దాడులకు తెగబడుతున్న అనగాని అనుచరగణం
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు
రాంబోట్లవారిపాలెం నేత రాజ్‌కుమార్‌పై టీడీపీ దాడి
కులంపేరుతో దూషించి కొట్టి తీవ్రంగా గాయపరిచిన వైనం
చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లోను వరుస దాడులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారం అండతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను తగులబెడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఊరు వదిలిపోవాలని హెచ్చరిస్తున్నారు. వెళ్లనివారిపై దాడులు చేసి కొడుతున్నారు. తీవ్రంగా గాయపరుస్తున్నారు. నాయకులపై దాడులు చేయడంతోపాటు వారి ఆస్తులకు నష్టం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో ఈ తరహా దాడులు పెచ్చుమీరాయి.
ఆదివారం రాత్రి చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ నాయకుడు చేబ్రోలు రాజ్‌కుమార్ ఇంటిపై 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడిచేశారు. రాజ్‌కుమార్‌ను కులం పేరు పెట్టి రాయలేని పదజాలంతో దూషించారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తావా..? అంటూ దాడిచేసి తీవ్రంగా కొట్టారు. బయటకు లాక్కొచ్చి ఇంటిమెట్లపైన, ఇంటిముందున్న ఇసుక దిబ్బపైన పడేసి మళ్లీమళ్లీ కొట్టారు. దాడివిషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో రాజ్‌కుమార్ కొనప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను తొలుత రేపల్లె ఆస్పత్రికి తరలించారు. తరువాత తెనాలి ఆస్పత్రిలో చేర్చారు.
తనను ఊరువదలి వెళ్లిపోవాలని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారని రాజ్‌కుమార్ తెలిపారు. రాం»ొట్లవారిపాలెం, పగడంవారిపాలెం, పిట్టుకోటిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడి చేసినట్లు బాధితుడు సోమవారం జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని టీడీపీ మూకలు బెదిరిస్తున్నాయి.
చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, న్యాయవాది కర్ర ప్రతాప్ ఇంటిపై దాడిచేసి ఆయన ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. గుళ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవి సర్పంచ్ ఏమినేని రాంబాబు ఇంటిపై దాడిచేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఊర్లు వదలివెళ్లాలని నిత్యం బెదిరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment