కొలిమిగుండ్ల, న్యూస్‌లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్‌లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్‌లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది.
కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్‌కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్‌లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్‌లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్‌లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్‌ఐ రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులకు తప్పిన ముప్పు..
తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్‌ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం..
తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉసురు తీసిన విద్యుత్
Published Mon, Jan 13 2014 4:26 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement