పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది
Published Sun, Oct 13 2013 4:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. ఏ విధమైన ప్రాణనష్టం జరగకపోయినా అపార ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వంశధార, నాగావళి నదులు ఆదివారం నుంచి పొంగిపొర్లే ప్రమాదం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. చిరుపొట్ట, పొట్టదశలో ఉన్న వరి పంటలకు వరదలు, గాలులతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ఇచ్ఛాపురంలో 50పైగా చెట్లు కూలిపోయాయి.
అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ, టెంట్లు ధ్వంసమయ్యాయి. గిలాయి వీధిలో చెట్లు పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. కండ్రవీధి జీఐసీ కాలనీలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈదురుగాలులకు విద్యుత్ లైన్లపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో కవిటి మండలంలో వందకుపైగా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటికి అవస్థలు ఎదురవుతున్నాయి. కుత్తుం, కొక్కిలిపుట్టుగ, కొన్నాయిపుట్టుగ, తలతంపర గ్రామాల ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించారు.
సంతబొమ్మాళి మండలంలో భావనపాడు, కొత్తపేట, ఎమ్.సున్నాపల్లి, లింగూడు, గద్దలపాడు, పాత మేఘవరం, డి.మరువాడ, ఎమ్.మరువాడ, సూరాడవానిపేట, చొక్కరవానిపేట, టెంకూరు తదితర 31 గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించింది. భావనపాడులో వలలతో పాటు మూడు తెప్పలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భావనపాడు, కొత్తపేట, వాడపేట, రెడ్డిలపేట, గద్దలపాడు, ఎమ్.సున్నాపల్లి తదితర గ్రామాల సమీపానికి సముద్రపు నీరు చేరింది. కొత్తపేటకు వెళ్ల్లే రహదారితో పాటు భావనపాడు రోడ్ కూడా కొంత మేరకు కోతకు గురైంది.
పలాస మండలం లొద్దభద్ర, అల్లుకోల రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లొద్దభద్ర, తర్లాకోట, కొత్తవూరు జంక్షన్‌లలో విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. బ్రాహ్మణతర్లా గ్రామంలో పొందర్లు పండిస్తున్న కూరగాయల మొక్కలు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, గుణుపల్లి తదితర తుఫాను ప్రభావిత గ్రామాలకు చెంది 8 వేల మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ, మంచినీళ్లపేట గ్రామాల్లో సముద్ర తీరం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. మందస మండలంలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్థంబాలు, కొబ్బరి, మామిడి, జీడి తదితర చెట్లు నేలకొరిగాయి.
ఎచ్చెర్ల మండలంలో ముప్పు ఎక్కువ ఉన్న గ్రామాలుగా గుర్తించిన డి.మత్స్యలేశం,బడివాని పేట,బుడగుట్ల పాలేంలలో శనివారం సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది. సాయంత్రం మరో ఐదడుగులు ముందుకు వచ్చింది. డి.మత్స్యలేం పంచాయతీ రాళ్లపేట,శివాజీ దిబ్బల పాలెం,కొత్త దిబ్బల పాలేం,కొత్త మత్య్స లేశం గ్రామాలను అనుకొని సముద్రం నీరు చొచ్చుకు వచ్చింది.
నరసన్నపేట మండలంలో కొబగాం, వెంకటాపురం, గెడ్డవానిపేట, కామేశ్వరిపేట తదితర ప్రాంతాలకు వంశధార నీరు ప్రవేశించే ప్రమాదం ఉండడంతో పరిస్థితిని తహశీల్దార్ సమీక్షిస్తున్నారు.
మహేంద్రగిరిలో కురిసిన భారీ వర్షాలకు మహేంద్ర తనయ నీటి మట్టం పెరిగే అవకాశం ఉండడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం తహశీల్దార్ సూచించారు. తుఫాను కారణంగా భారీగా ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలుమూరు మండలంలో ఈదురుగాలులు వీయడంతో అల్లాడ, పర్లాం, కొమనాపల్లి,సైరిగాం, అచ్చుతాపురం తదితర గ్రామాల్లో వరిచేలు నేలమట్టమయ్యాయి. యలమంచిలి అల్లాడ, కరవంజి, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సారవకోట మండలంలో ఈదురు గాలులతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
Advertisement
Advertisement