అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను చడీచప్పుడు లేకుండా వచ్చి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తే... ఇంకా రాకుండానే జిల్లావాసులను ‘లెహర్’ తుపాను వణికిస్తోంది. 1996లో కోనసీమను చావుదెబ్బ తీసిన పెను తుపానును మించి లెహర్ విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఒకవైపు చాటింపు వేస్తూ... మరోవైపు తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఆరంభించింది.
నేటి నుంచి ప్రభావం
లెహర్ తుపాను జిల్లాపై బుధవారం నుంచి ప్రభావం చూపుతుందని సమాచారం. దీనివల్ల బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది. లెహర్ తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కురిసే అవకాశముంది. ఈ తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఇదే జరిగితే 1996లో కోనసీమను తాకిన పెను తుపాను కన్నా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నది జిల్లావాసులను, ముఖ్యంగా కోనసీమ వాసులను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ తుపాను వల్ల కలిగిన నష్టం కళ్లముందుండగానే మరో విపత్తును ఎదుర్కోవాల్సి రావడం వారిని వణికిస్తోంది. జిల్లాలోని తీరప్రాంత మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నా.. కోనసీమ మరోసారి భారీగా నష్టపోయే అవకాశముంది.
వణికిపోతున్న కొబ్బరి రైతు
1996 తుపానుకు 30 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అంతకన్నా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశముందని తెలియడంతో కొబ్బరి రైతులు నిలువునా వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ తుపాను వల్ల వరితో పాటు, కొబ్బరి పంట ఎక్కువగా దెబ్బతింది. చెట్లు బతికినా జీవచ్ఛవాలుగా ఉన్నాయి. ఈ సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తే చెట్లు నిలువునా కూలిపోతాయని రైతులు వాపోతున్నారు. ‘తుపాను తీవ్రతకు పంటలు పోతే పోయాయి. కనీసం ప్రాణాలతో మిగిలితే చాలు’ అనుకునే స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తుపాను విద్యుత్ శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనిని ఇప్పటికీ సగం పూర్తి చేయని సిబ్బంది లెహర్ వల్ల కలిగే నష్టాన్ని ఊహించుకుని ఆందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు
1996 తుపాను వల్ల అపారంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఈసారి తుపానుకు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాటింపు, మైకు ప్రచారాలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. పూరిపాకలు, గుడిసెలు, పాత భవనాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తక్షణం తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను సమయంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని చెబుతున్నారు. కోనసీమ తుపాను వల్ల తీరంలో మత్స్యకారులు ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారిని తరలించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు. కోనసీమలో 74,513 మందిని తరలించాలన్న అంచనాకు వచ్చారు. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 22,654 మందిని తరలించాలని గుర్తించారు.
ఇప్పటికే మగసానితిప్ప నుంచి 140 మందిని మంగళవారం బలుసుతిప్పలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ రెండుసార్లు ఈ మండలంలో ఇప్పటికే పర్యటించగా, తాజాగా జేసీ ఎం.ముత్యాలరాజు ఇక్కడే ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాలవారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో తుపానుపై అవగాహన కల్పించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కు చెందిన ఏడు బృందాలు కోనసీమకు చేరుకున్నాయి. 40 మంది సభ్యులుగా ఉండే ఈ బృందాల్లో రెండు కాట్రేనికోన మండలంలోను, మరో రెండు ఐ.పోలవరం మండలంలోను, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉంచారు. పెనుగాలులకు బస్సులు బోల్తా పడవచ్చని, చెట్లు బస్సులపై పడవచ్చని, అందువల్ల గురువారం ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
లెహర్ వణుకు
Published Wed, Nov 27 2013 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement