Lehar storm
-
అమ్మో.. చలి
=గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు =కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ =ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పిల్లలు సాక్షి, హన్మకొండ: జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సగటున 15 సెల్సియస్ డిగ్రీ లుగా నమోదైంది. ఇక శని, ఆదివారాల్లో ఏకంగా12 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది. ఈ ఏడాదిలోఇప్పటివరకు అతి తక్కువ ఉష్ణోగ్రతగా ఇది రికార్డుల్లోకెక్కింది. ఉదయం, సాయంత్రం వేళలో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. పొగమంచు కారణంగా ఉదయం వేళ వాహనాలపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఇదే సమయంలో మొదటి సారిగా ఉష్ణోగ్రతలు 20 సెల్సియస్ డిగ్రీల కంటే కిందికి పడిపోయాయి. అయితే ఆ తర్వాత హెలెన్, లెహర్ తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నవంబర్ మధ్య నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ... వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి.చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఆరుగంటల తర్వాతే సూర్యుడు మబ్బుల మాటు నుంచి బయటకు వస్తున్నాడు. తొమ్మిదింటి వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ ఐదున్నర గంటలకల్లా చీకటి పడుతోంది. జనవరిలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. -
వెన్నులో వణుకు
చీరాల, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు.. అకాల వర్షాలకు అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కోటి ఆశలతో మొదలైన సాగు ఏటా కళ్ల ముందే తుడిచి పెట్టుకుపోతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. ఈ పాటికే జల్, లైలా, నీలం వంటి తుపాన్ల ధాటిని తట్టుకోలేక సర్వం కోల్పోయారు. వ్యవసాయం కోసం తెచ్చిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే గత నెలలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని 90 శాతం వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను నుంచి బయట పడినప్పటికీ లెహర్ తుపాను ప్రభావం ఎటువంటి విపత్తును మిగులుస్తుందోనని రైతులు వణికిపోతున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వరి, వేరుశనగ, పత్తి, పొగాకు, మరికొన్ని పంటలు సాగవుతున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు, కంది, వేరుశనగ, మినుముతో పాటు సుమారు 1.96.200 హెక్టార్ల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రభుత్వం నుంచి విత్తన సాయం కూడా అందలేదు. వ్యవసాయం వదులు కోవడం ఇష్టం లేక రైతులు మళ్లీ సాగు మొదలు పెట్టారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న పత్తిని పీకేసి మళ్లీ నాటారు. మరికొన్ని చోట్ల దెబ్బతిన్న పత్తిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు పత్తికి * 30 నుంచి * 35 వేల వరకు ఖర్చు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు వరి పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా ప్రస్తుతం మళ్లీ నార్లు పోశారు. చీరాల వ్యవసాయ సబ్ డివిజన్లో ఉన్న చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వరి 4185 హెక్టార్లు, మొక్కజొన్న 1566 హెక్టార్లు, వేరుశనగ 177 హెక్టార్లు, మిరప 380 హెక్టార్లు, పొగాకు 1500 హెక్టార్లు, శనగ 300 హెక్టార్లలో సాగు చేశారు. ఇవి కాక కూరగాయలను 35 హెక్టార్లలో సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి * 9 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం వైట్‌బర్లీ సాగు చేస్తున్నారు. పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో పొగాకు సాగులో ఉంది. ఎకరాకు * 10 వేల వరకు ఖర్చయింది. మరికొన్ని పంటలు కూడా సాగవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏటా వరుసగా ఎదురవుతున్న నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు లెహర్ ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏమి జరుగుతుందో, వేసిన పంటలు ఏమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు ఇక్కడితో ఆగితే పంటలకు పెద్దగా నష్టం ఉండదు. మరో రోజు కొనసాగినా, అధిక వర్షాలు కురిసినా పొలాలు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. సర్కార్‌పై నమ్మకం వదులుకున్న అన్నదాతలు ఏటా ఎదురవుతున్న విపత్తులతో సర్వం కోల్పోయి అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదు. నష్ట పరిహారం పంపిణీ చేస్తుందన్న ఆశ అన్నదాతలకు లేదు. గతంలో సంభవించిన నీలం, జల్ తుపానుకు సంబంధించిన నష్టపరిహారం పూర్తిగా రైతులకు చేరలేదు. బ్యాంక్ ఖాతాలతో పాటు అనేక ఆంక్షలతో పరిహారం రైతుల చేతికి పూర్తిగా అందలేదు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీతో పాటు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. 50 శాతంపైగా పంటలు దెబ్బతింటేనా పరిహారం జాబితాలో పేర్లు నమోదు చేస్తామని, లేకుంటే నష్టపోయినట్లుగా లెక్కల్లో పరిగణనలోకి తీసుకోమంటూ కిరణ్ స ర్కార్ మొండికేస్తోంది. ఒకవేళ ఏదైనా ఉపద్ర వం ముంచుకొచ్చి నష్టం జరిగినా మిగిలేది మొండిచెయ్యే కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశ రైతులు వదిలేశారు. -
గండం గడిచింది
=దిశ మార్చుకొని తీరం దాటిన లెహర్ =జిల్లాకు తప్పిన ముప్పు =ఊపిరిపీల్చుకున్న ప్రజలు, అధికారులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ గండం గడిచింది. తుపాను దిశను మార్చుకొని తీరం దాటడంతో జిల్లాకు ఎటువంటి నష్టం కలగలేదు. మూడు రోజుల పాటు కలవరపెట్టిన తుపాను ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో ప్రజానీకం, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లెహర్ తుపాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి తీర ప్రాంత గ్రామాలకు కంటి మీద కునుకులేకుండాపోయింది. భారత వాతావరణ నిపుణులతో పాటు అమెరికా, ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా లెహర్ తుపాను అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. దీనికి తోడు ఇది తీవ్ర తుపానుగా మారి ముందు కాకినాడ తీరం దిశగా రావడంతో జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు భావించారు. దీంతో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ముందస్తు చర్యలు చేపట్టింది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్‌మన్ బృందాలను సహాయక చర్యల కోసం రంగంలోకి దింపింది. అత్యవసర పరిస్థితుల కోసం రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది. ఊపిరి పీల్చుకున్న అధికారులు : భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో జిల్లాలో తీర, లోతట్లు ప్రాంతాల నుంచి 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 76 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. గురువారం తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడతాయని భావించిన అధికారులు బుధవారం సాయంత్రం అచ్యుతాపురం మండలంలో 1500 మందిని, రాంబిల్లిలో 1250 మందిని, నక్కపల్లిలో 2600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ గురువారం తెల్లవారుజామున కాస్త మేఘాలు కమ్ముకున్నప్పటికీ కొంత సేపటికి ఎండ వచ్చింది. దీంతో కేంద్రాల్లో ఉన్న వారంతా తిరిగి వారి నివాసాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడలేదు. చల్లటి గాలులు కొంత కలవరపెట్టాయి. కాకినాడ వద్ద తీరం దాటుతుందని నిపుణులు అంచనా వేసినా తుపాను దిశను మార్చుకొని మధ్యాహ్నం 2 గంటలకు మచిలీపట్నం సమీపంలో తీరం దాటింది. ఆ ప్రభావం జిల్లాపై పడలేదు. దీంతో అధికారులు పునరావాస కేంద్రాలను మూసివేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కటక్‌కు వెళ్లిపోయాయి. మండలాల్లో మకాం వేసిన జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు వెనక్కి వచ్చేశారు. -
తీరం దాటింది గండం గడిచింది
=బలహీనపడిన ‘లెహర్’ =వాయుగుండంగా.. అపై అల్పపీడనంగా మార్పు =చలిగాలులకు వృద్ధురాలి మృతి =మరో 24 గంటలపాటు భారీ వర్షాలు =రైతన్నకు తప్పని నష్టం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను గండం గడిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్ వద్ద ఆరు రోజుల క్రితం ఏర్పడిన లెహర్ తుపాను మచిలీపట్నానికి దక్షిణ దిశగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తీరం దాటింది. అల్పపీడనంగా ఏర్పడి గుంటూరు జిల్లా బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని, శుక్రవారం మధ్యాహ్నానికి సమసిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు కోస్తా తీరంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. తెల్లవారుజాము నుంచే వర్షాలు... తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సముద్రతీరంలో బలమైన గాలులతో పాటు వర్షం కురిసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలులు, వర్షం ప్రభావం అధికమైంది. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో దాదాపు ఐదడుగులకు పైగా ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. గురువారం ఉదయం నుంచి సముద్రం హోరెత్తింది. తుపాను ప్రభావంతో చలిగాలులు వీయటంతో బందరు మండలం బుద్దాలపాలేనికి చెందిన తాడంకి ఆదిశేషమ్మ (75) మృతిచెందింది. కృత్తివెన్నులో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో అలజడి నెలకొంది. లీకేజీని సిబ్బంది అరికట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లెహర్ తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. క్రమేణా బలహీనపడిన తుపాను... లెహర్ పెను తుపానుగా వస్తుండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ నెల 26 వరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 27వ తేదీ సాయంత్రం తీవ్ర పెనుతుపాను బలహీనపడి తుపానుగా మారినట్లు ప్రకటించారు. గురువారం ఉదయానికి తుపాను కాస్తా మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది. వాతావరణంలో పెరిగిన చలిగాలులు తుపాను తీవ్రతను తగ్గించాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో గాలుల వేగం తగ్గిపోయింది. ఈ నెల 22న హెలెన్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హెలెన్ తుపాను కంటే లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించటంతో తీరప్రాంత వాసులు బెంబేలెత్తిపోయారు. తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల మేర గాలులు వీయటంతో నష్టం అంతగా జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. 34 శిబిరాలు, 6,900 మందికి పునరావాసం... లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సముద్రతీరంలోని ఆరు మండలాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అధికారులు కసరత్తు చేశారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని 55 గ్రామాల పరిధిలోని 111 ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. 34పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 6,900 మందికి రక్షణ కల్పించారు. తుపాను తీరం దాటిన సమయంలో విపత్కర పరిస్థితులు ఏర్పడితే రక్షణ చర్యల కోసం 80 మంది ఆర్మీ, 160 మంది ఎన్డీఆర్ఎఫ్, 877 మంది పోలీసు, 100 మంది ఫైర్, మెరైన్ పోలీసు సిబ్బంది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పహరా కాశారు. మంగినపూడి బీచ్, సాగరసంగమం ప్రాంతాల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వాయుగుండం తీరం దాటడంతో గురువారం పునరావాస కేంద్రాల్లోని వారిని ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపారు. కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, ఏజేసీ చెన్నకేశవరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేశారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో, బంటుమిల్లి, కృత్తివెన్నులలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గురువారం తెల్లవారుజాము నుంచి అక్కడే ఉండి బాధితులకు సేవలందించారు. రైతన్నకు దెబ్బ మీద దెబ్బ... లెహర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను మరింత కుంగదీశాయి. ఈ నెల 22న సంభవించిన హెలెన్ తుపాను ప్రభావంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. ప్రస్తుత వర్షాలతో ఆ పైరుపై నీరు చేరింది. ఇప్పటికే మూడొంతుల పంటను కోల్పోయామని ఆందోళన చెందుతున్న రైతులు గురువారం కురిసిన వర్షంతో పంట చేతికిరాదని చెబుతున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నుంచి పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నట్లు వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
ఈసారి.. లెహర్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను టై పుట్టిస్తోంది. పై-లీన్ కంటే తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నంలోని బందరువైపు తుపాను దిశ మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08592 28144)ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నం(1077)ను కూడా సిద్ధంగా ఉంచారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలతోపాటు తీర ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు గురువారం ఒంగోలు వస్తున్నారు. తీర ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్లు.. లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి అక్కడే బస చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే తాము పనిచేసే ప్రాంతాలకు చేరుకొని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని 95 తీర ప్రాంతాల్లో లక్షా 840 మంది జనాభా నివశిస్తున్నారు. తుపాను తీవ్రతను బట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామానికి ఒకటి చొప్పున 95 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. 320 టన్నుల బియ్యం, లక్షా 36 వేల లీటర్ల కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకొంది. రాత్రివేళల్లో ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది. విపత్తు బృందాలు.. హెలికాప్టర్లు లెహర్ తుపాను వల్ల అతి భారీ వర్షాలు కురిస్తే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించేందుకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి రెండు ప్రత్యేక బృందాలను పంపించాలని జిల్లా యంత్రాంగం కోరింది. అదేవిధంగా ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించింది. తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరులపై ఎక్కువగా ఉండే అవకాశాలుండటంతో అక్కడ బృందాలను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని, తుపాను తీవ్రత ప్రకాశం జిల్లాపై ఉంటే వెంటనే వచ్చేలా వాటిని సిద్ధం చేసినట్లు జిల్లాకు సమాచారం అందింది. వాడరేవులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చీరాల, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో మండలంలోని వాడరేవులో బుధవారం మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చీరాలలో చిరుజల్లులు కురిశాయి. సముద్రంలో అలల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వాడరేవు, తదితర ప్రాంతాల్లోని బోట్లను జెట్టి వద్ద నిలిపి వలలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని వాడరేవు, చినబరప, పాకల, విజయలక్ష్మీపురం, తదితర ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను కారణంగా ఇంటికి వచ్చేందుకు పయనమవుతున్నారు. -
లెహర్.. టై
=మచిలీపట్నం వద్ద తుపాను నేడు తీరం దాటే అవకాశం =రక్షణ చర్యల్లో అధికార యంత్రాంగం =127 పునరావాస శిబిరాల ఏర్పాటు =తీరప్రాంత స్కూళ్లకు సెలవు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ పేరు వింటేనే జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మచిలీపట్నానికి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నం ఇది మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారి రెండు మీటర్ల ఎత్తు వరకు కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్రతీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీవ్రత అధికంగా ఉండే నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రత్యేకాధికారులు, వీ ఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం కలెక్టర్ ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 127 పునరావాస శిబిరాల వద్ద విద్యుత్ సౌకర్యానికి ఆటంకం ఏర్పడకుండా జనరేటర్లు, ఆయిల్, ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో వర్షం ప్రారంభమైన వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తీసుకువచ్చేందుకు పరస్పర సహకారం తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద 24 గంటల పాటు పనిచేసే వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయం సక్రమంగా కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హెలెన్ తుపాను ప్రభావంతో తడిసిన వరిని రోడ్లపై వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని.. రెండు, మూడు రోజుల పాటు రోడ్లపై వరి కుప్పలు, కుప్పనూర్పిళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులకు కలెక్టర్ సూచించారు. బంటుమిల్లిలో జేసీ పి.ఉషాకుమారి, ఎస్పీ జె.ప్రభాకరరావు పర్యటించి తుపాను ఏర్పాట్లను సమీక్షించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం.. లెహర్ తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్మీకి చెందిన 600 మంది సైనికులను సిద్ధంగా ఉంచారు. వీరిలో ఒక బృందం బందరు బయలుదేరింది. అవసరాన్ని బట్టి కాకి నాడకు పంపేందుకు మరికొంతమందిని సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అవనిగడ్డ, కోడూరు, బంటుమిల్లిలో ఒక్కొక్కటి ఉండగా మచిలీపట్నంలో రెండు బృందాలను సంసిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటిన సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే ఈ బృందాల సేవలను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన డీఐజీలు ఎస్ఎస్ గులేరియా (ఢిల్లీ), ఎస్పీ సెల్వన్ బుధవారం కలెక్టర్‌ను కలిసి తుపాను పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు తుపాను రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. సైనిక బృందాలు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీవర్ష సూచన.. లెహర్ తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. మంగినపూడి బీచ్‌తోపాటు సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగినపూడి బీచ్ నుంచి బుధవారం ఉదయం 17 బోట్లు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినట్లు గుర్తించిన మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం బీచ్ వద్దకు వెళ్లి సముద్రంలో ఉన్న మత్స్యకారులను బయటకు రప్పించారు. గిలకలదిండి హార్బర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే 92 మెకనైజ్డ్ బోట్లు, 974 ఫైబర్ బోట్లు మొత్తం సముద్రం ఒడ్డునే నిలిపివేసినట్లు కళ్యాణం తెలిపారు. కోడూరు, బందరుల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను బందరు ఆర్డీవో పి.సాయిబాబు, ఎన్డీఆర్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ ఉత్తమ్ కశ్యప్ పరిశీలించారు. -
ఉద్యోగులంతా కేంద్ర స్థానాల్లో ఉండాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కేంద్ర స్థానాల్లో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. ఈ నెల 28న తీరం దాటనున్న లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ, తహశీల్దారులు, ఐకేపీ, పీహెచ్సీ మెడికల్ ఆపీసర్లు, వ్యవసాయ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా ఉందని అన్నారు. లెహర్ తుపానుతో నష్టం జరగకుండా మండల పరిధిలోని అన్ని చెరువులను తనిఖీ చేయాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కల్లాలు.. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని భద్రపరచాలని రైతులకు సూచించారు. వరదలతో ఎలాంటి నష్టం తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగుల్లోకి వచ్చే వరదల ప్రవాహంపై వివరాలను కంట్రోల్ రూమ్‌కు తెలపాలన్నారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. ప్రసవ తేదీ వారం లోపు ఉన్న గర్భిణులను సమీపంలోని పీహెచ్సీలలో చేర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని భద్రపరిచే విషయంలో రైతులకు సహకరించాలని మార్కెటింగ్, ఐకేపీ ఏపీఎంలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారుల నియామకం తుపాను పరిస్థితులను మానిటరింగ్ చేసేందుకుగాను జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం- నగర పాలక సంస్థ కమిషనర్ బి.శ్రీనివాస్, పాలేరు- ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి, మధిర- స్పెషల్ కలెక్టర్ (పోలవరం) లక్ష్మయ్య, ఇల్లందు- బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటనర్సయ్య, పినపాక- ఎస్డీసీ పాల్వంచ నారాయణరెడ్డి, సత్తుపల్లి- సీపీఓ ఆనందరత్నాబాబు, కొత్తగూడెం- ఆర్డీవో అమయ్‌కుమార్, అశ్వారావుపేట- పాల్వంచ ఆర్డీవో శ్యాంప్రసాద్, భద్రాచలం- ఇన్చార్జి సబ్ కలెక్టర్ వైవి.గణేష్, వైరా- సీఈఓ జడ్పీ జయప్రకాష్ నారాయణ్‌ను నియమించారు. -
వరుస తుపాన్లతో విలవిల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అతలాకుతలమైన రైతన్నను తాజాగా ‘లెహర్’ తుపాను భయపెడుతోంది. లెహర్ ప్రభావం జిల్లాపై కూడా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతాంగాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తూర్పు ప్రాంతం మినహా మిగతా చోట్ల చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో చిరుజల్లులు కురిసినా దిగువ ప్రాంతాలు జల మయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో పైలిన్, హెలెన్ తుపాన్లు సృష్టించిన విధ్వంసానికి జిల్లావ్యాప్తంగా 66వేల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్క జొన్న, వరి, ఆముదం, పత్తి, టమాటా, క్యారెట్ తదితర ఉద్యాన తోటలు వర్షార్పణం కాగా, రెండు రోజుల క్రితం కురిసిన వానలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. పైరు నేల వాలడంతో పొలాల్లోనే వరి మొలకెత్తే పరిస్థితి దాప్చురించింది. చినుకు పడిందా.. గోవిందా! జిల్లాలో సాగు చేసిన పంటల్లో సగానికి పైగా తుపాన్లకు తుడిచిపెట్టుకుపోయాయి. పైలిన్, హెలెన్ సృష్టించిన బీభత్సం మరువకముందే లెహర్ తరుముకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోత దశకు చేరిన వరిని కోసేందుకు కూలీలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. మరోవైపు రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి పొలాల్లో నీరు చేరడ మేగాకుండా...పైరు కూడా నేలకొరిగింది. దీంతో చేను కోసేందుకు వీలు లేకుండా పోయింది. ఈ తరుణంలోనే తాజాగా మరో తుపాను విరుచుకుపడనుందనే వార్తలు కర్షకలోకంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. కోస్తా జిల్లాలపైనే పెను తుపాను ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ జిల్లాలపై కాస్తో కూస్తో చూపే వీలుందనే సమాచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. నష్టం ఎక్కువైతే.. పరిహారం కష్టమే! పంట నష్టం వివరాల సేకరణపై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా నష్టం ప్రతిపాదనలు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘కోస్తా జిల్లాలకు దీటుగా రంగారెడ్డి జిల్లాలో పంటలు దెబ్బతినడమేమిటీ.. నష్టం అంచనాలను ఎక్కువగా పంపకండి’ అని ఇటీవల తనను కలిసిన జిల్లా ఉన్నతాధికారితో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నష్టం తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నాల్లో జిల్లా అధికారులు తలమునకలయ్యారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ పంటనష్టం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం 50శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో నష్టం ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతుల నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో అరకొర సమాచారంతోనే నష్టం నివేదికలు తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రూ.23.40 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంట్లో గత నెల చివరి వారంలో పడ్డ ముసురుకు 22,931 హెక్టార్ల పంటలు ధ్వంసమయ్యాయని, దీనికిగాను రైతాంగానికి రూ.21.14 కోట్ల పరిహారం ఇవ్వాలని నివేదించారు. -
లెహర్ వణుకు
అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను చడీచప్పుడు లేకుండా వచ్చి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తే... ఇంకా రాకుండానే జిల్లావాసులను ‘లెహర్’ తుపాను వణికిస్తోంది. 1996లో కోనసీమను చావుదెబ్బ తీసిన పెను తుపానును మించి లెహర్ విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఒకవైపు చాటింపు వేస్తూ... మరోవైపు తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఆరంభించింది. నేటి నుంచి ప్రభావం లెహర్ తుపాను జిల్లాపై బుధవారం నుంచి ప్రభావం చూపుతుందని సమాచారం. దీనివల్ల బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది. లెహర్ తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కురిసే అవకాశముంది. ఈ తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఇదే జరిగితే 1996లో కోనసీమను తాకిన పెను తుపాను కన్నా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నది జిల్లావాసులను, ముఖ్యంగా కోనసీమ వాసులను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ తుపాను వల్ల కలిగిన నష్టం కళ్లముందుండగానే మరో విపత్తును ఎదుర్కోవాల్సి రావడం వారిని వణికిస్తోంది. జిల్లాలోని తీరప్రాంత మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నా.. కోనసీమ మరోసారి భారీగా నష్టపోయే అవకాశముంది. వణికిపోతున్న కొబ్బరి రైతు 1996 తుపానుకు 30 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అంతకన్నా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశముందని తెలియడంతో కొబ్బరి రైతులు నిలువునా వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ తుపాను వల్ల వరితో పాటు, కొబ్బరి పంట ఎక్కువగా దెబ్బతింది. చెట్లు బతికినా జీవచ్ఛవాలుగా ఉన్నాయి. ఈ సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తే చెట్లు నిలువునా కూలిపోతాయని రైతులు వాపోతున్నారు. ‘తుపాను తీవ్రతకు పంటలు పోతే పోయాయి. కనీసం ప్రాణాలతో మిగిలితే చాలు’ అనుకునే స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తుపాను విద్యుత్ శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనిని ఇప్పటికీ సగం పూర్తి చేయని సిబ్బంది లెహర్ వల్ల కలిగే నష్టాన్ని ఊహించుకుని ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు 1996 తుపాను వల్ల అపారంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఈసారి తుపానుకు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాటింపు, మైకు ప్రచారాలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. పూరిపాకలు, గుడిసెలు, పాత భవనాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తక్షణం తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను సమయంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని చెబుతున్నారు. కోనసీమ తుపాను వల్ల తీరంలో మత్స్యకారులు ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారిని తరలించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు. కోనసీమలో 74,513 మందిని తరలించాలన్న అంచనాకు వచ్చారు. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 22,654 మందిని తరలించాలని గుర్తించారు. ఇప్పటికే మగసానితిప్ప నుంచి 140 మందిని మంగళవారం బలుసుతిప్పలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ రెండుసార్లు ఈ మండలంలో ఇప్పటికే పర్యటించగా, తాజాగా జేసీ ఎం.ముత్యాలరాజు ఇక్కడే ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాలవారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో తుపానుపై అవగాహన కల్పించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కు చెందిన ఏడు బృందాలు కోనసీమకు చేరుకున్నాయి. 40 మంది సభ్యులుగా ఉండే ఈ బృందాల్లో రెండు కాట్రేనికోన మండలంలోను, మరో రెండు ఐ.పోలవరం మండలంలోను, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉంచారు. పెనుగాలులకు బస్సులు బోల్తా పడవచ్చని, చెట్లు బస్సులపై పడవచ్చని, అందువల్ల గురువారం ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
లెహర్.. డర్
సాక్షి, కాకినాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను 1996లో సంభవించిన కోనసీమ తుపానుకు రెట్టింపు వినాశనాన్ని సృష్టించనుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ జిల్లావాసులను హెచ్చరించారు. సోమవారం రాత్రి తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. జిల్లా మొత్తం ఈ తుపాను తాకిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తుపాను పునరావాస కేంద్రాల ఏర్పాటు కోసం మండలానికి రూ.మూడు లక్షలు కేటాయించినట్టు చెప్పారు. బాధిత ప్రజలతో పాటు పాడి పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రావద్దని; పూరిళ్లు, కచ్చా ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. జిల్లాకు పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను కేటాయించారని తెలిపారు. ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, తుని, కొత్తపల్లి మండలాలకు ఒక్కొక్కటి, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలకు రెండేసి చొప్పున ఈ బృందాలను పంపనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం : కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామాన్ని కలెక్టర్ నీతూప్రసాద్ సోమవారం సందర్శించి, లెహర్ తుపానుపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాణనష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలందరూ బుధవారం ఉదయానికల్లా పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. ఈ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా ఆహారం నిల్వ ఉంచాలని కాట్రేనికోన తహశీల్దారును ఆదేశించారు. -
విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో లెహర్
-
రాష్ట్రానికి ‘లెహర్’ ముప్పు
-
ముంచుకొస్తున్న ‘లెహెర్’
సాక్షి, ఏలూరు : హెలెన్ తుపాను చేసిన గాయాలు ఇంకా తడారలేదు. మరో తుపాను ‘లెహెర్’ ముంచుకొస్తోంది. ఈ ఖరీఫ్‌లో 6 లక్షల ఎకరాల్లో పం టలు పండించగా, 4 లక్షల ఎకరాలు ఇప్పటికే తుపాన్లు, అల్పపీడనం ప్రభావానికి దెబ్బ తిన్నాయి. ఇంకా 2 లక్షల ఎకరాల్లో మాత్రమే కొద్దోగొప్పో పంట మిగిలి ఉంది. గురువారం నాటికి కోస్తా తీరంలోకి లెహెర్ తుపాను. తీవ్రస్థారుులో చొచ్చుకువచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారుు. 2 లక్షల ఎకరాల్లో మిగిలివున్న కొద్దిపాటి పంటను కూడా లెహెర్ తుపానుకు సమర్పించుకోక తప్పదేమోనని తల్లడిల్లిపోతున్నారు. గతేడాది నీలం తుపానుకు పంటలు పోవడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు విడిచారు. మళ్లీ ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. చరిత్రలో తొలిసారిగా నరసాపురం సమీపంలో కేంద్రీకృతమై హెలెన్ తుపాను భారీ నష్టాల్ని మిగిల్చింది. జిల్లా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో తీరం వెంబడి గంటకు 120నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జనం ఇళ్లనుంచి బయటకు రావడానికే భయపడ్డారు. విద్యుత్ వ్యవస్థ అతలాకుతల మైంది. రెండు రోజులు గడిచినా కొన్ని తీర గ్రామాల్లో ఆదివారం రాత్రికి కూడా ప్రజలు చీకట్లోనే మగ్గారు. ఈ భయాన్ని జనం మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జనం గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. లెహెర్ తుపాను కూడా కోస్తా తీరంలోనే కేంద్రీకృతమతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈసారి ఏకంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. అదే జరిగితే సంభవించే ప్రళయాన్ని ఊహించడానికే జనం భయపడుతున్నారు. -
రాష్ట్రానికి ‘లెహర్’ ముప్పు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపై ప్రకృతి పగబట్టినట్టుంది! ఒక ముప్పు నుంచి తేరుకోక ముందే మరొకటి ముంచుకొస్తోంది. పై-లీన్, హెలెన్ తుపాన్ల విలయం చాలదన్నట్టు తాజాగా ‘లెహర్’ తుపాను రాష్ట్రంపైకి శరవేగంగా దూసుకొస్తోంది. హెలెన్ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగు కాకుండానే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో మూడ్రోజుల కిందట ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహర్’ పేరుతో పిలుస్తున్న ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటాక ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా (కోస్తాంధ్ర వైపు) పయనిస్తూ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఈ నెల 28 ఉదయానికల్లా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. లెహర్ ప్రభావం రాష్ట్రంలోని కోస్తాంధ్రపై అధికంగా పడనుంది. ఇప్పటికే అక్టోబర్ రెండో వారంలో సంభవించిన పై-లీన్ దెబ్బకు తీరప్రాంతాలు అల్లాడాయి. ఆ గండం నుంచి ఊపిరి పీల్చుకున్న వారానికే భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చాయి. తర్వాత పక్షం రోజులైనా గడవక ముందే నవంబర్ 19 నుంచి 23 వరకూ హెలెన్ కోస్తాంధ్రను అతలాకుతలం చేసింది. మచిలీపట్నం వద్ద తీరం దాటిన ఈ తుపాను చేతికొచ్చిన పంటను నేలమట్టం చేసింది. పై-లీన్, భారీ వర్షాలు, హెలెన్ దెబ్బకు రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 30 లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. 10 లక్షల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. కొబ్బరి, మామిడి, అరటి తోటలు నేలకూలాయి. ఈ నేపథ్యంలో లెహర్ రూపంలో రైతులపై ప్రకృతి మరోసారి పడగ విప్పుతోంది. లెహర్తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది. 40 రోజులు.. 3 తుపాన్లు.. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా నలభై రోజుల్లో 3 తుపాన్లు సంభవించాయి. ఈ మూడూ తీవ్రమైనవే. ఒక సీజనులో ఇంత స్వల్ప వ్యవధిలో మూడు తుపాన్లు రావడం చాలా అరుదు. వాస్తవానికి మే నుంచి మొదలయ్యే రుతుపవనాల సీజన్ నుంచి ఇప్పటిదాకా 4 తుపాన్లు ఏర్పడ్డాయి. ఇందులో మొదటిది ఈ ఏడాది మే 10-17 మధ్య ఏర్పడ్డ ‘మహాసేన్’ తుపాను. ఆ తర్వాత అక్టోబర్ (6-17 మధ్య)లో పై-లీన్ వచ్చింది. అనంతరం ఈనెల (19-23 మధ్య)లో హెలెన్ ముంచెత్తింది. తాజాగా ఇప్పడు లెహర్ తరుముకొస్తోంది. లెహర్’ పేరు మనదే! అండమాన్‌లో ఏర్పడ్డ తాజా తుపానుకు ‘లెహర్’ అని నామకరణం చేశారు. ఈ పేరును సూచించింది మన దేశమే. ‘లెహర్’ అంటే అందమైన పసిపాప అని అర్థం. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో వచ్చిన తొలి తుపాను మహాసేన్ పేరును శ్రీలంక, అక్టోబర్‌లో వచ్చిన పై-లీన్‌కు థాయిలాండ్, హెలెన్‌కు బంగ్లాదేశ్‌లు పేర్లు పెట్టాయి. -
‘లెహర్’ గండం
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉన్నా, తుపానుల రూపంలో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. తాజాగా, అండమాన్ సమీపంలో కేంద్రీకృతమైన లెహర్ తుపాను ఆంధ్ర వైపుగా పయనించి తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో ఏర్పడే తీవ్రత రాష్ట్రం మీద ఉండబోదు. అయితే, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత: లెహర్ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి విల్లుపురం, కడలూరు, నాగపట్నం, తంజావూరు, నీలగిరి, కన్యాకుమారి జిల్లాల్ని వర్షం ముంచెత్తింది. కడలూరులోని నెల్లి కుప్పుం, మాదవ నగర్, తాలం కులం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. విల్లుపురం జిల్లా ఊలందూరు పేట, తిరువన్నై, మైలంలో కుండపోత వర్షానికి రోడ్లు నదుల్ని తలపించాయి. తంజావూరు జిల్లా కుంబకోణం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కల్లనై, పెన్నారుల్లో నీటి ఉధృతి పెరగడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయూయి. నీలగిరి జిల్లాలో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఊటీ -మెట్టుపాళయం మార్గంలోని వంతెన కొట్టుకుపోవడంతో కోతగిరి మీదుగా రాకపోకలను మళ్లించారు. ఊటీ రైలు మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో మూడు రోజులపాటుగా రైళ్లను రద్దు చేశారు. కన్యాకుమారిలో గోదై నది, పేచ్చి పారై, తిరువట్టారు పరిసర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కాయి. గోదై నది పరవళ్లు తొక్కుతుండగా, తిరుప్పరపు జలపాతం పొంగి పొర్లుతోంది. శనివారం అర్ధరాత్రి కాంచీపురం, చెన్నై శివారుల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ప్రమాద హెచ్చరిక: ఆదివారం అర్ధరాత్రికి అండమాన్ సమీపంలోని ఫోర్ట్ బ్లేయర్ దీవుల్ని లెహర్ దాటనున్నది. గంటకు 110 కి.మీ వేగంతో వాయువ్య దిశలో ఇది పయనిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో సముద్ర తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున, కడలిలోకి వెళ్లొదని సూచిస్తున్నారు. చెన్నై ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి, పంబన్, పుదుచ్చేరి హార్బర్లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు.