24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు
Published Thu, Sep 19 2013 4:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తిరుపతి ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. స్థానిక సరోవర్ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 రోజులుగా ఎస్‌పీడీసీఎల్ పరిధిలో కురుస్తున్న వర్షాల వల్ల విద్యుదుత్పత్తి మెరుగైందని చెప్పారు. కొత్త విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడికి ఏడు రోజుల్లోపే కనెక్షన్ ఇస్తామన్నారు.
ఇందిర జలప్రభ పథకం కింద చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంపెనీ పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 285 మంజూరయ్యాయని, వీటిలో 183 సబ్‌స్టేషన్లకు స్థలాల సేకరణ పూర్తిచేసి పనులు జరుగుతున్నాయని చెప్పారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సంస్థ ద్వారా హెచ్‌వీడీఎస్ పనులకుగాను వెయ్యి కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో రెండు డివిజన్లలో హెచ్‌వీడీఎస్ పనులు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా కంపెనీ పరిధిలో రెవెన్యూ కనెక్షన్లు తగ్గుతున్నాయని, వీటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
215 మెగావాట్ల
సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక: 215 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేశామని.. కానీ ఇప్పటి వరకు ఎక్కడా పనులు మొదలుపెట్టలేదన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే పనులు మొదలుపెట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో ప్రాజెక్టు డెరైక్టర్ రాంసింగ్, ఆపరేషన్ డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ రాజగోపాలయ్య, ఎస్‌ఈ జయభారతరావు, డీఈసీ మురళీకృష్ణ యాదవ్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమావేశం
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎండీ విద్యుత్ శాఖాధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులనడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్లు, రెవెన్యూ కనెక్షన్లు, సిబ్బంది వివరాలడిగారు. అభివృద్ధి పనులను, రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
సీఎండీని కలిసిన పలు సంఘాల నేతలు: సీఎండీగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి జిల్లాకు వచ్చిన హెచ్‌వై దొరను విద్యుత్ శాఖ యూనియన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో ప్రధానంగా 327 యూనియన్ నాయకులు కలిసి కార్మికుల సమస్యలపై వివరించారు. కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.సాంబశివరావు, నాయకులు శ్రీరామమూర్తి, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, రవి, వెంకటేశ్వర్లు, వాసు, రామకృష్ణ, పూర్ణ తదితరులున్నారు. అలాగే 104 యూనియన్ నాయకులు ఎం. జయకర్, సంజీవరావులు, సీఎండీని కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Advertisement
Advertisement