జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్‌వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం.
రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39).
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్‌విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్‌తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్‌లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్‌గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన.
రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి
పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్‌గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు.
పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్‌లో వేసి వేగంగా (18.800 ఆర్‌పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు.
చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్‌కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు.
– నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం.
పాల వినియోగం ఇలా
► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్‌క్రీమ్‌ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ.
► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్‌లెట్‌లో అమ్ముతున్నారు.
పుష్కలంగా పోషకాలు
► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆదరణ పెరుగుతోంది
కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్‌గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్‌గా కోకోనట్ వర్జిన్ ఆయిల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది.
– గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు,
ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్..
పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి.
– డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట.
∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్
Comments
Please login to add a commentAdd a comment