
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది.
లబ్దిదారుల కళ్లలో ఆనందం
జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090
జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్‌శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది.