సైనికుల్లా పనిచేయండి
Published Sun, Oct 13 2013 3:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తుపాను సమయంలో సైనికుల్లా పనిచేసి ప్రజలను కాపాడాలని, ఒక్కరి ప్రాణం కూడా పోకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆస్తినష్టాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పై-లీన్ తుపాను 1996 తర్వాత వచ్చిన అతిపెద్ద తుపానని అభివర్ణించారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశిం చారు.
ఈ కేంద్రాల్లో ఉన్నవారికి భోజనం, పిల్లలకు పాలు, తాగునీరు, విద్యుత్తుకు అంతరాయం లేకుండా ఉండేందుకు జనరేటర్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లబోమని చెప్పేవారిని బలవంతంగా తరలించే అధికారం కలెక్టర్‌కు ఉందన్నారు. నౌకాదళం, ఆర్మీ, ఎన్‌ఆర్‌డీఎఫ్, కోస్టుగార్డు సిబ్బంది ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరై సహాయ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. నిధుల కొరత లేనందున జిల్లా యంత్రాం గం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుని నష్టాన్ని నివారించాలని ఆదేశించారు. రెండురోజులపాటు నిద్రాహారాలు మాని పని చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కోండ్రు మురళి, జిల్లా ప్రత్యేకాధికారి జి.వెంకట్రామిరెడ్డి, ఎస్పీ నవీన్ గులాఠీ, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
సహాయ, పునరావాస చర్యలపై సంతృప్తి
శ్రీకాకుళం రూరల్: జిల్లాలో తుపాను సహాయ, పునరావాస చర్యలపై మంత్రి రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి గ్రామ పాఠశాలలో ఏర్పాటుచ చేసిన పునరావాస కేంద్రా న్ని మంత్రి కోండ్రు మురళి, కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ నవీన్‌గులాఠీలతో కలిసి సందర్శించారు. పునరావాస కేంద్రంలో నాలుగు రోజులకు సరిపడా ఆహార సామగ్రి, తాగునీటి ప్యాకెట్లు, జనరేటర్ ఉండటం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఉన్న కుందువానిపేట గ్రామస్తులు 600 మంది కోసం తయారు చేస్తున్న వంటలను పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంకా ఉండిపోయినవారిని పునరావాస కేంద్రానికి తీసుకురావాలని యువతను కోరారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం కావాలని అధికారులు, యువతకు స్పష్టం చేశారు.
86,500 మంది తరలింపు
శనివారం మధ్యాహ్నం నాటికి జిల్లాలోని 52 పునరావాస కేంద్రాలకు 61,500 మందిని, తుపాను రక్షిత కేంద్రాలకు మరో 25 వేల మందిని తరలించామని కలెక్టర్ సౌరభ్ గౌర్ మంత్రికి వివరించారు. కనీసం లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పకడ్బందీ ఏర్పాట్లతో నష్టం పరిమితం
శ్రీకాకుళం కలెక్టరేట్ : తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంతో నష్టం పరిమితంగా ఉంటుందని భావిస్తున్నట్టు రాష్ట్ర వైద్య విద్య శాఖమంత్రి కోండ్రు మురళి చెప్పారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీసం లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని, అవసరమైతే పోలీసుల సహాయంతో బలవంతంగా తరలిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు అధికారులు చేసిన కృషిని ప్రశసించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ బి.రాంబాబు మాట్లాడుతూ నీటిపారుదలశాఖ కాల్వల్లో నీరు లేకుండా చేశామని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో 3 లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసేందుకు అవకాశముందని తెలిపారు. అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్యామల మాట్లాడుతూ తీరప్రాంత మండలాల్లో వైద్య సేవలందించేందుకు వైద్య బృందాలు, మందులను సిద్ధం చేశామని చెప్పారు. వ్యవసాయ శాఖ జేడీ ఎస్.మురళీకృష్ణారావు మాట్లాడుతూ 11 తీరప్రాంత మండలాల్లోని 50 వేల హెక్టార్లలో పంటలు వేశారని, వరికి నష్టం వాటిల్లే అవకాశం లేదని, పత్తి తదితర పంటలకు కొంతమేర నష్టం వాటిల్లవచ్చని వివరించారు. సమావేశంలో ఎస్పీ నవీన్‌గులాఠీ, డీఆర్‌వో నూర్‌భాషా ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
యువత సేవలను వినియోగించుకోవాలి
తుపాను ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు యువత సేవల ను వినియోగించుకోవాలని మంత్రి కోండ్రు సూచించారు. ఉదయం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు తుపాను తీవ్రత తెలియజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి జి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు రామనేవారిని బలవంతంగా తరలించాలని ఆదేశించారు. ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియమించిన 8 బృం దాలు పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. జనరేటర్లు, మెకానిక్‌లను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు 2 గ్రేహౌండ్స్ దళాలు, 6 ఏపీఎస్‌పీ దళాలు వస్తున్నాయని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే ఇబ్బందులు ఎదుర్కొనకుండా శాటిలైట్ ఫోన్లను సిద్ధం చేశామని చెప్పారు.
Advertisement