నల్లగొండ, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖ సమీక్ష సమావేశానికి తెలంగాణ సెగ తగిలింది. సమావేశం ప్రారంభానికి ముందే విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని, తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష విడనాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించకుండానే వెనుదిరిగారు. విద్యుత్ శాఖ నెల వారి సమీక్ష సమావేశం బుధవారం నల్లగొండలోని ఆ శాఖ అతిథి గృహంలో జరగాల్సి ఉంది. సమావేశానికి సంస్థ సీఎండీ రిజ్వి హాజరు కావాల్సి ఉండగా ఉద్యోగుల ఆందోళనపై ముందస్తు సమాచారం అందడంతో పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో డెరైక్టర్ రఘుమారెడ్డి సమావేశాన్ని నిర్వహించేందుకు రాగా ఉద్యోగులు అతిథి గృహం ఎదుట బైఠాయించి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు వ్యతిరేకంగా, తెలంగాణవాదులపై దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే డెరైక్టర్ రఘుమారెడ్డి సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్దమవుతుండగా జేఏసీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం జరగనిచ్చేది లేదంటూ భీష్మించారు.
దీంతో వారి నుంచి వినతిపత్రం స్వీకరించి సమావేశాన్ని నిర్వహించకుండానే వెనుదిరిగారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అండదండలతో సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ఈ నెల 12 నుంచి సమ్మె చేస్తామని బెదిరిస్తున్నారని, వారి కుట్రలను టీజాక్ ఆధ్వర్యంలో ఎదుర్కొంటామన్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టి ఆమోదించే వరకు తెలంగాణ 10 జిల్లాల్లో జరిగే సీఎండీ సమీక్ష సమావేశాలను అడ్డుకుంటామని చెప్పారు. వ్యవసాయ రంగానికి అందించాల్సిన 7 గంటల విద్యుత్‌ను పగటిపూట 4 గంటలు, రాత్రి 3 గంటలు సరఫరా చేయాల్సి ఉండగా సీమాంధ్ర అధికారుల ఆదేశాల మేరకు సబ్‌స్టేషన్ అధికారులు పగటిపూట 3 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. 2006లో నియామకమైన సీజేఎల్‌ఎంల కార్మికుల కుటుంబాల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులకు ఒక నీతి, తెలంగాణ ఉద్యోగులకు ఒక నీతిగా సీఎండీ రిజ్వి కార్మికులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కేవీఎన్‌రెడ్డి, పి.కృష్ణయ్య, అశోక్‌కుమార్, జిల్లా కన్వీనర్ పి.కరెంట్‌రావు, కోకన్వీనర్లు సిహెచ్.శ్రీనివాస్, మడుపోజు సురేష్‌కుమార్, కాంట్రాక్టు జూనియర్ లైన్‌మెన్‌ల నాయకులు ఉమా మహేశ్వర్, శ్రీనివాస్, గంజి వెంకన్న, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు మురళి, రవినాయక్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమీక్ష సమావేశానికి ‘తెలంగాణ సెగ’
Published Thu, Sep 12 2013 1:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement