current workers
-
Hyderabad Rains: సరిలేరు నీకెవ్వరూ!
సాక్షి, హైదరాబాద్: చలిగాలులు, చిటపట కురిసే వాన జల్లుల మధ్య ఎవరైనా గజగజ వణుకుతారు. ఇంటి పట్టున వెచ్చగా ఉండటమే మంచిదనుకుంటారు. కానీ.. ఈ విద్యుత్ సిబ్బంది మాత్రం తమ విధ్యుక్త ధర్మాన్ని తూచ తప్పకుండా నిర్వర్తించి ఔరా.. అనిపించారు. మంగళవారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లలో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–7లో స్తంభంపై మంటలు వస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది రెయిన్కోట్లు ధరించి వర్షంలోనే స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేపట్టారు. జోరు వానలోనూ తమ కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించిన సిబ్బందిని బస్తీవాసులు అభినందించారు. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? -
లైన్ ఉమెన్
కొన్ని కఠినతరమైన ఉద్యోగాల్లో వారు చేసే పనిని బట్టి ఇప్పటికీ మెన్ లేదా మ్యాన్ అనే సంబోధిస్తుంటారు. అలా పిలిచే వాటిలో ‘లైన్ మ్యాన్ లేదా వైర్ మ్యాన్’ ఒకటి. కరెంట్‌కు సంబంధించిన పనుల్లో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్టిబ్య్రూషన్ కంపెనీ లిమిటెడ్‌లో ‘లైన్ ఉమెన్’గా విధులను నిర్వర్తిస్తున్నది ఉషా జగ్దాలే. నిచ్చెన లేకుండా విద్యుత్ స్తంభం ఎక్కుతున్న ఈ యువతిని చూస్తే ఎవ్వరైనా ‘వారెవ్వా’ అంటారు. ఆడవాళ్లు తలుచుకోవాలేగాని ఏ కష్టం చేయడానికైనా వెనకాడరు అంటూ అమ్మాయిలను పిలిచి మరీ ఉదాహరణగా చూపుతారు. ఇంతకు ముందెన్నడూ ఒక మహిళ కరెంట్ పోల్‌ను ఎక్కడం లేదా హై పవర్ కరెంట్ తీగల కనెక్షన్‌ను సరిచేయడం చూడలేదు సుమా అని ఆశ్చర్యపోతారు. ఇటీవల ట్విట్టర్ పేజీ నుండి ఒక వీడియో షేర్ అయ్యింది. అందులో, ఒక మహిళ విద్యుత్ స్తంభంపైకి సులభంగా ఎక్కడం కనిపిస్తుంది. విద్యుత్ సరఫరా సమస్య పరిష్కరించి పోల్ నుంచి కిందకు దిగుతున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఉషా జగ్దాలేకి సంబంధించింది. లాక్డౌన్ సమయంలో, ఎలక్టీష్రియన్లు సమయానికి చేరుకోలేకపోయినప్పుడు, విద్యుత్ సరఫరా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉషా జగ్దాలే చాలామందికి సహాయపడింది. ‘వైర్ ఉమెన్’గా అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది. వైర్లను కనెక్ట్ చేయడంలో ప్రత్యేకత నిచ్చెన లేకుండా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి భద్రతా పరికరాలు లేకుండా తెగిన వైర్లను కలుపుతుంది. చిన్నతనం నుంచీ క్రీడలపై ఆసక్తి ఉన్న ఉష క్రీడాకారిణి కూడా. మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 11 బంగారు పతకాలను సాధించింది. ప్రశంసల జల్లుతో పాటు సేఫ్టీ సూచనలు స్పోర్ట్స్ కోటా నుంచి టెక్నీషియన్ ఉద్యోగానికి ఎంపికయ్యింది ఉషా జగ్దాలే. మొదట ఆమెకు ఆఫీసు పనే ఇచ్చారు. కానీ ఉష ఆఫీసు పనికి బదులుగా వైర్ ఉమెన్‌గా పనిచేయడానికి ఇష్టపడింది. అదే ఆమెను అందరిలో ప్రత్యేకంగా చూపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఉషా జగ్దాలే ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త వైరల్ అయిన వెంటనే, కొంతమంది ఉషను ప్రశంసిస్తుండగా, చాలామంది సేఫ్టీ కిట్ వాడమని సలహా ఇస్తున్నారు. మొత్తానికి మగవారు మాత్రమే చేయగలరు అనుకునే పనుల్లో మగువలూ తమ సత్తా చాటుతున్నారు. నిర్వర్తించే విధుల పేర్లను దర్జాగా మార్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈ లైన్ ఉమెన్ జాబ్. -
థ్యాంక్యూ..మీరిక వెళ్లొచ్చు
సొంత ప్రాంతాలకు కరెంట్ కార్మికులు వెనక్కి పంపుతున్న ఈపీడీసీఎల్ దాదాపుగా విద్యుత్ పనులు పూర్తి వ్యవసాయ కనెక్షన్లకు మరికొన్నాళ్లు ఎమర్జన్సీ రిస్టోరేషన్ సిస్టం తొలగింపు హుద్‌హుద్ తుపానుకు ఛిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొరుగు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కార్మికులు తరలి వచ్చారు. రేయింబవళ్లు పని చేశారు. అనుకున్నదాని కన్నా ముందుగానే పనులు పూర్తి చేశారు. విద్యుత్ వ్యవస్థ సాధారణ స్థితికి రావడంతో అధికారులు వారిని ఆయా ప్రాంతాలకు పంపించేస్తున్నారు. విశాఖపట్నం సిటీ: విద్యుత్ పునరుద్ధరణ కోసం నెల రోజులుగా పనిచేస్తున్న కార్మికులను వారివారి ప్రాంతాలకు పంపిస్తున్నారు. నాలుగు రోజుల్లోనే వేలాది మందిని తరలించారు. అక్కడక్కడా పనులున్నా తాము చేసేసుకుంటామంటూ ఈపీడీసీఎల్ ఇంజినీర్లు చెప్పడంతో వారంతా సొంత ప్రాంతాలకు బయల్దేరుతున్నారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 11.15 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరాను సాధారణ పరిస్థితికి తీసుకురావడంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఊపిరితీసుకుంటోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో 19534 సర్వీసుల్లో 13495 సర్వీసులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దాదాపు 7763 కనెక్షన్లకు ఇప్పట్లో విద్యుత్ సరఫరాను ఇవ్వలేమని ఆయా మండలాల్లోని విద్యుత్ ఇంజినీర్లు తేల్చేశారు. ఆయా సర్వీసులకు విద్యుత్ అందించాలంటే పొలాల్లోకి క్రేన్లు, జేసీబీ వంటి వాహనాలతో వెళ్లాలని కానీ రైతులు అందుకు అనుమతి ఇవ్వడం లేదని ఈపీడీసీఎల్‌కు నివేదించారు. పొలాల్లో పంట పాడవుతాదనే ఉద్దేశంతోనే రైతులు రానీయడం లేదని రైతులు చెబుతున్నట్టు తెలిపారు. దీంతో రాయలసీమ, ఒడిశా ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను పంపించేస్తున్నారు. ఈ నెల 6వతేదీ వరకూ మాత్రమే వారు చేసిన సేవలకు డబుల్ జీతాలను చెల్లించారు. 7వ తేదీ నుంచి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రోజువారీ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాకు చెందిన విద్యుత్ కార్మికులు మినహా ఇతరులు ఎవరు చేసినా చెల్లింపులు ఆపేయాలని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ఆదేశాలు జారీ చేశారు. స్తంభాలు కూడా తొలగింపు : హుద్‌హుద్ తుపాను గాలులకు ఒడిశాకు వెళ్లే గ్రిడ్‌కు చెందిన భారీ విద్యుత్ టవర్లు పెందుర్తి, కశింకోట, గరివిడి మార్గాల్లో పడిపోయిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ఎమర్జన్సీ రెస్టోరేషన్ సిస్టం(ఇఆర్ఎస్) టవర్లు ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు. కశింకోటలో మూడు,పెందుర్తి-గరివిడి మధ్య నాలుగు, పెందుర్తి-స్టీల్‌ప్లాంట్ మధ్య ఒకటి చొప్పున అప్పట్లో భారీ టవర్లను నిర్మించి విద్యుత్‌ను అందించారు. వాటి స్థానంలో కొత్త టవర్లను నిర్మించడంతో వాటిని తొలగించే పనిలో విద్యుత్ ఇంజినీర్లు పడ్డారు. మళ్లీ అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వాటిని వినియోగించుకునేందుకు వాటిని తొలగించి భద్రపరిచారు. జిల్లాలో ఇప్పటి వరకూ 40 వేలకు పైగా విద్యుత్ స్తంభాలను నిలబెట్టారు. రాయలసీమలోని ఎస్పీడీసీఎల్, తెలంగాణా, చెన్నై, ఒడిశా రాష్ట్రాల నుంచి ఈపీడీసీఎల్‌కు 70 వేల విద్యుత్ స్తంభాలు చేరుకున్నాయి. వాటిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 55 వేల నుంచి 58 వేల స్తంభాలను పాతినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఏజెన్సీ గ్రిడ్‌కు మరికొన్నాళ్లు జిల్లాలోని ఏజెన్సీ గుండా విశాఖకు వచ్చే విద్యుత్ గ్రిడ్ లైన్ మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో అప్పర్‌సీలేరు నుంచి విశాఖకు రావాల్సిన పలు మెగావాట్ల విద్యుత్ సామర్లకోట మీదుగా వస్తోంది. నేరుగా విశాఖకు రావాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి. -
విద్యుత్ సమీక్ష సమావేశానికి ‘తెలంగాణ సెగ’
నల్లగొండ, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖ సమీక్ష సమావేశానికి తెలంగాణ సెగ తగిలింది. సమావేశం ప్రారంభానికి ముందే విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని, తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష విడనాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించకుండానే వెనుదిరిగారు. విద్యుత్ శాఖ నెల వారి సమీక్ష సమావేశం బుధవారం నల్లగొండలోని ఆ శాఖ అతిథి గృహంలో జరగాల్సి ఉంది. సమావేశానికి సంస్థ సీఎండీ రిజ్వి హాజరు కావాల్సి ఉండగా ఉద్యోగుల ఆందోళనపై ముందస్తు సమాచారం అందడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో డెరైక్టర్ రఘుమారెడ్డి సమావేశాన్ని నిర్వహించేందుకు రాగా ఉద్యోగులు అతిథి గృహం ఎదుట బైఠాయించి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు వ్యతిరేకంగా, తెలంగాణవాదులపై దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే డెరైక్టర్ రఘుమారెడ్డి సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్దమవుతుండగా జేఏసీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం జరగనిచ్చేది లేదంటూ భీష్మించారు. దీంతో వారి నుంచి వినతిపత్రం స్వీకరించి సమావేశాన్ని నిర్వహించకుండానే వెనుదిరిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అండదండలతో సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామని బెదిరిస్తున్నారని, వారి కుట్రలను టీజాక్ ఆధ్వర్యంలో ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదించే వరకు తెలంగాణ 10 జిల్లాల్లో జరిగే సీఎండీ సమీక్ష సమావేశాలను అడ్డుకుంటామని చెప్పారు. వ్యవసాయ రంగానికి అందించాల్సిన 7 గంటల విద్యుత్‌ను పగటిపూట 4 గంటలు, రాత్రి 3 గంటలు సరఫరా చేయాల్సి ఉండగా సీమాంధ్ర అధికారుల ఆదేశాల మేరకు సబ్‌స్టేషన్ అధికారులు పగటిపూట 3 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. 2006లో నియామకమైన సీజేఎల్ఎంల కార్మికుల కుటుంబాల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులకు ఒక నీతి, తెలంగాణ ఉద్యోగులకు ఒక నీతిగా సీఎండీ రిజ్వి కార్మికులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కేవీఎన్‌రెడ్డి, పి.కృష్ణయ్య, అశోక్‌కుమార్, జిల్లా కన్వీనర్ పి.కరెంట్‌రావు, కోకన్వీనర్లు సిహెచ్.శ్రీనివాస్, మడుపోజు సురేష్‌కుమార్, కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్ల నాయకులు ఉమా మహేశ్వర్, శ్రీనివాస్, గంజి వెంకన్న, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు మురళి, రవినాయక్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.