Dhobighat
-
బీఆర్ఎస్ సర్కార్ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు
సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు. -
ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమిస్తే ఉతికేస్తాం
రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు కర్నూలు(అర్బన్)/న్యూసిటీ: జిల్లాలోని ఆదోని పట్టణంలో ధోబీఘాట్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వమే ఇతర అవసరాల పేరిట ఆక్రమించాలని చూస్తే ఉతికి ఆరేస్తామని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాంబాబు హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక బీసీ భవన్లో ఆదోని నుంచి తరలి వచ్చిన వందలాది మంది రజకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆదోని పట్టణ రజక సంఘం అధ్యక్షుడు పి.ఉసేని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కె.రామక్రిష్ణ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు, వీఆర్పీఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మహేంద్రనాయుడు, రజక సంఘం రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, నాయకులు కేతూరి మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతు ఆదోనిలో దాదాపు 700 పైగా రజక కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. వీరి జీవనోపాధికై 1914లో సర్వే నెంబర్లు 239, 240, 241, 242లో 15.18 ఎకరాల భూమిని ధోబీఘాట్ల నిర్మాణానికి కేటాయించారన్నారు. అప్పటి నుంచి రజకులు అక్కడే తమ కుల వృత్తి సాగిస్తున్నట్లు చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్నా.. ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలంలో దాదాపు 70 శాతం భూమి వివిధ అవసరాలకు ఉపయోగించుకోగా, ప్రస్తుతం 30 శాతం భూమి మాత్రమే మిగిలిందని రాంబాబు తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని కూడా మైనారిటీ హాస్టల్ నిర్మాణానికి లాక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ విషయంలో వారం రోజులుగా ఆదోని రజకులు సహాయ నిరాకరణ చేపడుతున్నా, రాజకీయ నాయకులు కానీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ధోబీఘాట్ స్థలాన్ని కాపాడేందుకు వెంటనే ప్రహరీ నిర్మించి, రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో రజక మహిళా సంఘం నాయకురాలు మంగమ్మ, నాయకులు ముక్కన్న, పి.వెంకటేష్, రజక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగరాజు, గురుశేఖర్, గౌరవాధ్యక్షుడు సి.గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన విద్యుత్
కొలిమిగుండ్ల, న్యూస్‌లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్‌లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్‌లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్‌కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్‌లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్ఐ రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తప్పిన ముప్పు.. తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు.