coconut farmer
-
పచ్చి కొబ్బరితో పాలు, ఆయిల్.. రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే..
జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్‌వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39). డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్‌తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్‌లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్‌గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన. రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్లో వేసి వేగంగా (18.800 ఆర్పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్‌కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం. పాల వినియోగం ఇలా ► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్‌క్రీమ్‌ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. ► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్లెట్లో అమ్ముతున్నారు. పుష్కలంగా పోషకాలు ► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదరణ పెరుగుతోంది కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్‌గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్‌గా కోకోనట్ వర్జిన్ ఆయిల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది. – గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు, ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్.. పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి. – డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట. ∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ -
తోటలోని మొనగాళ్లు
♦ కొబ్బరి కాయల వెనుక అంతులేని శ్రమ ♦ దింపుడు నుంచి విక్రయం వరకు సాహసాలే ♦ కొబ్బరి కార్మికులకు అందని ప్రభుత్వ సాయం కళ్లకు ఇంపుగా కనిపించే కొబ్బరి వెనుక కనిపించని సాహస గాథలకు కథానాయకులు ఉన్నారు. చెట్టు ఎక్కడం, ఒడుపుగా కాయ దింపడం, వాటిని పద్ధతిగా ఒలవడం, చక్కగా బండి కట్టడం వంటి పనులకు కేరాఫ్ వారు. ఈ పనులు బయట ప్రపంచానికి అంతగా తెలీవు. దాదాపు ప్రతి పనిలోనూ అపాయం దాగి ఉంటుంది. ఆ అపాయమే తమ ఉపాధి మార్గమని వారు చెబుతుంటారు. చెట్టెక్కి కాయలు దింపే పద్ధతి నుంచి దొనికత్తి జమానా వరకు కొబ్బరి కార్మికుల పనితనం చాలా ప్రత్యేకం. కొందరు సన్నకారు రైతులు కూడా ఇక్కడ కార్మికులు కావడం విశేషం. దేవుడి గుడి మొదలుకుని ఇంటిలో వేడుకల వరకు అన్నింటా కొబ్బరిదే అగ్ర తాంబూలం. అందుకే కొబ్బరి తోటలోని మొనగాళ్ల గురించి తెలుసుకుందాం. కవిటి ఉద్దానం.. రాష్ట్రంలో కోనసీమ తర్వాత కొబ్బరి అంటే గుర్తుకువచ్చేది ఈ ప్రాంతమే. కొబ్బరికి పెట్టింది పేరైన ఈ ఊళ్లలో శ్రమ జీవులకు కొదవలేదు. కొబ్బరి రైతు తన కుటుంబ పోషణకు ప్రతి రెండు నెలలకోసారి కొబ్బరి కాయలను దింపుతారు. రైతులు వ్యక్తిగతంగా తోటలపై శ్రద్ధ తీసుకున్నా కాయలు చెట్టు నుంచి తీసే వారు మాత్రం వేరే ఉంటారు. వారే కొబ్బరి కార్మికులు. కొందరు సన్నకారు రైతులు కూడా కార్మికుల్లో భాగమే. అసంఘటిత రంగ కార్మి కుల్లా వీరు దశాబ్దాల తరబడి తోటల్లో పనులు చేస్తున్నారు. అయితే వీరిని గుర్తించిన వారు మా త్రం ఎవరూ లేరు. ఒలుపు కార్మికులూ భాగస్వాములే.. కొబ్బరి నేలపైకి దించే ప్రక్రియ ముగిసిన తర్వాత కచ్చితంగా డొక్క తీయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒలుపు చేసే కార్మికులు ఈ పనిలోనే ఉంటారు. కంచిలి ప్రధాన కేంద్రంగా ఉంటున్న కొబ్బరి మార్కెట్లో ఉత్తరాది రాష్ట్రాలకు రోజుకు 15 లారీల కొబ్బరికాయలు(ఒలిచిన కాయలు) ఎగుమతి అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమొత్తంలో ఒకేసారి ఒలుపు చేయాలంటే కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన నిపుణులైన ఒలుపు కార్మికులకే సాధ్యం. దీనికి చాలా శారీరక ధృడత్వంతో పాటు సహనం కూడా అవసరమే. వంద పణాలు(8000 కొబ్బరికాయలు) ఒలిచేందుకు సగటున రోజుకు పదిపణాలు వలిచే సామర్థ్యం కలి గిన వారు పది మంది అవసరం. ఒక లారీ లోడు సామర్థ్యం అంటే పెద్ద చిన్న పరిమాణాల్లో ఉన్న సుమారు 12,000 కాయలు ఒలుపు చేయాలి. 15 లారీ లోడులు అంటే 1.80లక్షల కాయ ఎగుమతి చేయాలి. ఇంత పెద్దమొత్తంలో ఒలుపు చేయాలంటే అదే స్థాయిలో అధిక సంఖ్యలో కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతీ రోజు కవిటి మండలం నుంచి పొరుగు రాష్ట్రం ఒడిశాకు నిత్యం 10 నుంచి 15 మినీ లారీలు, మేజిక్ ఆటోల్లో సరుకు అమ్మకాలు కూడా జరుగుతుంటాయి. దీంతో వీరికి దాదాపు నెలకు పది రోజులు మినహా అన్ని రోజులూ పని ఉంటుంది. అయితే వీరి కూలి డబ్బులు కొబ్బరి కొన్న వ్యాపారి భరించడు. రైతే భరించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలి డబ్బుల విషయంలో దాదాపు రైతులు కొంచెం బాధగానే కనిపిస్తూ ఉంటారు. తమకు వచ్చే కొద్ది లాభాలు కూలికి సరిపోతాయని చాలా మంది చెబుతుంటారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న కొబ్బరి కాయలు తీసే కార్మికులకు, ఒలుపు చేసే కార్మికులకు కార్మికశాఖ ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. సాహసమే.. ఒకప్పుడు కొబ్బరి కాయలు దింపడం అంటే ప్రాణాలతో చెలగాటమే అనేవారు. డబ్బై, ఎనభై అడుగులు ఎత్తున్న కొబ్బరి చెట్లు అలవోకగా ఎక్కి దింపేవారు. ప్రస్తుతం ఆ తరహా కార్మికులు తక్కువైపోయారు. ప్రస్తుతం దొనికత్తి (పొడవాటి వెదురుకర్ర చివరన కత్తిని కట్టిన పరికరం) వినియోగించి నేలమీద నుంచే కాయలు తీస్తున్నారు. ఈ పని కూడా అంత సులువు కా దు. ఒడుపుగా తీయకపోతే ఒంటికే ప్రమాదం. అయితే పాతతరం కార్మికులు ఇప్పటికీ తోటలో సాధ్యమైనంత వరకు పనులు చక్కబెడుతూ కనిపిస్తుంటారు. దొనికత్తే మేలే కానీ.. దొనికత్తితో కాయలు తీసే విధానంలో వేగంగా కాయలు తీసే సౌలభ్యం ఉంటుంది. కానీ చెట్టు మొవ్వులో దట్టంగా గు బురుగా అల్లుకున్న కొబ్బరిపీచు, కొబ్బరిపాలలను తీసే అవకాశం, ఎండు కొమ్మలు, విరిగిన కమ్మలను తీయడం వీలుపడదు. దీంతో చెట్టు పరిశుభ్రత తగ్గి వ్యాధులు ప్రబలుతాయి. కార్మికులే పైకి ఎక్కితే పైన పేర్కొన్న పనులను చూడగలరు. అయితే ప్రత్యామ్నాయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో దొనికత్తి వాడకానికే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. కూలి బాగున్నా.. ఉదయం ఏడు గంటలకు వెళ్లి రెండు గంటల వ్యవధిలో కొబ్బరికాయలను తీస్తే రెండు వందల రూపాయల కూలి వస్తుంది. అయితే ఈ మొత్తం కొందరు సన్నకారు రైతులకు భారంగా తోస్తోంది. కొంత మంది పెద్ద రైతులు కాంట్రాక్ట్ పద్ధతిలో వారి కొబ్బరి తోటలన్నీ పూర్తిగా దింపు చేస్తే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మొత్తాన్ని ఇచ్చుకుంటున్నారు. ఇం కొందరు రైతులు తమ తోటల్లో తీసే కొబ్బరికాయలకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్మికుడికి 8 పుంజీలు(32కాయలు) ఇస్తారు. వారసత్వం మా తాత తండ్రుల నుంచి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి రైతుల వద్ద కొబ్బరి కాయలు ఒలుపు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. శరీరంలో సత్తువ ఉన్నంత వరకు ఈ పనే చేస్తాను. – గయా మధు, కొబ్బరి ఒలుపు కార్మికుడు, కవిటి ఆదాయ వనరు నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాను. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఖాళీ సమయంలో కొబ్బరి కాయలు ఒలుపు చేసేందుకు వెళ్తుంటాను. ఓ నాలుగు ఐదు పణాలు ఒలిస్తే రెండు వందల వరకు వస్తుంది. – ఎ.ఈశ్వరరావు, ఆటో డ్రైవర్, కవిటి చిన్నప్పటి నుంచే.. నేను చిన్నతనం నుంచే కొబ్బరి చెట్టు ఎక్కడం నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తూ మిగతా సందర్భాలో కాయలు తీసేందుకు వెళ్తాను. రైతు బాగుంటే మా జీవితాలు బాగుంటాయి.– వై.రుద్రయ్య, కొబ్బరిచెట్టు కాయలు తీసే కార్మికుడు, గడపుట్టుగ పెట్టుబడులు ఉంటాయి కొబ్బరి కాయలు తీసే కత్తులు గానీ, దొనికత్తిగానీ, వెదురుకర్ర గానీ పాడైతే వాటిని మళ్లీ కొనుక్కోవాలి. గతంలో తక్కువకే ఇవి దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర బాగా పెరిగింది. – మరిడి ఉమాపతి, గొండ్యాలపుట్టుగ, కొబ్బరి కార్మికుడు -
మొవ్వు విరిగిన కొబ్బరి రైతు
వేలాది ఎకరాల్లో కూలిన చెట్లు కోత దశలో అరటిగెలలు నేలపాలు మామిడి, జీడి తోటలకు నష్టం యలమంచిలి/నక్కపల్లి: ప్రకృతి దాడితో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. హుదూద్ దెబ్బకు కొబ్బరి,అరటి,మామిడి ,జీడి రైతులు కుదేలయ్యారు. ఆదివారం నాటి ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. యలమంచిలి, నక్కపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో చెట్లు కళ్లముందే చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. పంటచేతికొచ్చే సమయంలో అరటి తోటలు నేలకూలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ వర్షాలు, తుపానులప్పుడు వరికి నష్టం వాటిల్లేది. ఇప్పుడు నష్టం ఉద్యానవన రైతుల వంతయింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా వర్షపునీరే కన్పిస్తోంది. నేలకొరిగిన చెరకు తోటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చెరకు సాగు కలిసిరాక నష్టాలు చవిచూస్తున్న రైతులకు తుపాను రూపంలో మరింత నష్టం చేకూరినట్టయింది. నేలకొరిగిన చెరకును ఎత్తికట్టడం తమకు ఆర్థికంగా మరింత భారమవుతుందని యలమంచిలి ప్రాంతానికి చెందిన రైతులు వాపోతున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా అరటితోటలు నేలమట్టమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. జీడి, మామిడి తోటలు సైతం మొదళ్లకు విరిగిపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నక్కపల్లి మండలంలో వేలాది కొబ్బరిచెట్లు నేలకూలిపోయాయి. సుమారు 5వేల ఎకరాల్లో తోటలకు తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. కొన్ని చోట్ల వేళ్లతో కుప్పకూలిపోగా,మరికొన్నిచోట్ల మొవ్వుతోసహా నేలరాలిపోయాయి. ఈ చెట్లు ఎందుకూ పనిరాని పరిస్థితి. ఈదురుగాలలకు టన్నులకొద్దీ కొబ్బరికాయలు నేలరాలిపోయాయి. ఇక మామిడి తోటల్లో మధ్యకు నరికినట్టుగా చెట్లు విరిగిపోయాయి. జీడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. 3వేల ఎకరాలకు పైగా మామిడి,2వేల ఎకరాలకు పైగా జీడి తోటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎన్ నర్సాపురంలో కర్రినానాజీకి చెందిన 3 ఎకరాల అరటితోట పూర్తిగా ధ్వంసమైంది. మరో వారం రోజుల్లో అరటిగెలలు కోసి మార్కెట్‌కు తరలిద్దామని భావిస్తున్న తరుణంలో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ మూడెకరాల తోటకు సుమారు రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టానని నానాజీ వాపోయాడు. కరంటు లేని సమయంలో జనరేటర్ పెట్టి నీటిని సరఫరా చేశానని ఆశించిన స్థాయిలో పంటపండిందని సంబరపడుతున్న తరుణంలో ఈదురుగాలులు తోటమొత్తాన్ని నాశనం చేశాయని కన్నీళ్లపర్యంతమయ్యాడు. దేవవరం,డొంకాడ,జగన్నాధపురం,సీతానగరం,రమణయ్యపేట,దోసలపాడు,కాగిత, చందనాడ, వేంపాడు, తదితరప్రాంతాల్లో పత్తి, బత్తాయి,కంది, చెరకు, అరటి పంటలకు భారీనష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో నష్టం వందలాది ఎకరాల్లో అరటి, వేలాది ఎకరాల్లో కొబ్బరి,మామిడితోటలు నేలకూలిపోయాయి. రూ.లక్షల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈనష్టాన్నుంచి కోలుకోవాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి పెట్టుబడులు పెట్టాం. రుణమాఫీచేయకపోగా,కనీసం రుణాలు కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుచేస్తే ప్రకృతి పగబట్టి సర్వనాశనం చేసింది. - కర్రినానాజీ, రాజబాబు,శంకర్, రైతులు -
లెహర్ వణుకు
అమలాపురం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను చడీచప్పుడు లేకుండా వచ్చి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తే... ఇంకా రాకుండానే జిల్లావాసులను ‘లెహర్’ తుపాను వణికిస్తోంది. 1996లో కోనసీమను చావుదెబ్బ తీసిన పెను తుపానును మించి లెహర్ విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం ఒకవైపు చాటింపు వేస్తూ... మరోవైపు తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఆరంభించింది. నేటి నుంచి ప్రభావం లెహర్ తుపాను జిల్లాపై బుధవారం నుంచి ప్రభావం చూపుతుందని సమాచారం. దీనివల్ల బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది. లెహర్ తీరం దాటే సమయంలో 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కురిసే అవకాశముంది. ఈ తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని, ఇదే జరిగితే 1996లో కోనసీమను తాకిన పెను తుపాను కన్నా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నది జిల్లావాసులను, ముఖ్యంగా కోనసీమ వాసులను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ తుపాను వల్ల కలిగిన నష్టం కళ్లముందుండగానే మరో విపత్తును ఎదుర్కోవాల్సి రావడం వారిని వణికిస్తోంది. జిల్లాలోని తీరప్రాంత మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నా.. కోనసీమ మరోసారి భారీగా నష్టపోయే అవకాశముంది. వణికిపోతున్న కొబ్బరి రైతు 1996 తుపానుకు 30 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అంతకన్నా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశముందని తెలియడంతో కొబ్బరి రైతులు నిలువునా వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ తుపాను వల్ల వరితో పాటు, కొబ్బరి పంట ఎక్కువగా దెబ్బతింది. చెట్లు బతికినా జీవచ్ఛవాలుగా ఉన్నాయి. ఈ సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తే చెట్లు నిలువునా కూలిపోతాయని రైతులు వాపోతున్నారు. ‘తుపాను తీవ్రతకు పంటలు పోతే పోయాయి. కనీసం ప్రాణాలతో మిగిలితే చాలు’ అనుకునే స్థాయిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క తుపాను విద్యుత్ శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హెలెన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనిని ఇప్పటికీ సగం పూర్తి చేయని సిబ్బంది లెహర్ వల్ల కలిగే నష్టాన్ని ఊహించుకుని ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు 1996 తుపాను వల్ల అపారంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఈసారి తుపానుకు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాటింపు, మైకు ప్రచారాలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. పూరిపాకలు, గుడిసెలు, పాత భవనాల్లో ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తక్షణం తరలివెళ్లాలని హెచ్చరిస్తున్నారు. తుపాను సమయంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని చెబుతున్నారు. కోనసీమ తుపాను వల్ల తీరంలో మత్స్యకారులు ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వారిని తరలించేందుకు అధికారులు చర్యలు ఆరంభించారు. కోనసీమలో 74,513 మందిని తరలించాలన్న అంచనాకు వచ్చారు. కాట్రేనికోన మండలంలో అత్యధికంగా 22,654 మందిని తరలించాలని గుర్తించారు. ఇప్పటికే మగసానితిప్ప నుంచి 140 మందిని మంగళవారం బలుసుతిప్పలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ రెండుసార్లు ఈ మండలంలో ఇప్పటికే పర్యటించగా, తాజాగా జేసీ ఎం.ముత్యాలరాజు ఇక్కడే ఉండి తుపాను ప్రభావిత ప్రాంతాలవారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో తుపానుపై అవగాహన కల్పించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కు చెందిన ఏడు బృందాలు కోనసీమకు చేరుకున్నాయి. 40 మంది సభ్యులుగా ఉండే ఈ బృందాల్లో రెండు కాట్రేనికోన మండలంలోను, మరో రెండు ఐ.పోలవరం మండలంలోను, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉంచారు. పెనుగాలులకు బస్సులు బోల్తా పడవచ్చని, చెట్లు బస్సులపై పడవచ్చని, అందువల్ల గురువారం ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.