uppalaguptam
-
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
అమలాపురం: కరోనా రక్కసి ఆ కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలతో పాటు కుటుంబ పెద్దను పొట్టన పెట్టుకుంది. ‘సాక్షి’ ఉప్పలగుప్తం మండల విలేకరిగా పని చేస్తున్న సలాది నాగబాబు గత శనివారం కరోనాతో మృతి చెందారు. ఆయన సోదరుడు సలాది కృష్ణారావు శుక్రవారం ఉదయం కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. అదే రోజు రాత్రి కృష్ణారావు భార్య సలాది లక్ష్మి (40) కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. కృష్ణారావుతో పాటు కరోనా బారిన పడిన ఆమె తొలుత ఇంటి వద్ద, తరువాత బోడసకుర్రు కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందారు. భార్యాభర్తల పరిస్థితి విషమించడంతో బుధవారం వారిని కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. కళ్ల ముందే భర్త మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మృత్యువాత పడింది. చదవండి: సాక్షి ఎఫెక్ట్: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు -
ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య
సాక్షి, అమలాపురం టౌన్: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్ఐ బి.జనార్దన్ నమోదు చేయగా రూరల్ సీఐ జి. దేవకుమార్ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. -
గోవిందరాజు పై పంది దాడి
ఉప్పలగుప్తం : పంది దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉప్పలగుప్తానికి చెందిన కేతా గోవిందరాజు బుధవారం గ్రామంలోని శ్మశానవాటిక వైపు కాలినడకన వెళుతుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న పంది అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన గోవిందరాజుకు స్థానికులు ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బోరుబావిలో నుంచి మంటలు!
ఉప్పలగుప్పం (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4 సంవత్సరాల క్రితం తవ్వి వదిలేసిన ఈ బోర్వెల్ వినియోగంలో లేకపోవడంతో చెరువుల యజమానులు దీన్ని పూడ్చకుండా వదిలేశారు. గత కొంతకాలంగా ఈ బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడం మొదలైంది. అయితే శుక్రవారం మాత్రం నీటితో పాటు మంటలు కూడా వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. -
వివాహితకు ఫోన్లో వేధింపులు
ఉప్పలగుప్తం : ఇటీవల వివాహమైన తన కు ఫోన్ చేసి వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్తతో కలిసి ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్ ముందు మంగళవారం రాత్రి బైఠాయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ ఏడాది మార్చి ఏడున కిత్తనచెరువుకు చెందిన పులపర్తి నానిబాబుతో సత్యశైలకు వివాహమైంది. అదే గ్రామానికి చెందిన పోతుల నాగేశ్వరరావు(నాగు) అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పినా.. నాగేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దల ద్వారా చెప్పించినా.. ఎస్సై స్వామినాయుడు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్యాభర్తలు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మాజీ సర్పంచ్ యల్లమిల్లి రాముతో పాటు పలువురు గ్రామస్తులు వారికి అండగా నిలిచారు. దీనిపై ఎస్సై స్వామినాయుడును వివరణ కోరగా, ఆ వ్యక్తిని పిలిపిస్తానని చెప్పారు. -
మాతృమూర్తి ఆశీస్సులందుకున్న రాజప్ప
ఉప్పలగుప్తం :పెద్దాపురం శాసనసభ్యునిగా ఎన్నికై నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా, హోంశాఖ, విపత్తుల నివారణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం తన స్వగ్రామమైన పెద్దగాడవిల్లిలో తన తల్లి కొండాయమ్మ ఆశీస్సులు అందుకున్నారు. రాత్రి తొమ్మిదిగంటల సమయంలో ఊరేగింపుగా వచ్చిన రాజప్పకు ఆయన సోదరి సుందరనీడి వరలక్ష్మి హరతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. తండ్రి రంగయ్య చిత్రపటం వద్ద రాజప్ప నివాళులర్పించారు. అనంతరం తల్లి దీవెనలందుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనాలందించారు. భార్య అనూరాధ, కుమారుడు రంగనాథ్, సోదరులు బాపూజీ, సత్తిబాబు, జగ్గయ్యనాయుడు కుటుంబ సభ్యులందరూ ఒకొక్కరిగా రాజప్పకు శుభాకాంక్షలు తెలిపారు. రాజప్పకు రాజయోగం పట్టిందని గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచారు. రాజప్ప తండ్రి వెంకట రంగయ్య ఎన్నికల సమయంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.