తోటలోని మొనగాళ్లు | coconut garden daily workers special story | Sakshi
Sakshi News home page

తోటలోని మొనగాళ్లు

Published Wed, Sep 13 2017 9:00 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

coconut garden daily workers special story

కొబ్బరి కాయల వెనుక అంతులేని శ్రమ
దింపుడు నుంచి విక్రయం వరకు సాహసాలే
కొబ్బరి కార్మికులకు అందని ప్రభుత్వ సాయం  


కళ్లకు ఇంపుగా కనిపించే కొబ్బరి వెనుక కనిపించని సాహస గాథలకు కథానాయకులు ఉన్నారు. చెట్టు ఎక్కడం, ఒడుపుగా కాయ దింపడం, వాటిని పద్ధతిగా ఒలవడం, చక్కగా బండి కట్టడం వంటి పనులకు కేరాఫ్‌ వారు. ఈ పనులు బయట ప్రపంచానికి అంతగా తెలీవు. దాదాపు ప్రతి పనిలోనూ అపాయం దాగి ఉంటుంది. ఆ అపాయమే తమ ఉపాధి మార్గమని వారు చెబుతుంటారు. చెట్టెక్కి కాయలు దింపే పద్ధతి నుంచి దొనికత్తి జమానా వరకు కొబ్బరి కార్మికుల పనితనం చాలా ప్రత్యేకం. కొందరు సన్నకారు రైతులు కూడా ఇక్కడ కార్మికులు కావడం విశేషం. దేవుడి గుడి మొదలుకుని ఇంటిలో వేడుకల వరకు అన్నింటా కొబ్బరిదే అగ్ర తాంబూలం. అందుకే కొబ్బరి తోటలోని మొనగాళ్ల గురించి తెలుసుకుందాం.                

 కవిటి
ఉద్దానం.. రాష్ట్రంలో కోనసీమ తర్వాత కొబ్బరి అంటే గుర్తుకువచ్చేది ఈ ప్రాంతమే. కొబ్బరికి పెట్టింది పేరైన ఈ ఊళ్లలో శ్రమ జీవులకు కొదవలేదు. కొబ్బరి రైతు తన కుటుంబ పోషణకు ప్రతి రెండు నెలలకోసారి కొబ్బరి కాయలను దింపుతారు. రైతులు వ్యక్తిగతంగా తోటలపై శ్రద్ధ తీసుకున్నా కాయలు చెట్టు నుంచి తీసే వారు మాత్రం వేరే ఉంటారు. వారే కొబ్బరి కార్మికులు. కొందరు సన్నకారు రైతులు కూడా కార్మికుల్లో భాగమే. అసంఘటిత రంగ కార్మి కుల్లా వీరు దశాబ్దాల తరబడి తోటల్లో పనులు చేస్తున్నారు. అయితే వీరిని గుర్తించిన వారు మా త్రం ఎవరూ లేరు.

ఒలుపు కార్మికులూ భాగస్వాములే..
కొబ్బరి నేలపైకి దించే ప్రక్రియ ముగిసిన తర్వాత కచ్చితంగా డొక్క తీయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఒలుపు చేసే కార్మికులు ఈ పనిలోనే ఉంటారు. కంచిలి ప్రధాన కేంద్రంగా ఉంటున్న కొబ్బరి మార్కెట్లో ఉత్తరాది రాష్ట్రాలకు రోజుకు 15 లారీల కొబ్బరికాయలు(ఒలిచిన కాయలు) ఎగుమతి అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమొత్తంలో ఒకేసారి ఒలుపు చేయాలంటే కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన నిపుణులైన ఒలుపు కార్మికులకే సాధ్యం. దీనికి చాలా శారీరక ధృడత్వంతో పాటు సహనం కూడా అవసరమే. వంద పణాలు(8000 కొబ్బరికాయలు) ఒలిచేందుకు సగటున రోజుకు పదిపణాలు వలిచే సామర్థ్యం కలి గిన వారు పది మంది అవసరం. ఒక లారీ లోడు సామర్థ్యం అంటే పెద్ద చిన్న పరిమాణాల్లో ఉన్న సుమారు 12,000 కాయలు ఒలుపు చేయాలి. 15 లారీ లోడులు అంటే 1.80లక్షల కాయ ఎగుమతి చేయాలి.

ఇంత పెద్దమొత్తంలో ఒలుపు చేయాలంటే అదే స్థాయిలో అధిక సంఖ్యలో కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతీ రోజు కవిటి మండలం నుంచి పొరుగు రాష్ట్రం ఒడిశాకు నిత్యం 10 నుంచి 15 మినీ లారీలు, మేజిక్‌ ఆటోల్లో సరుకు అమ్మకాలు కూడా జరుగుతుంటాయి. దీంతో వీరికి దాదాపు నెలకు పది రోజులు మినహా అన్ని రోజులూ పని ఉంటుంది. అయితే వీరి కూలి డబ్బులు కొబ్బరి కొన్న వ్యాపారి భరించడు. రైతే భరించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూలి డబ్బుల విషయంలో దాదాపు రైతులు కొంచెం బాధగానే కనిపిస్తూ ఉంటారు. తమకు వచ్చే కొద్ది లాభాలు కూలికి సరిపోతాయని చాలా మంది చెబుతుంటారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న కొబ్బరి కాయలు తీసే కార్మికులకు, ఒలుపు చేసే కార్మికులకు కార్మికశాఖ ద్వారా పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

సాహసమే..
ఒకప్పుడు కొబ్బరి కాయలు దింపడం అంటే ప్రాణాలతో చెలగాటమే అనేవారు. డబ్బై, ఎనభై అడుగులు ఎత్తున్న కొబ్బరి చెట్లు అలవోకగా ఎక్కి దింపేవారు. ప్రస్తుతం ఆ తరహా కార్మికులు తక్కువైపోయారు. ప్రస్తుతం దొనికత్తి (పొడవాటి వెదురుకర్ర చివరన కత్తిని కట్టిన పరికరం) వినియోగించి నేలమీద నుంచే కాయలు తీస్తున్నారు. ఈ పని కూడా అంత సులువు కా దు. ఒడుపుగా తీయకపోతే ఒంటికే ప్రమాదం. అయితే పాతతరం కార్మికులు ఇప్పటికీ తోటలో సాధ్యమైనంత వరకు పనులు చక్కబెడుతూ కనిపిస్తుంటారు.

దొనికత్తే మేలే కానీ..
దొనికత్తితో కాయలు తీసే విధానంలో వేగంగా కాయలు తీసే సౌలభ్యం ఉంటుంది. కానీ చెట్టు మొవ్వులో దట్టంగా గు బురుగా అల్లుకున్న కొబ్బరిపీచు, కొబ్బరిపాలలను తీసే అవకాశం, ఎండు కొమ్మలు, విరిగిన కమ్మలను తీయడం వీలుపడదు. దీంతో చెట్టు పరిశుభ్రత తగ్గి వ్యాధులు ప్రబలుతాయి. కార్మికులే పైకి ఎక్కితే పైన పేర్కొన్న పనులను చూడగలరు. అయితే ప్రత్యామ్నాయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో దొనికత్తి వాడకానికే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు.

కూలి బాగున్నా..
ఉదయం ఏడు గంటలకు వెళ్లి రెండు గంటల వ్యవధిలో కొబ్బరికాయలను తీస్తే  రెండు వందల రూపాయల కూలి వస్తుంది. అయితే ఈ మొత్తం కొందరు సన్నకారు రైతులకు భారంగా తోస్తోంది. కొంత మంది పెద్ద రైతులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో వారి కొబ్బరి తోటలన్నీ పూర్తిగా దింపు చేస్తే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మొత్తాన్ని ఇచ్చుకుంటున్నారు. ఇం కొందరు రైతులు తమ తోటల్లో తీసే కొబ్బరికాయలకు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్మికుడికి 8 పుంజీలు(32కాయలు) ఇస్తారు.

వారసత్వం
మా తాత తండ్రుల నుంచి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి రైతుల వద్ద కొబ్బరి కాయలు ఒలుపు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. శరీరంలో సత్తువ ఉన్నంత వరకు ఈ పనే చేస్తాను. – గయా మధు, కొబ్బరి ఒలుపు కార్మికుడు, కవిటి

ఆదాయ వనరు
నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాను. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఖాళీ సమయంలో కొబ్బరి కాయలు ఒలుపు చేసేందుకు వెళ్తుంటాను. ఓ నాలుగు ఐదు పణాలు ఒలిస్తే రెండు వందల వరకు వస్తుంది. – ఎ.ఈశ్వరరావు, ఆటో డ్రైవర్, కవిటి

చిన్నప్పటి నుంచే..
నేను చిన్నతనం నుంచే కొబ్బరి చెట్టు ఎక్కడం నేర్చుకున్నాను. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తూ మిగతా సందర్భాలో కాయలు తీసేందుకు వెళ్తాను. రైతు బాగుంటే మా జీవితాలు బాగుంటాయి.– వై.రుద్రయ్య, కొబ్బరిచెట్టు కాయలు తీసే కార్మికుడు, గడపుట్టుగ

పెట్టుబడులు ఉంటాయి
కొబ్బరి కాయలు తీసే కత్తులు గానీ, దొనికత్తిగానీ, వెదురుకర్ర గానీ పాడైతే వాటిని మళ్లీ కొనుక్కోవాలి. గతంలో తక్కువకే ఇవి దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర బాగా పెరిగింది. – మరిడి ఉమాపతి, గొండ్యాలపుట్టుగ, కొబ్బరి కార్మికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement