సాక్షి, ఖమ్మం: జిల్లాలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. గాలివానతో కొత్తగూడెం అతలాకుతలమైంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లుకూలి విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో రాత్రి వరకు పట్టణమంతా అంధకారంలోనే ఉంది. ప్రధానంగా కేటీపీఎస్ నుంచి సీతరామపట్నం వచ్చే విద్యుత్ లైన్ ట్రిప్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిం ది. అలాగే లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడి రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరాఫర లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
కొత్తగూడెం మండలంలోని రామవరం, రుద్రంపూర్, ధన్‌బాద్, ఎస్సీబినగర్, ప్రశాంతినగర్, 4 ఇంక్లైన్, గౌతంపూర్, వెంకటేష్‌ఖని, పెనుబల్లి, గరిమెళ్లపాడు, త్రీ ఇంక్లైన్, చుంచుపల్లి, సుజాతనగర్, అనిశెట్టిపల్లి, కారుకొండ, హేమచంద్రాపురం, సర్వారం, సింగభూపాలెం, సీతారాంపురం, రేగళ్ల, మైలారం, బంగారుచెలక, లక్ష్మిదేవిపల్లి, చాతకొండ పెనగడప పంచాయతీల్లో కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ స్తంభాల తీగలు తెగిపడ్డాయి. గాలివానతో కొత్తగూడెం పట్టణం, మండలంలో ట్రాన్స్‌కోకు భారీ నష్టం వాటిల్లింది. పాల్వంచలో భారీ వర్షంతో జాతీయ రహదారిపై పాత పాల్వంచ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో సుమారు 4 గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
కిలోమీటరు మేరకు వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపల్, పోలీసు అధికారుల చొరువతో సిబ్బంది చెట్టును తొలగించడంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఖమ్మం నగరంలో సాయంత్రం కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. గాలి దుమారంతో రాత్రి 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బయ్యారం మండలం జగ్గూతండలో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైరా, కొణిజర్ల, మధిర, చింతకాని మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలు గ్రామాల్లోన్ని వీదులన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలన్నీ అంధకారంగా మారాయి.
గాలి.. వాన...
Published Wed, May 28 2014 3:05 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement