katrenikona
-
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
పచ్చి కొబ్బరితో పాలు, ఆయిల్.. రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే..
జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్‌వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39). డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్‌తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్‌లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్‌గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన. రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్లో వేసి వేగంగా (18.800 ఆర్పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్‌కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం. పాల వినియోగం ఇలా ► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్‌క్రీమ్‌ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. ► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్లెట్లో అమ్ముతున్నారు. పుష్కలంగా పోషకాలు ► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదరణ పెరుగుతోంది కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్‌గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్‌గా కోకోనట్ వర్జిన్ ఆయిల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది. – గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు, ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్.. పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి. – డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట. ∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
అదుపులోకి గ్యాస్ బ్లోఅవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఉప్పూడి గ్యాస్ బ్లోఅవుట్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. 42 గంటలపాటు ఉత్కంఠ రేకెత్తించిన గ్యాస్ విస్ఫోటనాన్ని కట్టడిచేయడంలో ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ మంగళవారం విజయవంతమైంది. ఓఎన్జీసీకి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని అడవిపేట రిగ్ పరిధిలోని ఉప్పూడి–1 బావిలో ఆదివారం గ్యాస్ బ్లోఅవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్‌ను కట్టడి చేసేందుకు ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ ప్రయత్నించింది. ప్లాన్–ఏలో భాగంగా నీటిని ఎగసిపడుతున్న గ్యాస్ బావిపైకి ఎగజిమ్ముతూ నియంత్రించాలనుకున్నారు. అది ఫలించకపోవడంతో మంగళవారం ప్లాన్–బి ప్రకారం రసాయనాలతో కూడిన మడ్‌ను పంపింగ్ చేయడం ద్వారా ఎగసిపడుతున్న గ్యాస్‌ను అదుపులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఓఎన్జీసీ రెస్క్యూటీమ్‌ను పర్యవేక్షిస్తున్న ఓఎన్జీసీ ఆపరేషన్ గ్రూపు జనరల్ మేనేజర్ ఆదేశ్‌కుమార్, ఆపరేషన్స్ ఏరియా మేనేజర్ బి.ప్రసాదరావు సూచన మేరకు ప్లాన్– ఏ నే మెరుగైన పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. 360 డిగ్రీల పీడనంతో అంబ్రిల్లా (గొడుగు మాదిరిగా)లా నీటిని గ్యాస్ బావిపై పంపింగ్ చేయడం ద్వారా నియంత్రించారు. ఈ ప్రక్రియను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి 10.40 గంటలకు ముగించారు. వెనువెంటనే రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ డీజీఎం ఏబీ రామారావు వీపునకు ఆక్సిజన్ సిలెండర్‌ను తగిలించుకుని వెల్ మౌత్ వద్దకు వెళ్లి వెల్‌కేప్‌ను మూసేయడం ద్వారా ఆపరేషన్‌ను ముగించారు. మంత్రి పినిపే విశ్వరూప్ డీజీఎంతో కలిసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ఓఎన్జీసీ అధికారులతో కలిసి విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఏడు బృందాలలో సుమారు 70 మంది పాల్గొన్నారు. 42 గంటల తరువాత గ్యాస్ అదుపులోకి రావడంతో ఉప్పూడి సహా కోనసీమ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు కేసు నమోదు: ఉప్పూడి–1 బావిని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్‌పై పోలీసు కేసు నమోదైంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ ప్రకటించారు. చమురు సంస్థల అన్వేషణతో జరుగుతున్న ప్రమాదాలపై సీఎం వైఎస్ జగన్‌కు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని మంత్రులు ఆదేశించారు. -
ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీక్
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయింది. మడ్ పంపింగ్ ద్వారా ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గ్యాస్ బ్లో అవుట్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఉప్పూడి పరిసరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రెండు రోజులుగా ఉప్పూడి సమీపంలోని ప్రజలను గ్యాస్ బ్లో అవుట్ వణికించిన సంగతి తెలిసిందే. దీనిని అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్జీసీ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రెస్క్యూ మంగళవారం ఆపరేషన్ కొనసాగించారు. గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. 2.2 కి.మీల లోతులో ఉన్న గ్యాస్ బావిలోకి నిరంతారాయంగా వాటర్ పంపింగ్ చేపట్టారు. చివరకు మడ్పంపింగ్ ద్వారా గంటన్నలోపే గ్యాస్ లీకేజ్‌ను అదుపులోని తెచ్చారు. అంతకుముందు గ్యాస్ లీకేజీ దృష్ట్యా ఘటన స్థలికి 2 కి.మీ పరిధిలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కాట్రేనికోనలో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ లీక్..
-
తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ లీక్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు. -
‘తాతయ్య’ దారుణం.. మహిళపై..
సాక్షి, తూర్పుగోదావరి : కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అరవై ఏళ్ల వృద్ధుడు ఓ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కృష్ణారామా..! అనుకోవాల్సిన వయసులో కీచకుడిగా మారాడు. వివరాలు.. డొక్కాడి మహాలక్ష్మి (38)పై డొక్కాడి తాతయ్య (60) సోమవారం అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహాలక్ష్మిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పునాదుల్లోనే అవినీతి పురుగు
కాట్రేనికోన, న్యూస్‌లైన్ : కాట్రేనికోన వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులతో, యార్డు నిధులతో చేపట్టిన గోడౌన్లు, ఇతర కట్టడాల నిర్మాణ ంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కృషి వికాస్ యోజన నిధులు రూ.3.2 కోట్లతో రెండు గోడౌన్లను, రూ.కోటి 30 లక్షలతో గోడౌన్ పర్యవేక్షణ కార్యాలయం, రోడ్లు, ప్రహరీ గోడ తదితర నిర్మాణ పనులు చేపట్టారు. రూ.కోటికి పైగా యార్డు నిధులతో మరో గోడౌన్ నిర్మిస్తున్నారు. నిజానికి యార్డులో ఇప్పటికే ఉన్న గోడౌన్‌నే పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. అలాంటప్పుడు కొత్తగా గోడౌన్ల నిర్మాణమే అవసరం లేదనుకుంటే.. దానికి తోడు నిర్మాణంలో మట్టితో కలిసిన నాసిరకం కంకర, ఇసుక, ఇనుము వాడటంతో పాటు సిమెంట్‌ను తగిన మోతాదులో వినియోగించడం లేదు. నాణ్యత లేని సామగ్రితోనే గోడౌన్ల బీములు, పిల్లర్లు నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలోనే బీమ్‌లు బీటలు వారి పోతున్నాయి. యార్డు కార్యక్రమాల నిర్వహణకు నిర్మిస్తున్న భవనం పనుల్లో నాణ్యత లేని నాసిరకం సిమెంట్ ఇటుకలను వాడుతున్నారు. ఉప్పునీటితో కట్టడానికే ముప్పు ఇక బేస్మెంట్ నిర్మాణానికి ఇటుకలకు బదులు నాసిరకం పెద్దరాళ్ళను వాడడమే కాక తగిన మోతాదులో సిమెంట్‌ను వాడడం లేదు. బేస్ మెంట్లో నాణ్యమైన ఇసుక వేయాలనే నిబంధనను గాలికి వ దిలేశారు. అధికారుల సమక్షంలోనే కాంట్రాక్టరు బేస్మెంట్లో సముద్రపు పాయల నుంచి తెచ్చిన ఉప్పు నీటి ఇసుకను వేసినా చూస్తూ ఊరుకుంటున్నారు. ఉప్పు నీటితో సిమెంటు పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంజనీర్ల నుంచి సామాన్యుల వరకు స్వచ్ఛమైన ఇసుకనే వినియోగిస్తారు. బేస్మెంట్ను తడిపేందుకు సైతం మంచి నీటిని వినియోగిస్తారు. బేస్మెంట్లో వేసిన ఉప్పు నీటి ఇసుక బిగుసుకునేందుకు నీరు పెట్టినపుడు దానిలోని ఉప్పు శాతం నీటితో కలసి గోడౌన్ గోడలకు చేరే ప్రమాదం ఉంది. ఉప్పు నీటికి ఇసుముకు తుప్పు పట్టించి నాశనం చేసే గుణం ఉంది. అందుకే నిర్మాణ పనులలో ఉప్పు నీరు తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు. అలాంటిది కాంట్రాక్టర్ యథేచ్ఛగా ఉప్పునీటి ఇసుక వాడుతున్నా, మిగతా నిర్మాణ సామగ్రినీ నాసిరకందే వినియోగిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండడం వెనుక వారికి ముట్టాల్సిన ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు తమకు అవసరం లేకున్నా వారి కమీషన్ల కోసమే ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. కాగా గోడౌన్ పనుల్లో నాణ్యత లోపిస్తోందని స్థానికులు ఇటీవల కాట్రేనికోనలో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. అయినా పనులు నాసిరకంగా మెటీరియల్‌తోనే జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బేస్మెంట్లో వేసిన ఉప్పు నీటి ఇసుకను తొలగించి నాణ్యమైన ఇసుకను వేయించాలని, ప్రతి పనీ నాణ్యమైన మెటీరియల్‌తోనే జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.