నీ అంతుచూస్తా.. | attack on Constable | Sakshi
Sakshi News home page

నీ అంతుచూస్తా..

Published Tue, Mar 15 2016 4:34 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

attack on Constable

నడిరోడ్డుపై ఉన్న కారును అడ్డుతీయమన్న కానిస్టేబుల్‌పై వీరంగం,
స్థంభించిన ట్రాఫిక్

 
నెల్లూరు(క్రైమ్) : ఓ వ్యక్తి తన కారును నడిరోడ్డుపై నిలిపి పండ్లు కొంటున్న తరుణంలో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కారును  రోడ్డుపక్కగా పెట్టమని కోరినందుకు కారు డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న వారు కానిస్టేబుల్‌పై వీరంగం చేశారు. ‘నీకెంత ధైర్యం రా.. నా కారునే ఆపుతావా.. నీ అంతుచూస్తా.. ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా’ అంటూ దౌర్జన్యానికి పూనుకున్నారు.  ఈసంఘటన సోమవారం రాత్రి ఏసీ కూరగాయలమార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. సౌత్‌ట్రాఫిక్ కానిస్టేబుల్ సందీప్ కూరగాయల మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సింహపురి ఎలక్ట్రికల్స్ షాపు ఎదురుగా ఓ వ్యక్తి కారును నడిరోడ్డుపై ఆపాడు. అందులో ఉన్న మహిళలు పండ్లు కొంటుండగా ట్రాఫిక్ స్థంభించింది.

ఈవిషయాన్ని గమనించిన సందీప్ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది, అక్కడ నుంచి కారు తీయాలని డ్రైవర్‌కు సూచించాడు. అయినా అతడిని పట్టించుకోకపోవడంతో దగ్గరకు వెళ్లి కారును తీయమని గద్దించాడు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. ఇంతలో కారులో వచ్చిన మహిళ కానిస్టేబుల్ వద్దకు వచ్చి ఎంత ధైర్యముంటే నా డ్రైవర్‌నే తిడుతావా అంటూ కానిస్టేబుల్‌ను నానా దుర్భాషలాడింది. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్థంభించింది. కూరగాయల వ్యాపారులు, మార్కెట్‌కు వచ్చిన నగర వాసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా శాంతించని సదరు మహిళ వారిని ఏకవచనంతో సంబోధించి నానా దుర్భాషలాడింది. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్‌ను నీ అంతుచూస్తా?  అంటూ తన బందువులకు ఫోనుచేసి అక్కడకు పిలిపించింది. దీంతో కానిస్టేబుల్ సైతం తన సహచరులను పిలిపించుకుని వివాదం విషయాన్ని ట్రాఫిక్ డీఎస్పీ రామారావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొనేలోపే కారుడ్రైవర్ కారువేగాన్ని పెంచి కానిస్టేబుల్స్‌ను తోసుకుంటూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. 

తమను నానా దుర్భాషలాడారని, ఇలాగైతే తాము ఉద్యోగం చేయలేమని బాధితుడితోపాటు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన విషయాన్ని బాధితుడు నేరుగా  జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ దృష్టికి తీసుకెళ్లాడు. తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాడు. ఇది ఇలా ఉంటే జరిగిన ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా, ఫొటోగ్రాఫర్లపై మహిళ, ఆమె తరపువారు తీవ్ర పదజాలంతో దూషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement