- వేలాది ఎకరాల్లో కూలిన చెట్లు
- కోత దశలో అరటిగెలలు నేలపాలు
- మామిడి, జీడి తోటలకు నష్టం
యలమంచిలి/నక్కపల్లి: ప్రకృతి దాడితో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. హుదూద్ దెబ్బకు కొబ్బరి,అరటి,మామిడి ,జీడి రైతులు కుదేలయ్యారు. ఆదివారం నాటి ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. యలమంచిలి, నక్కపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో చెట్లు కళ్లముందే చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి.
పంటచేతికొచ్చే సమయంలో అరటి తోటలు నేలకూలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ వర్షాలు, తుపానులప్పుడు వరికి నష్టం వాటిల్లేది. ఇప్పుడు నష్టం ఉద్యానవన రైతుల వంతయింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా వర్షపునీరే కన్పిస్తోంది. నేలకొరిగిన చెరకు తోటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చెరకు సాగు కలిసిరాక నష్టాలు చవిచూస్తున్న రైతులకు తుపాను రూపంలో మరింత నష్టం చేకూరినట్టయింది.
నేలకొరిగిన చెరకును ఎత్తికట్టడం తమకు ఆర్థికంగా మరింత భారమవుతుందని యలమంచిలి ప్రాంతానికి చెందిన రైతులు వాపోతున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా అరటితోటలు నేలమట్టమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. జీడి, మామిడి తోటలు సైతం మొదళ్లకు విరిగిపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నక్కపల్లి మండలంలో వేలాది కొబ్బరిచెట్లు నేలకూలిపోయాయి. సుమారు 5వేల ఎకరాల్లో తోటలకు తీవ్రనష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం. కొన్ని చోట్ల వేళ్లతో కుప్పకూలిపోగా,మరికొన్నిచోట్ల మొవ్వుతోసహా నేలరాలిపోయాయి.
ఈ చెట్లు ఎందుకూ పనిరాని పరిస్థితి. ఈదురుగాలలకు టన్నులకొద్దీ కొబ్బరికాయలు నేలరాలిపోయాయి. ఇక మామిడి తోటల్లో మధ్యకు నరికినట్టుగా చెట్లు విరిగిపోయాయి. జీడి చెట్లకు తీవ్రనష్టం వాటిల్లింది. 3వేల ఎకరాలకు పైగా మామిడి,2వేల ఎకరాలకు పైగా జీడి తోటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎన్ నర్సాపురంలో కర్రినానాజీకి చెందిన 3 ఎకరాల అరటితోట పూర్తిగా ధ్వంసమైంది. మరో వారం రోజుల్లో అరటిగెలలు కోసి మార్కెట్‌కు తరలిద్దామని భావిస్తున్న తరుణంలో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది.
ఈ మూడెకరాల తోటకు సుమారు రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టానని నానాజీ వాపోయాడు. కరంటు లేని సమయంలో జనరేటర్ పెట్టి నీటిని సరఫరా చేశానని ఆశించిన స్థాయిలో పంటపండిందని సంబరపడుతున్న తరుణంలో ఈదురుగాలులు తోటమొత్తాన్ని నాశనం చేశాయని కన్నీళ్లపర్యంతమయ్యాడు.
దేవవరం,డొంకాడ,జగన్నాధపురం,సీతానగరం,రమణయ్యపేట,దోసలపాడు,కాగిత, చందనాడ, వేంపాడు, తదితరప్రాంతాల్లో పత్తి, బత్తాయి,కంది, చెరకు, అరటి పంటలకు భారీనష్టం కలిగింది.
వేలాది ఎకరాల్లో నష్టం
వందలాది ఎకరాల్లో అరటి, వేలాది ఎకరాల్లో కొబ్బరి,మామిడితోటలు నేలకూలిపోయాయి. రూ.లక్షల్లో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈనష్టాన్నుంచి కోలుకోవాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులుచేసి పెట్టుబడులు పెట్టాం. రుణమాఫీచేయకపోగా,కనీసం రుణాలు కూడా ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుచేస్తే ప్రకృతి పగబట్టి సర్వనాశనం చేసింది.
- కర్రినానాజీ, రాజబాబు,శంకర్, రైతులు