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బాధితులను విచారణకు రమ్మని ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ వారిని విచారణకు వెళ్లకుండా నిర్బంధించాడు. దీంతో అధికారులు బాధితుల చిరునామా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏపీ ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామనే పేరుతో ఓ కాంట్రాక్టర్ భారీగా వసూళ్లకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఉప కేంద్రాలను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ అక్రమాలకు తెరతీశాడు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రామలింగాయపల్లె, పందికోన వద్ద కొత్తగా నిర్మించిన సబ్‌స్టేషన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేశారు. అయితే వీటిని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక గత ఎస్‌ఈ కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రెండు సబ్‌స్టేషన్ల పరిధిలో పోస్టుల పేరుతో రూ.70లక్షల వసూలు చేశారనే సమాచారం మేరకు అధికారులు విచారణ జరిపారు.
కేటాయింపులు ఇలా..
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మంజూరు, కేటాయింపులు, నోటిఫికేషన్లు జారీ చేయరాదు. అయితే గత అధికారి మాత్రం అందుకు విరుద్ధంగా పందికోన, రామలింగాయపల్లె సబ్‌స్టేషన్లను హడావిడిగా పూర్తి చేయించారు. వాటి నిర్వహణను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు మార్చి 18న కేటాయిస్తూ సంతకాలు చేశారు.
రూ.70లక్షల వసూలు..
రామలింగాయపల్లె, పందికోన సబ్‌స్టేషన్లు తనకే వచ్చాయని, వాటిలో ఆపరేటర్ పోస్టులు ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్ ఉంటారు. ఆపరేటర్ పోస్టుకు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు, వాచ్‌మెన్ ఉద్యోగానికి రూ.5లక్షల వరకు బేరం కుదుర్చుకొని దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
మూడు సార్లు విచారణ..
కోడ్ అమల్లో ఉండగా సబ్‌స్టేషన్ల కేటాయింపులు జరిగాయని ఓ కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్–2 మణిమాల తొలుత విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండోసారి చీఫ్ జనరల్ మేనేజర్ లలిత జూన్ 18న క్షేత్రస్థాయికి వెళ్లి సబ్‌స్టేషన్లు తనిఖీ చేశారు. ఇందులో గతంలో పనిచేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 26, 27వ తేదీల్లో ఎస్‌పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (తిరుపతి) వెంకటరత్నం విచారణ జరిపారు.
బాధితుల నిర్బంధం
మోసపోయిన వారిని విచారించేందుకు గత నెల 26న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ విచారణకు రావడంతో బాధితులను కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. ‘మీకు ఉద్యోగాలు వస్తాయి, రాని పక్షంలో మీ డబ్బును తిరిగి ఇస్తాం.. విచారణకు వెళ్లొద్దని నమ్మబలికారు. అయినా వారు బస్సెక్కి వస్తుండగా అడ్డుకొని నిర్బంధించారు. విషయం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు బాధితుల అడ్రస్ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాను టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక పైరవీలు చేసుకుంటూ ఎదిగారని విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదోనితో పాటు డోన్, కర్నూలు డివిజన్లలో అధికంగా 19 సబ్‌స్టేషన్లు పొందాడు. కొన్ని టెండర్ల ద్వారా, మరికొన్ని నామినేటెడ్ వర్క్ పేరుతో తీసుకోవడంతోపాటు స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ కూడా దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment