సాక్షి, హైదరాబాద్: రైతు కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తు చేపడుతోంది. రాష్ట్రంలోని మొత్తం రైతులు ఎందరు, బీమా పథకం పరిధిలోకి వచ్చే వారి సంఖ్య ఎంత వంటి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.
అలాగే రైతుల పేరిట ఏటా ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందనే దానిపై లెక్కలు కడుతోంది. ఈ పథకం వల్ల ఏటా రూ. వెయ్యి కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా వేస్తోంది. బీమా పథకం పరిధిలోకి వచ్చే అర్హులైన వారెందరనే వివరాలను పక్కాగా సేకరించాలని జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పథకం విధివిధానాల తయారీపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఒప్పందానికి అంగీకరించిన ఎల్‌ఐసీతో ఆర్థికశాఖ అధికారులు శనివారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒక్కో రైతుకు రూ. 2,271 ప్రీమియం చెల్లింపుపై ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. ప్రమాద బీమాకు ప్రీమియం తక్కువగా ఉంటుందని, సాధారణ జీవిత బీమా కావడంతో ప్రీమియం ఎక్కువగానే ఉంటుందని ఎల్‌ఐసీ ప్రతినిధులు నివేదించారు. వాస్తవంగా వార్షిక ప్రీమియం రూ. 1,925. అదనంగా 18 శాతం జీఎస్‌టీతో ఒక్కో రైతు పేరిట రూ. 2,271 ప్రీమియం చెల్లించాలని ఎల్‌ఐసీ లెక్క తేల్చింది.
ఈ మేరకు ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక అంగీకారం కుదిరింది. మరోవైపు 18 ఏళ్లకు లోబడి, 59 ఏళ్లకు పైబడి ఉన్న వారిని పక్కనపెడితే.. మొత్తం 43 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వస్తారని వ్యవసాయశాఖ లెక్కగట్టింది. ఈ లెక్కన ఏటా ప్రభుత్వం రైతుల పేరిట రూ. 976 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ పాసుపుస్తకాలు, వేర్వేరు చోట్ల భూములున్న రైతులను గుర్తించేందుకు రైతుల బీమా పథకాన్ని ఆధార్‌తో అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కో రైతు పేరిట రూ. 2,271 ప్రీమియం!
Published Sun, May 27 2018 2:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment