నీళ్లు దూకని సొరంగాలు! | SLBC tunnel project details: Telangana | Sakshi
Sakshi News home page

నీళ్లు దూకని సొరంగాలు!

Published Sun, Feb 23 2025 2:20 AM | Last Updated on Sun, Feb 23 2025 2:20 AM

SLBC tunnel project details: Telangana

రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగాల పనులు

2005 ఆగస్టులో పనులు ప్రారంభించిన వైఎస్సార్‌ సర్కారు 

43.93 కిలోమీటర్ల తొలి సొరంగం.. 34.71 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి 

తరచూ ఆటంకాలు.. వరదలతో 2019లో ఇన్‌లెట్‌లో నిలిచిపోయిన తవ్వకం 

టన్నెల్‌ తవ్వే మెషీన్‌ బేరింగ్‌ చెడిపోవడంతో ఔట్‌లెట్‌లో 2023 జనవరిలో నిలిచిన పనులు  

అమెరికా నుంచి ప్రత్యేక నౌకలో పరికరాలను రప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  

ఇంతలో ప్రమాదం జరగడంతో పనుల పునః ప్రారంభంపై ప్రభావం 

ఎంత వేగంగా బాగుచేసినా ఏడాది పడుతుందంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత 516 గ్రామాలకు తాగునీటిని గ్రావిటీ ద్వారా అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టు (ఏఎమ్మార్పి –ఎస్‌ఎల్‌బీసీ)ను ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని నిర్ణయించిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో 306ను విడుదల చేసింది. అయినా పనులు మొదలుకాలేదు. తర్వాత 22 ఏళ్ల వరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు తిరిగి జీవం పోశారు. రూ.2,813 కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2005 ఆగస్టు 11న పరిపాలన అనుమతులు జారీ చేశారు. 2006లో సొరంగం పనులకు శంకుస్థాపన జరిగింది. 

రెండు సొరంగాలతో ప్రాజెక్టు.. 
భూసేకరణ, ఇతర వ్యయాలు పోగా.. రెండు సొరంగాల నిర్మాణానికి రూ.2,259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా.. రూ.1,925 కోట్లను కోట్‌ చేసి జేపీ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ పనులను దక్కించుకుంది. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట (ఇన్‌లెట్‌) నుంచి నల్లగొండ జిల్లాను ఆనుకొని ఉన్న మన్నెవారిపల్లి (ఔట్‌లెట్‌) వరకు 43.930 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పుతో తొలి సొరంగాన్ని ప్రతిపాదించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఈ తొలి సొరంగం ద్వారా తరలించి లింక్‌ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి చేర్చాల్సి ఉంది. అక్కడి నుంచి లింక్‌ కాల్వతో 7.13 కిలోమీటర్ల రెండో సొరంగ మార్గంలో తరలించి.. మరో లింక్‌ కాల్వ ద్వారా పెండ్లిపాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి నీటిని చేర్చాల్సి ఉంది. 

రెండు వైపుల నుంచి తవ్వకాలు.. 
43.93 కిలోమీటర్లతొలి సొరంగానికి గాను ఇప్పటివరకు 34.71 కిలోమీటర్ల మేర పనిపూర్తవగా.. మరో 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఈ సొరంగాన్ని రెండు టన్నెల్‌ బోర్‌ మెషీన్ల (టీబీఎం)తో రెండు వైపుల (ఇన్‌లెట్, అవుట్‌లెట్‌) నుంచి తవ్వుకుంటూ వెళుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌లెట్‌ నుంచి 13.93 కి.మీ. పనులు పూర్తవగా.. అవతల మన్నెవారిపల్లి (ఔట్‌లెట్‌) వైపు నుంచి మరో 20.43 కి.మీ తవ్వకం పూర్తయింది.

మధ్యలో 9.55 కి.మీ మేర సొరంగం తవ్వాల్సి ఉంది. మరోవైపు డిండి రిజర్వాయర్‌ నుంచి నీళ్లను పెండ్లిపాక రిజర్వాయర్‌కు తరలించడానికి చేపట్టిన 7.13 కిలోమీటర్ల రెండోసొరంగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కానీ అందులో 3.84 కి.మీ. సొరంగానికి మాత్రమే లైనింగ్‌ పూర్తవగా.. మిగతా 3.29 కి.మీ ప్రాంతానికి లైనింగ్‌ చేయాల్సి ఉంది. 

మరికొన్ని రోజుల్లో పరికరాలు వస్తాయనగా.. 
2019లో వచి్చన భారీ వర్షాలు, వరదల కారణంగా ఇన్‌లెట్‌ టన్నెల్‌లోకి సీపేజీ పెద్ద ఎత్తున రావడంతో పనులు ఆగిపోయాయి. అప్పటి నుంచి నీటిని తొలగించే ప్రక్రియ మాత్రమే నడుస్తోంది. మరోవైపు ఔట్‌లెట్‌ వైపు రాయి గట్టిదనం ఎక్కువగా ఉండటంతో టన్నెల్‌ బేరింగ్‌ మెషీన్‌ బేరింగ్, అడాప్టర్, రింగ్‌ బేర్‌ దెబ్బతిని 2023 జనవరి 29న పనులు నిలిచిపోయాయి. అమెరికాకు చెందిన రాబిన్స్‌ కంపెనీ నుంచి బేరింగ్‌ను కొనుగోలు చేసి.. ప్రత్యేక నౌక ద్వారా మన దేశానికి తరలిస్తున్నారు.

భారీ పరిమాణంలో ఉండే ఈ పరికరాలు చెన్నైకి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు వైపులా తవ్వకాలను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌లెట్‌ నుంచి తవ్విన సొరంగంలో సీపేజీ (నీటి ఊటలు)ను నియంత్రించేందుకు గ్రౌటింగ్‌ చేస్తున్నారు. అయితే తాజా ప్రమాదం కారణంగా ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. టన్నెల్‌లో డీవాటరింగ్‌ చేసి, సీపేజీలో ఉన్న టీబీఎం మెషీన్‌ను బాగుచేసి పనులు ప్రారంభించాలంటే.. కనీసం ఏడాది సమయం పడుతుందని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు వివరాలివీ.. 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగాల పనుల తొలి అంచనా వ్యయం రూ.2,813 కోట్లు 
⇒ గత ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన అంచనా వ్యయం: రూ.4,637.75 కోట్లు 
⇒ ప్రాజెక్టులో ఇప్పటివరకు పూర్తయిన పనుల విలువ: రూ.2,689.47 కోట్లు 
⇒ ఇంకా జరగాల్సిన పనుల విలువ: రూ.1,948 కోట్లు  

⇒ పరిపాలన అనుమతులు జారీ అయినది: 2005 ఆగస్టు 11 
⇒ నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌తో ఒప్పందం జరిగినది: 2005 ఆగస్టు 28 
⇒ ప్రాజెక్టులోని సొరంగాలు: రెండు 
⇒ తొలి సొరంగం పొడవు: 43.93 కిలోమీటర్లు  

⇒ ఇందులో తవ్వకం పూర్తయిన నిడివి: 34.71 కిలోమీటర్లు 
⇒ రెండో సొరంగం పొడవు: 7.13 కిలోమీటర్లు (మొత్తం పూర్తయింది) 
⇒ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నీరందే ఆయకట్టు: 4.15 లక్షల ఎకరాలు 
⇒ తాగునీరు అందే ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలు: 516 
⇒ టన్నెల్స్‌ పూర్తికి ప్రస్తుత సర్కారు విధించుకున్న గడువు: 2026 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement