అనంతపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో పేట్రేగిపోయిన మూకలు
కాకినాడ జిల్లా ‘మండపం’లో వైఎస్సార్‌సీపీ నేతపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
పల్నాడు జిల్లాలో మరో నేత ఇంటిపై దాడికి యత్నం
అడ్డుకోబోయిన ఆయన తల్లి తలకు తీవ్రగాయం
కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ స్కార్పియో వాహనానికి నిప్పు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/శంఖవరం/కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అలాగే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌కు చెందిన స్కార్పియో వాహనానికి టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడిచేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఆయన తల్లిని టీడీపీ మూకలు నెట్టడంతో ఆమె కిందపడగా తలకు బలమైన గాయమైంది. వివరాలివీ..
ప్రత్తిపాడులో మూకుమ్మడి దాడి
పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్‌సీపీ శుక్రవారం ప్రత్తిపాడులో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి శంఖవరం మండలం ‘మండపం’ గ్రామం నుంచి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మండపం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుండుబిల్లి నానాజీ ప్రత్తిపాడు వెళ్లేందుకు తన పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్నారు.
ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పొలం చిన్నా, పిల్లి రమేష్, సుంకర వెంకటసూరి, చలమశెట్టి మానీలు, సుంకర శివ, ఉటుకూరి రమణ, మరో పాతిక మంది ఆ మార్గంలో కాపు కాశారు. అటుగా వస్తున్న నానాజీపై మూకుమ్మడిగా కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో నానాజీ తలకు, మెడకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అపసార్మక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మండపం గ్రామ సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం తదితరులు నానాజీని హుటాహుటిన తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు నక్కా మాణిక్యం, గట్టెం దివాణంపై టీడీపీ నేతలు మారణాయుధాలు, కర్రలతో దాడిచేశారు. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
పల్నాడు జిల్లాలోనూ దాడి..
అడ్డుకోబోయిన మహిళకు తీవ్రగాయం..
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు దరువూరి వెంకటేశ్వర్లు మరికొంత మంది దాడిచేశారు. అనంతరం సాయంత్రం మరో నేత ఇంటూరి వీరయ్యపై దాడి నిమిత్తం ఆయన ఇంటి మీదకు వెళ్లారు. దాడిచేసే క్రమంలో అడ్డువచ్చిన వీరయ్య తల్లి ఇంటూరి శిరోమణిని నెట్టడంతో ఆమె వెనక్కి సీసీ రోడ్డుపై పడింది. దీంతో ఆమె తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కారుకు నిప్పు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 23వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అర్చన, హరిప్రకాష్ దంపతులకు చెందిన స్కార్పియో వాహనానికి (ఏపీ16బీ2 6066) గుర్తుతెలియని దుండగులు గురువారం అర్థరాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కౌన్సిలర్ దంపతులు బయటకు రాగా.. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనపై హరిప్రకాష్ టీడీపీకి చెందిన వారిపై పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తనపై కక్ష సాధింపులో భాగంగానే ఈ ఘటనకు ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీకి చెందిన పూజారి మహేష్, బోయ తిప్పేస్వామిలకు గతంలో రూ.8.50 లక్షలు అప్పుగా ఇచ్చానని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని ఇటీవల అడిగితే దౌర్జన్యానికి దిగారని తెలిపారు. ఈ క్రమంలోనే తనను భయపెట్టేందుకు ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారనే ఆయన అనుమానం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment