స్విచ్ వేస్తే మోతే
► బిల్లులు పెంచేందుకు సిద్ధమైన ఎస్పీడీసీఎల్
► మూడు విధాలుగా నడ్డివిరిచే చర్యలు
► గృహ వినియోగ దారులపై భారం
ఆదాయం పెంచుకునేందుకు ఎస్పీడీసీఎల్ కొత్త మార్గాన్ని అన్వేషించింది.వినియోగదారులను వీలైనంత మేర పిండి ఖజా నింపుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. సాధారణంగా ఎప్పుడూ పరిశ్రమలు, ఉన్నత వర్గాల వారిపైనే దృష్టి సారించే విద్యుత్ శాఖ.. ఈ సారి మాత్రంసామాన్యులకు సైతం వాతలు పెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి చార్జీలను వడ్డించనుంది.
అనంతపురం టౌన్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గృహ వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. గ్రూపులుగా విభజించి విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గృహ విద్యుత్‌ను మూడు సమూహాలుగా విభజించి నడ్డి విరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ విధానం వల్ల గృహ వినియోగదారులు ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇబ్బందులు తలెత్తనున్నాయి.
గ్రూపు మారితే గుండెగు‘బిల్లే’
కొత్త విద్యుత్ విధానం ప్రకారం గృహ వినియోగదారులు ఎంతో జాగ్రత్తగా విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక్క యూనిట్ అని అజాగ్రత్త వహిస్తే గ్రూపులు మారిపోయి జేబు చిల్లు పడే అవకాశం ఉంది. నెలకు 50 యూనిట్లు వంతున ఏడాదికి 600 యూనిట్లు వినియోగిస్తే వారికి తొలి 50 యూనిట్ల వరకు రూ.1.45 వసూలు చేస్తారు. ఇదే వినియోగదారుడు 600 యూనిట్ల కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే వారు బీ గ్రూపులోకి మారిపోతారు. ఫలితంగా మొదటి 50 యూనిట్లకు అప్పుడు యూనిట్‌కు రూ.1.45కి బదులు రూ.2.60 వంతున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా గృహ యజమానిపై భారం, విద్యుత్ సంస్థకు ఆదాయం సమకూరుతుంది.
జిల్లాలో 9,42,000 కనెక్షన్లు :
ప్రస్తుతం జిల్లాలోని అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం, గుత్తి, కదిరి డివిజన్ల పరిధిలో మొత్తం 9,42,000 గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి. వీటి వల్ల నెలకు రూ. 13.50 కోట్ల ఆదాయం వస్తోంది. గ్రూపుల విధానం ప్రకారం జిల్లాలోని గృహ వినియోగదారుల నుంచి నెలకు అదనంగా 5 శాతం వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అద్దెకుంటున్న వారిపై అదనపు భారం
కొత్త విద్యుత్ విధానం వల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత విధానం ప్రకారం విద్యుత్ వినియోగానికి సరిపడా బిల్లు చెల్లించేవారు. కొత్త విధానంలో ఏడాది మొత్తంలో అదనంగా ఏ మాత్రం యూనిట్లు ఎక్కువ వాడినా ఆ సర్వీసు బిల్లు అనుసరించి ఏబీసీ గ్రూపుల్లో చేరిపోయే అవకాశం ఉంది. ఇది కొత్తగా అద్దెకు దిగేవారికి తలకు మించిన భారం కాగా, యజమానులకు విద్యుత్ రీడింగ్ తలనొప్పిగా మారనుంది.
ఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ నుంచి అమలు :
ఎస్పీడీసీఎల్ కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ గ్రూపులు 200 యూనిట్ల పైన, 300 యూనిట్లు పైన, 500 యూనిట్లుపైన చొప్పున ఉన్నాయి. ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ఆమోదిస్తే కొత్త చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. 2016-17 సంవత్సరానికి గ్రూపులు, చార్జీలకు సంబంధించి టారిఫ్ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.