
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పైసెస్ బోర్డ్ సంయుక్తంగా జూన్ 18 నుంచి హైదరాబాద్‌లో వర్క్ షాప్‌ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు బుధవారం స్పైస్ బోర్డ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిసి పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు సహా ఇతర దేశాలకు ఎగుమతి వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూరు పడగల్‌లో ఏర్పాటు అవుతున్న స్పైస్ పార్క్‌లో ప్రత్యేక టర్మరిక్ సెల్ , పార్కులో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
వర్క్‌షాప్‌లో పసుపు పండించే రైతులు, పసుపు ఎగుమతి దారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొంటారు. నిజామాబాద్, మహబూ బాబాద్, కేసముద్రం, మహారాష్ట్రలోని సంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్, సేలం, కేరళలోని అలెప్పీ మార్కెట్ చైర్మన్‌లను సమావేశానికి ఆహ్వానిస్తారు. ప్రత్యేక టర్మరిక్ సెల్ ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు, ప్రాసెసింగ్‌కు అవసరమైన బాయిలర్ పరికరాలు సమకూరుతాయి. రైతులకు కావాల్సిన సలహాలు శాస్త్రవేత్తలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment