వరంగల్, న్యూస్‌లైన్ : ఉచిత విద్యుత్‌ను రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే అతి భారంగా పరిగణిస్తోంది. వ్యవసాయానికి ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నామని, విద్యుత్ సరఫరా కోసం అత్యధిక సబ్సిడీ ఇస్తున్నట్లు పలుమార్లు వాటికి ఆంక్షలు వేసే ప్రయత్నం చేసింది. ఒక దశలో నాలుగు నెలల క్రితం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తి వేసే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత విద్యుత్‌కు కళ్లెం వేస్తే... రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక వస్తుందనే నివేదికలతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.
కానీ... మళ్లీ ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం డిస్కంలు సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తుండడంతో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్‌లో ఈ దొంగచాటు ప్రయోగాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ పంపు సెట్ల వద్ద రీడింగ్ మీటర్లను బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్దే కొత్త మీటర్లను అమర్చి... వ్యవసాయానికి వినియోగించే ప్రతి కనెక్షన్‌నూ వాటికి లింక్ చేస్తోంది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీస్తున్నారు. ఈ మేరకు వినియోగమవుతున్న విద్యుత్‌ను అంచనా వేసి... బిల్లులు వసూలు చేసేందుకు మాయత్తమవుతున్నట్లు సమాచారం.
ట్రాన్స్‌ఫార్మర్‌కో మీటర్
జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలో ప్రతి ఐదు ట్రాన్స్‌ఫార్మర్లకు వ్యూహాత్మకంగా రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేశారు. 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లకు ఈ మీటర్లను బిగించారు. ప్రస్తుతం 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో 40 నుంచి 50, 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30, 25 కేవీ కింద 5 నుంచి 7, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో 3 నుంచి 5 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రీడింగ్ మీటర్లకు సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఇచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను లింక్ చేశారు. ప్రతి కనెక్షన్‌కూ రీడింగ్ మీటర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా అనుసంధానం చేశారు. దీంతో ఒక్కో రైతు వ్యవసాయానికి రోజుకు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తున్నాడు... ఎంత ఖర్చు పడుతోంది... కస్టమర్ చార్జీతో కలిపి ఎంత మేరకు బిల్లు వేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌ఫార్మర్లకు ఈ మీటర్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచే రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు సుమారు 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో 75 నుంచి 100 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా, పూర్తిస్థాయిలో విద్యుత్‌ను వినియోగించుకోని రైతులకు సగం మేర బిల్లు వేసే అవకాశాలున్నట్లు సమాచారం.