గ్రేటర్‌లో ఇటీవల బహుళ అంతస్తుల భవనాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ఎక్కువగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల వల్లే జరుగుతున్నాయి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే... చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ జనరల్(సీఈఐజీ) అధికారుల అవినీతి..నిర్లక్ష్యమనే ఆరోపణలు వెలువడుతున్నాయి. షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, అపార్ట్‌మెంట్లు వంటి పెద్ద పెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు సీఈఐజీ అనుమతి తీసుకోవాలి. కేబుల్ లైన్లు, స్విచ్‌బోర్డులు, వైరింగ్, ప్లగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ లైన్ల వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి..అన్నీ బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి.
కానీ నగరంలో అలా జరగడం లేదు. సంబంధిత అధికారులకు లంచాలిస్తే ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో ఆయా భవనాల్లో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుని కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా...వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. వాస్తవంగా పెద్ద భవనాల్లో ఎలాంటి విద్యుత్ పరికరాలు, వైర్లు వాడాలో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ వీటిని ఎవ్వరూ పాటించడం లేదు.
సాక్షి, సిటీబ్యూరో : అపార్ట్‌మెంట్లు, మాల్స్, ఫ్యాక్టరీలు వంటి పెద్దపెద్ద భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే ముందు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ జనరల్ (సీఈఐజీ)అనుమతి తప్పనిసరి. కేబుల్ లైన్లు, వైరింగ్, స్విచ్ బోర్డులు, ప్లగులు వంటి పరికరాల నాణ్యతను పరిశీలించి.. అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్థారించుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలి. కానీ కాస్త డబ్బులు ముట్టజెపితే చాలు సీఈఐజీ అధికారులు ఆయా కట్టడాలను, ఇందులోని విద్యుత్ పరికరాలను చూడకుండానే ధృవీకరణ పత్రం ఇచ్చేస్తున్నారు. అధికారుల అవినీతి దాహానికి విద్యుత్ ప్రమాదాల వల్ల రూ.కోట్ల రూపాల ఆస్తి బుగ్గిపాలవుతోంది. అనేక మంది అమాయకులు మృత్యు వాతప డుతున్నారు. ప్రస్తుతం నగరంలో సగానికిపైగా మాల్స్, అపార్టుమెంట్లలో విద్యుత్ వైరింగ్ నాశిరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాసిరకం వైరింగ్‌తో ప్రమాదం
రీసైకిల్డ్ కాపర్(వాడేసిన రాగి లోహం)తో తయారు చేసిన వైర్లతో చేసే వైరింగ్ చాలా నాసిరకంగా ఉంటుంది. ఇలాంటి వాటిపై ఇన్సులేషన్‌గా వాడే ప్లాస్టిక్ పదార్థం వేడికి వెంటనే కరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్రతి సర్క్యూట్‌కు కనీసç లోడు మాత్రమే పడే విధంగా చూడాలి. స్వచ్ఛమైన కాపర్ ఐఎస్–694 ప్రమాణాలకు సరిపోయే ఎలక్ట్రికల్ వైర్లనే వాడాలి. ప్రతి గదిలో తప్పనిసరిగా ఎంసీబీ ఉండాలి. గీజర్స్, ఏసీ వంటి వాటికి ఓ విడి న్యూట్రల్‌తో స్వతంత్ర సర్క్యూట్‌ను మెయిన్‌బోర్డు నుంచి తీసుకెళ్లాలి. లైట్‌లోడ్(బల్బు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్స్)కు 1.5 ఎస్‌క్యూ ఎంఎం కాపర్ క్రాస్‌సెక్షనల్ వైరింగ్‌ను, మీడియం లోడు (టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మ్యూజిక్ సిస్టం)కు 2.5 ఎస్‌క్యూ ఎంఎం కాపర్ సెక్షనల్ వైర్‌ను, హెవీలోడ్(ఏసీలు, గ్రీజర్స్, గ్రైడింగ్, వాషింగ్ మెషీన్స్)కు 4.0 ఎస్‌క్యూ ఎంఎం వైర్లను వాడాలి. ఎర్త్‌కు ఆకుపచ్చ, న్యూట్రల్‌కు నలుపు, లైవ్(కరెంట్ సరఫరా చేసే) దానికి పసుపు, నీలం రంగు వైర్‌ను వాడాలి.
ఒక వేళ త్రీఫేజ్ వైరింగ్‌పై విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తే, సరఫరా భారం లైన్లపై సమానంగా ఉండేలా చూడాలి. డిమాం డ్‌కు సరిపడ్డ కేబుళ్లను వేయడంతో పాటు కేబుల్ కన్నా తక్కువ కెపాసిటీ గల ఫ్యూజ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. కేబుల్ ఎంత పెద్దదైతే.. రెసిస్టెన్స్ అంత తక్కువ. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల పెరిగే ఉష్ణోగ్రత నుంచి కాపాడుతుంది. ప్రతి బోర్డుపై మూడు పిన్నుల ప్లగ్గు విధిగా వాడటంతో పాటు వైర్ల మధ్య జాయింట్స్ తక్కువ ఉండేలా చూడాలి. ప్రతి 15 ఏళ్లకోసారి వైరింగ్ మార్చాలి. 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. నగరంలో జరుగుతున్న నిర్మాణాలకు చాలావరకు ఈ స్థాయి ప్రమాణాలు పాటించడం లేదు. పైగా ఆయా ప్రమాణాలను పూర్తిస్థాయిలో సీఈఐజీ అధికారులు పరిశీలించనూ లేదు. దీంతో భవన నిర్మాణ దారులు కరెన్సీ నోట్లను ఎరవేసి అధికాలతో పనిచేయించుకుంటున్నారు. ఆనక ప్రమాదాలు జరిగితే సామాన్యులు మూల్యం చెల్లిస్తున్నారు.
తనిఖీ చేయకుండానే అనుమతి
గ్రేటర్ హైదరాబాద్‌లో 40 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఐదు లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు. చిన్న, భారీ, మధ్య తరహా పరిశ్రమలు మరో 45 వేలకు పైగా ఉన్నాయి. పది వేలకుపైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దరఖాస్తు దారునికి సంబంధించిన అపార్ట్‌మెంట్స్, మాల్స్, కంపెనీలను సీఈఐజీ అధికారులు స్వయంగా సందర్శించి, ఆయా సంస్థల విద్యుత్ అవసరాలు, విద్యుత్ లైన్ల నిర్మాణం, సరఫరా కోసం వాడిన కేబుల్స్ సామర్థ్యం, ఎలక్ట్రీషియన్ అర్హతలు, అనుభవం, వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలి. అంతేకాదు అన్నీ సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే కాంట్రాక్టర్లకు ఎ,బి,సి గ్రేడ్ లైసెన్స్ కూడా మంజూరు చేయాలి. కానీ సీఈఐజీ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల షేక్‌పేట్ ట్రాన్స్‌కో ఇంజినీర్ ఇదే పేరుతో ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎవరికి వారు సొంతంగా కొంత మంది ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment