న్యూస్‌లైన్ నెట్‌వర్క్: జిల్లాలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని చర్ల, కూనవరం, చింతూరు, గుండాల, టేకులపల్లి మండలాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చర్ల మండలంలో గాలిదుమారం....
చర్ల: చర్ల మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలిదుమారం కారణంగా పలు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరి గాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో తీగలు తెగడంతో పాటు, స్తంభాలు విరిగిపోయాయి. మండలంలోని రాళ్లగూడెంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దేవరాపల్లి, కుదునూరు, ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం, కలివేరు, గాంధీనగరం తదితర గ్రామాల్లో పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి.
దేవరాపల్లిలో 11కేవీ విద్యుత్ లైన్‌కు సంబంధించిన స్తంభాలు విరిగిపోగా, గొమ్ముగూడెంలో ఎల్‌టీ లైన్‌కు సంబంధించిన స్తంభం విరిగి పోయింది. చినమిడిసిలేరు, ఆంజనేయపురం, కలివేరు గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు, తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లింగాపురం, గొంపల్లి, విజయకాలనీ, గుంపెన్నగూడెం తదితర గ్రామాలలో సైతం విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది.
మండలంలోని సత్యనారాయణపురం, చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని అన్నీ 11 కేవీ విద్యుత్ ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో మండలం మొత్తం అంధకారం నెలకొంది. చర్ల మండలంతో పాటు వెంకటాపురం వాజేడు మండలాలలకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్‌లో కూడా పలు చోట్లు చెట్లు తీగలపై పడడంతో ఆ రెండు మండలాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గుండాలలో భారీ వర్షం...
గుండాల: గుండాల మండలంలో శనివారం రాత్రి గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలువాగులు, వంకల్లో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఈ వర్షానికి మల్లన్నవాగు, కిన్నెరసాని, జలేరు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతర్గత రోడ్లు బురదతో నిండిపోయాయి. ఇల్లెందు - గుండాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలిదుమారానికి పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు.
కూనవరంలో గాలి దుమారం...
కూనవరం: మండలంలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీగా గాలి దుమారం రావడంతో జనజీవనం అతలాకుతలం అయింది. మండలంలోని పల్లురు గ్రామంలో వందేళ్లనాటి భారీ వృక్షం ఒక పక్కనే ఉన్న సవలం భద్రమ్మ ఇంటిపై కూలింది. ఇంట్లోని వారంతా సమీప గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసం అయింది. టేకులబోరు సమీపంలో ఓ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మర్రిగూడెం-పల్లూరు గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. గాలివాన కారణంగా మండలం కేంద్రంలోని పళ్ల పైకప్పులు లేచిపోయాయి. సుమారు గంటన్నర పాటు వీచిన గాలిన వాన బీభత్సం కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగి పడడంతో రాకపోకలు స్తంభించాయి.
టేకులపల్లిలో వర్షం
టేకులపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీల్లో మురుగునీరు బయటకు వచ్చింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం కారణంగా మండలంలోని ముత్యాలంపాడు, బొమ్మనపల్లి పంచాయతీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చింతూరులో...
చింతూరు: మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చింతూరు, మోతుగూడెం రహదారిలో ఎర్రంపేట నుంచి లక్కవరం జంక్షన్ వరకు సుమారు 20 చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చింతూరు, వీఆర్‌పురం రహదారిలో కూడా చింతూరు, చూటూరుల నడుమ పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు చింతూరులోని శబరిఒడ్డులో పిసిని సోమరాజుకు చెందిన ఇంటిపై మామిడిచెట్టు కూలడంతో ఇల్లు కుప్పకూలింది. ఈదురు గాలుల ధాటికి పెదశీతనపల్లిలో వంజం పాపారావుకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గాలిదుమారం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో మండలం లోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జిల్లాలో గాలివాన బీభత్సం
Published Sun, May 25 2014 2:36 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement