ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను టై పుట్టిస్తోంది. పై-లీన్ కంటే తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నంలోని బందరువైపు తుపాను దిశ మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.
అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (08592 28144)ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నం(1077)ను కూడా సిద్ధంగా ఉంచారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలతోపాటు తీర ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు గురువారం ఒంగోలు వస్తున్నారు.
తీర ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్లు..
లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి అక్కడే బస చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కడున్నా వెంటనే తాము పనిచేసే ప్రాంతాలకు చేరుకొని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని 95 తీర ప్రాంతాల్లో లక్షా 840 మంది జనాభా నివశిస్తున్నారు. తుపాను తీవ్రతను బట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామానికి ఒకటి చొప్పున 95 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. 320 టన్నుల బియ్యం, లక్షా 36 వేల లీటర్ల కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకొంది. రాత్రివేళల్లో ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది.
విపత్తు బృందాలు.. హెలికాప్టర్లు
లెహర్ తుపాను వల్ల అతి భారీ వర్షాలు కురిస్తే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించేందుకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి రెండు ప్రత్యేక బృందాలను పంపించాలని జిల్లా యంత్రాంగం కోరింది. అదేవిధంగా ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించింది. తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరులపై ఎక్కువగా ఉండే అవకాశాలుండటంతో అక్కడ బృందాలను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని, తుపాను తీవ్రత ప్రకాశం జిల్లాపై ఉంటే వెంటనే వచ్చేలా వాటిని సిద్ధం చేసినట్లు జిల్లాకు సమాచారం అందింది.
వాడరేవులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ
చీరాల, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో మండలంలోని వాడరేవులో బుధవారం మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చీరాలలో చిరుజల్లులు కురిశాయి. సముద్రంలో అలల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వాడరేవు, తదితర ప్రాంతాల్లోని బోట్లను జెట్టి వద్ద నిలిపి వలలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని వాడరేవు, చినబరప, పాకల, విజయలక్ష్మీపురం, తదితర ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను కారణంగా ఇంటికి వచ్చేందుకు పయనమవుతున్నారు.
ఈసారి.. లెహర్
Published Thu, Nov 28 2013 6:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement