
వచ్చే 12 నెలల్లో అంచనా
2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు దేశీ జీసీసీ మార్కెట్
ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టే పెట్టుకోవడం, స్థూల ఆర్థిక సమస్యలను అధిగమించడం తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) మెరుగైన వేతన పెంపుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో వచ్చే 12 నెలల్లో వేతన వృద్ధి సుమారు 9.8 శాతం వేతన వృద్ధి ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ రూపొందించిన ’ఇండియా టాలెంట్ టేకాఫ్ – ది జీసీసీ 4.0 స్టోరీ’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
‘ప్రపంచ జీసీసీల్లో దాదాపు 55 శాతం సెంటర్లు భారత్‌లో ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 110 బిలియన్ డాలర్లకు చేరనుంది. వ్యయాలు తగ్గించుకోవడం, పరిస్థితులను బట్టి వేగంగా స్పందించే సామర్థ్యాలను పెంచుకోవడం, విస్తృతంగా ప్రతిభావంతులను అందుబాటులో ఉంచుకోవడం వంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడుంది. ఈ పరిణామంతో వేతనాలు కూడా గణనీయంగా పెరగనుండటమనేది ఉద్యోగులకు కూడా కలిసి రానుంది.
ముఖ్యంగా స్పెషలైజ్డ్ నైపుణ్యాలు ఉన్న వారికి గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది‘ అని ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. ‘ఆర్థిక సేవల విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిస్క్ అనలిస్టులు, కాంప్లయెన్స్ అసోసియేట్స్, సీనియర్ రిస్క్ మేనేజర్లు, ఎఫ్‌ఆర్‌ఎం లీడ్స్, కాంప్లయెన్స్ హెడ్స్, గ్లోబల్ ఫైనాన్స్ డైరెక్టర్స్ మొదలైన హోదాల్లో ఉన్నవారికి వార్షికంగా రూ. 6 లక్షల నుంచి రూ. 90 లక్షల శ్రేణిలో వేతనాలు ఉంటున్నాయి.
సాంప్రదాయ హోదాలతో పోలిస్తే రిస్క్, ఎఫ్‌ఆర్‌ఎం వంటి స్పెషలైజ్డ్ నైపుణ్యాలున్న వారికి వేతనాలు 25–40 శాతం అధికంగా ఉంటున్నాయి. అలాగే, మౌలిక రంగాల పరిధిని దాటి ఆర్థిక విభాగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొత్త అవకాశాలు వస్తున్నాయి‘ అని అలగ్ వివరించారు.
అసమానతలపై దృష్టి పెట్టాలి..
వేతన వృద్ధి పటిష్టంగానే ఉన్నప్పటికీ స్త్రీ, పురుష ఉద్యోగుల జీతభత్యాల మధ్య అసమానతలను తగ్గించేందుకు మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అలగ్ చెప్పారు. పురుష ఉద్యోగుల జీతభత్యాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల వేతనాలు సగటున 75–85 శాతం స్థాయిలోనే ఉంటున్నాయని చెప్పారు. ఇక సీనియర్ హోదాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని, లీడర్íÙప్ బాధ్యతల్లో మహిళల ప్రాతినిధ్యం పరిమిత స్థాయిలోనే ఉంటోందని పేర్కొన్నారు. ఆరు నగరాలవ్యాప్తంగా 10 వివిధ రంగాలకు చెందిన 207 జీసీసీల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.
నివేదికలోని మరిన్ని వివరాలు..
⇒ మిగతా సంస్థలతో పోలిస్తే హైదరాబాద్ (19 శాతం), ముంబై (19 శాతం)ల్లోని జీసీసీలు అత్యధికంగా చెల్లిస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ సాఫ్ట్‌వేర్ .. కన్సల్టింగ్ (22 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసుల (18 శాతం) విభాగాలు ఉన్నాయి.
⇒ జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లో వేతన వృద్ధి పటిష్టంగా ఉండనుంది. ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు కారణం. మరోవైపు, పైస్థాయి ఉద్యోగాల్లో వ్యయాలను నియంత్రించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తుండటంతో సీనియర్ హోదాల్లోని వారికి వేతనాల పెంపు ఒక మోస్తరుగానే ఉండనుంది.
⇒ రాబోయే రోజుల్లో, 2030 నాటికి దేశీయంగా జీసీసీ రంగం వార్షికంగా 9–12 శాతం వృద్ధి చెందనుంది. దానికి తగ్గట్లుగా వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment