వైఎస్సార్‌సీపీ దళిత నేతపై టీడీపీ గూండాల దాడి | YSRCP Dalit leader attacked by TDP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ దళిత నేతపై టీడీపీ గూండాల దాడి

Published Sat, Dec 7 2024 5:18 AM | Last Updated on Sat, Dec 7 2024 5:18 AM

YSRCP Dalit leader attacked by TDP

భార్య, కన్నబిడ్డల ముందే చితకబాదిన పచ్చమూకలు 

తీవ్రంగా గాయపడ్డ సెంథిల్‌కుమార్‌ 

పాకాల :  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోతోంది. టీడీపీ నాయకులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోనని దళితులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. తాజాగా.. గురువారం రాత్రి పాకాల మండల కేంద్రంలోని రామకృష్ణ డీలక్స్‌ సినిమా థియేటర్‌లో వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు సెంథిల్‌కుమార్‌పై టీడీపీ గూండాలు కర్రలతో, పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు..  పుష్పా–2 సినిమాకు తన భార్య అరీషా, కుమార్తెలు శ్రీజ, మనుశ్రీలను సెంథిల్‌కుమార్‌ పంపించారు. 

విశ్రాంతి సమయంలో తన పిల్లలకు స్నాక్స్‌ ఇచ్చి తిరిగి బయటకొస్తున్న సెంథిల్‌కుమార్‌ను టీడీపీ గూండాలు గమనించి దాడికి తెగబడ్డారు. ముందుగా ఆయన్ను వెనుక నుంచి తన్నడంతో కింద పడిపోయారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పచ్చమూకలు భారతంమిట్టకు చెందిన బొల్లినేని సురేష్, కమతంపల్లికి చెందిన మోహన్‌నాయుడు, బావిరాగన్న చెరువు గ్రామానికి చెందిన గోవర్థన్‌ (గోకుల్‌), గెడ్లచేనుకు చెందిన చరణ్‌ తీవ్రంగా కొట్టారు. 

విషయం తెలుసుకున్న అరీషా సినిమా థియేటర్‌ నుంచి బయటికొచ్చి తన భర్తను కొట్టకండని ప్రాథేయపడ్డారు. అయినాసరే భార్య, కన్నబిడ్డల ముందే సెంథిల్‌కుమార్‌ని చితకబాదారు. చిన్న పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా సెంథిల్‌కుమార్‌ని చంపడానికి యత్నించారు. సినిమా చూడ్డానికి వచ్చిన కొందరు అడ్డుకున్నప్పటికీ వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అలాగే, ఈ దాడిని చిత్రీకరిస్తున్న వారి సెల్‌ఫోన్లను లాక్కొని పగలగొట్టారు. ఈ ఘటనలో సెంథిల్‌కుమార్‌కి మెడపైన, ఎడమ కన్నుపై, పక్కటెముకలకు తీవ్రగాయాలవడంతో ఆయన్ని చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం పి.కొత్తకోటలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాక సెంథిల్‌కుమార్, అతని భార్య అరీషా శుక్రవారం దాడిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. టీడీపీ గూండాలు కులం పేరుతో దూషిస్తూ, మా ప్రభుత్వంలో మా ముందుకొచ్చి కూర్చునే అంత దమ్ముందా అంటూ తనపై దాడిచేశారని సెంథిల్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు విన్నవించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement