సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది.
కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది.
చిర్రయానాంలో హేచరీ
పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్‌జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్‌టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా.
మూడు రకాలుగా..
పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు.
మన తీరం అనుకూలం
జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది.
–షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment