- సొంత ప్రాంతాలకు కరెంట్ కార్మికులు
- వెనక్కి పంపుతున్న ఈపీడీసీఎల్
- దాదాపుగా విద్యుత్ పనులు పూర్తి
- వ్యవసాయ కనెక్షన్లకు మరికొన్నాళ్లు
- ఎమర్జన్సీ రిస్టోరేషన్ సిస్టం తొలగింపు
హుద్‌హుద్ తుపానుకు ఛిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొరుగు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కార్మికులు తరలి వచ్చారు. రేయింబవళ్లు పని చేశారు. అనుకున్నదాని కన్నా ముందుగానే పనులు పూర్తి చేశారు. విద్యుత్ వ్యవస్థ సాధారణ స్థితికి రావడంతో అధికారులు వారిని ఆయా ప్రాంతాలకు పంపించేస్తున్నారు.
విశాఖపట్నం సిటీ: విద్యుత్ పునరుద్ధరణ కోసం నెల రోజులుగా పనిచేస్తున్న కార్మికులను వారివారి ప్రాంతాలకు పంపిస్తున్నారు. నాలుగు రోజుల్లోనే వేలాది మందిని తరలించారు. అక్కడక్కడా పనులున్నా తాము చేసేసుకుంటామంటూ ఈపీడీసీఎల్ ఇంజినీర్లు చెప్పడంతో వారంతా సొంత ప్రాంతాలకు బయల్దేరుతున్నారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 11.15 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరాను సాధారణ పరిస్థితికి తీసుకురావడంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఊపిరితీసుకుంటోంది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో 19534 సర్వీసుల్లో 13495 సర్వీసులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దాదాపు 7763 కనెక్షన్లకు ఇప్పట్లో విద్యుత్ సరఫరాను ఇవ్వలేమని ఆయా మండలాల్లోని విద్యుత్ ఇంజినీర్లు తేల్చేశారు. ఆయా సర్వీసులకు విద్యుత్ అందించాలంటే పొలాల్లోకి క్రేన్లు, జేసీబీ వంటి వాహనాలతో వెళ్లాలని కానీ రైతులు అందుకు అనుమతి ఇవ్వడం లేదని ఈపీడీసీఎల్‌కు నివేదించారు. పొలాల్లో పంట పాడవుతాదనే ఉద్దేశంతోనే రైతులు రానీయడం లేదని రైతులు చెబుతున్నట్టు తెలిపారు.
దీంతో రాయలసీమ, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను పంపించేస్తున్నారు. ఈ నెల 6వతేదీ వరకూ మాత్రమే వారు చేసిన సేవలకు డబుల్ జీతాలను చెల్లించారు. 7వ తేదీ నుంచి ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం రోజువారీ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాకు చెందిన విద్యుత్ కార్మికులు మినహా ఇతరులు ఎవరు చేసినా చెల్లింపులు ఆపేయాలని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశాలు జారీ చేశారు.
స్తంభాలు కూడా తొలగింపు : హుద్‌హుద్ తుపాను గాలులకు ఒడిశాకు వెళ్లే గ్రిడ్‌కు చెందిన భారీ విద్యుత్ టవర్లు పెందుర్తి, కశింకోట, గరివిడి మార్గాల్లో పడిపోయిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ఎమర్జన్సీ రెస్టోరేషన్ సిస్టం(ఇఆర్‌ఎస్) టవర్లు ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు. కశింకోటలో మూడు,పెందుర్తి-గరివిడి మధ్య నాలుగు, పెందుర్తి-స్టీల్‌ప్లాంట్ మధ్య ఒకటి చొప్పున అప్పట్లో భారీ టవర్లను నిర్మించి విద్యుత్‌ను అందించారు. వాటి స్థానంలో కొత్త టవర్లను నిర్మించడంతో వాటిని తొలగించే పనిలో విద్యుత్ ఇంజినీర్లు పడ్డారు. మళ్లీ అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వాటిని వినియోగించుకునేందుకు వాటిని తొలగించి భద్రపరిచారు. జిల్లాలో ఇప్పటి వరకూ 40 వేలకు పైగా విద్యుత్ స్తంభాలను నిలబెట్టారు. రాయలసీమలోని ఎస్‌పీడీసీఎల్, తెలంగాణా, చెన్నై, ఒడిశా రాష్ట్రాల నుంచి ఈపీడీసీఎల్‌కు 70 వేల విద్యుత్ స్తంభాలు చేరుకున్నాయి. వాటిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 55 వేల నుంచి 58 వేల స్తంభాలను పాతినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏజెన్సీ గ్రిడ్‌కు మరికొన్నాళ్లు
జిల్లాలోని ఏజెన్సీ గుండా విశాఖకు వచ్చే విద్యుత్ గ్రిడ్ లైన్ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో అప్పర్‌సీలేరు నుంచి విశాఖకు రావాల్సిన పలు మెగావాట్ల విద్యుత్ సామర్లకోట మీదుగా వస్తోంది. నేరుగా విశాఖకు రావాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి.