సాక్షి, ఏలూరు : హెలెన్ తుపాను చేసిన గాయాలు ఇంకా తడారలేదు. మరో తుపాను ‘లెహెర్’ ముంచుకొస్తోంది. ఈ ఖరీఫ్‌లో 6 లక్షల ఎకరాల్లో పం టలు పండించగా, 4 లక్షల ఎకరాలు ఇప్పటికే తుపాన్లు, అల్పపీడనం ప్రభావానికి దెబ్బ తిన్నాయి. ఇంకా 2 లక్షల ఎకరాల్లో మాత్రమే కొద్దోగొప్పో పంట మిగిలి ఉంది. గురువారం నాటికి కోస్తా తీరంలోకి లెహెర్ తుపాను.
తీవ్రస్థారుులో చొచ్చుకువచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారుు. 2 లక్షల ఎకరాల్లో మిగిలివున్న కొద్దిపాటి పంటను కూడా లెహెర్ తుపానుకు సమర్పించుకోక తప్పదేమోనని తల్లడిల్లిపోతున్నారు. గతేడాది నీలం తుపానుకు పంటలు పోవడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు విడిచారు. మళ్లీ ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
చరిత్రలో తొలిసారిగా నరసాపురం సమీపంలో కేంద్రీకృతమై హెలెన్ తుపాను భారీ నష్టాల్ని మిగిల్చింది. జిల్లా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో తీరం వెంబడి గంటకు 120నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జనం ఇళ్లనుంచి బయటకు రావడానికే భయపడ్డారు. విద్యుత్ వ్యవస్థ అతలాకుతల మైంది. రెండు రోజులు గడిచినా కొన్ని తీర గ్రామాల్లో ఆదివారం రాత్రికి కూడా ప్రజలు చీకట్లోనే మగ్గారు. ఈ భయాన్ని జనం మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జనం గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. లెహెర్ తుపాను కూడా కోస్తా తీరంలోనే కేంద్రీకృతమతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈసారి ఏకంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. అదే జరిగితే సంభవించే ప్రళయాన్ని ఊహించడానికే జనం భయపడుతున్నారు.
ముంచుకొస్తున్న ‘లెహెర్’
Published Mon, Nov 25 2013 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement