హమ్మయ్య... తప్పిన గండం | Phailin Storm Missed danger | Sakshi
Sakshi News home page

హమ్మయ్య... తప్పిన గండం

Published Sun, Oct 13 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Phailin Storm Missed danger

విజయనగరం కలెక్టరేట్ /కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల హెచ్చరికల నేప థ్యం, సముద్రం పోటెత్తి అలలు విరుచుకుపడుతూ తీరానికి దూసుకురావడంతో తీరప్రాం త ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రం గా ఉంటుందని, అందులో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడం, వాతావరణంలో క్రమేపీ వచ్చిన మార్పులతో రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో ఏమోనని వణికిపోయిన జిల్లా వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. అయితే భయపడినంతంగా పై-లీన్ ప్రభావం చూపకపోవడంతో ఊరట చెందారు.
 
  శనివారం రాత్రి జిల్లా ప్రత్యేక అధికారి జిల్లా అధికారులతో సమావేశమై పై-లీన్ ప్రభావం, తుఫాన్ వల్ల జరిగిన నష్టం పై సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఉద్ధృతంగా గాలులు వీచాయి. శనివారం ఉదయం సముద్రంలో అలజడి పెరిగింది. కెరటాలు పెద్ద ఎత్తున పైకి లేస్తూ మత్స్యకార గ్రామాల్లోకి దూసుకువచ్చాయి. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా చాలా మంది మత్స్యకారులు ఇళ్లను విడిచి వేరే చోటికి వెళ్లేందుకు అంగీకరించలేదు.  జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ ఎప్పుడు ఎటువంటి అవాంఛనీయ వార్తలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన జిల్లా యంత్రాంగంలో... ప్రజల్లో  నెలకొంది.  భారీ ఈదురుగాలులు... చెదురుమదురు వర్షాలు మినహా అంతా ప్రశాంతంగా ఉంది. తీర ప్రాంతంలో ఉన్న  పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో కాస్త ఉద్రిక్తత నెలకొంది. 
 
 
 పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేట, తిప్పలవలస, కోనాడ, చింతపల్లి గ్రామాలలో సముద్రం సుమారు 40 అడుగులు ముందుకు రావడంతో పాటు ఒడ్డును చేర్చిన పడవలులోకి నీరు చేరడంతో మత్య్సకారులు పరుగులు తీశారు. భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో సముద్రపు అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  అయితే అప్పటికే అప్రమత్తమైన జిల్లా అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ చాలా వరకు స్థానికులు అక్కడే ఉండి పరిస్థితిని గమనించారు.  పై-లీన్  ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కురుపాంలో రోడ్డుపై భారీ చెట్టు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర  అంతరాయం ఏర్పడింది.
 
 అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, పార్వతీపురం మండలాల్లో చెట్లు నేలకు ఒరిగాయి. పార్వతీపురం మండలం కోరి గ్రామంలో చెట్టు కూలి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరంలో పట్టణంలో బలంగా వీచిన ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ప్రధానంగా బాబామెట్ట ప్రాంతలోని కాటవీధి వద్ద పట్టణంలోని అధిక ప్రాంతాలకు విద్యుత్ సరఫారా చేసే 11కెవి లైన్ విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. దీంతో మొత్తం ఆరు ట్రాన్‌‌సఫార్మర్ల పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని వేణుగోపాలపురంలో రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోగా... ఇందిరానగర్, గాజులరేగ, డెంకాడలకు విద్యుత్ సరఫరా అయ్యే  ప్రధాన విద్యుత్ లైన్లపై  చెట్లు విరిగిపడ్డాయి. ఏజెన్సీప్రాంతంలో ఉన్న కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది.
 
 ముక్కాంలో తీరప్రాంత ఇళ్లను తాకిన అలలు..
 తుఫాన్ ప్రభావంతో భోగాపురం మండలం తీరప్రాంతంలో ఉన్న ముక్కాం గ్రామంలో  సముద్రం అలలు తీరప్రాంతంలో ఉన్న ఇళ్లను తాకడంతో మత్స్యకారులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కన్నా శనివారం సముద్రం మరింత ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం నాడు తీరం 50 అడుగుల దూరంలో ఉన్న ఒడ్డును తాకిన కెరటాలు శనివారం ఏకంగా 70 అడుగుల దూరంలో తీరానికి ఆనుకుని ఉన్న ఇళ్లని సైతం తాకాయి. ఈ సంఘటనలో మత్స్యకార కుటుంబాల మరుగుదొడ్లు నేలమట్టమయ్యాయి. మామూలుగా తీర ప్రాంతం గట్టున లంగరు వేసి ఉంచే పడవలను ఏకంగా గ్రామంలోకి తరలించారు. 
 
 పునరావాస కేంద్రాలకు 15,670 మంది తరలింపు
 తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ అధికారులు ముందస్తు ప్రకటనతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 15670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విజయనగరం డివిజన్‌లోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పార్వతీపురం డివిజన్‌లో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, సాలూరు, జియ్యమ్మవలస మండలాల్లో 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పునరావాస కేంద్రాలకు రావటానికి మత్స్య కారులు నిరాకరించారు. మా ఆస్తులు నష్టపోయి మీరు పెట్టే పులిహోరా మెతుకులకు మేము రామంటూ ఎదురు తిరిగారు. దీంతో విధిలేని పరిస్థితిలో అధికారులు రాత్రి వరకూ బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గంగమ్మా శాంతించు అంటూ సముద్రం వైపు దండం పెడుతూ కేంద్రాల వద్దకు వచ్చారు.
 
 తరలి వచ్చిన కేంద్ర బలగాలు...
 పై-లీన్ బీభత్సం సృష్టిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు తరలివచ్చాయి. 40 మంది జాతీయ విపత్తుల బృందంతో పాటూ సహాయక చర్యల కోసం 250 మంది ఆర్మీ జవాన్లు వచ్చారు. వీరిని ఏడు మండలాలకు అధికారులు సర్దుబాటు చేశారు. అలాగే 30 మంది గజ ఈతగాళ్లతో పాటూ 50 మంది అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతేకాకుండా 200 మంది వరకూ పోలీసులు సైతం తీర ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారులతో పాటూ సహాయక బృందాలు ఆయా ప్రాంతాల్లోనే కలియ దిరిగాయి. అవసరమైన వాటర్ ప్యాకెట్లను సైతం అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులతో పాటూ కిరోసిన్ సరఫరా చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement