మాతృమూర్తి ఆశీస్సులందుకున్న రాజప్ప
ఉప్పలగుప్తం :పెద్దాపురం శాసనసభ్యునిగా ఎన్నికై నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా, హోంశాఖ, విపత్తుల నివారణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం తన స్వగ్రామమైన పెద్దగాడవిల్లిలో తన తల్లి కొండాయమ్మ ఆశీస్సులు అందుకున్నారు. రాత్రి తొమ్మిదిగంటల సమయంలో ఊరేగింపుగా వచ్చిన రాజప్పకు ఆయన సోదరి సుందరనీడి వరలక్ష్మి హరతి పట్టి ఇంట్లోకి స్వాగతించారు. తండ్రి రంగయ్య చిత్రపటం వద్ద రాజప్ప నివాళులర్పించారు. అనంతరం తల్లి దీవెనలందుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనాలందించారు. భార్య అనూరాధ, కుమారుడు రంగనాథ్, సోదరులు బాపూజీ, సత్తిబాబు, జగ్గయ్యనాయుడు కుటుంబ సభ్యులందరూ ఒకొక్కరిగా రాజప్పకు శుభాకాంక్షలు తెలిపారు. రాజప్పకు రాజయోగం పట్టిందని గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి మిఠాయిలు పంచారు. రాజప్ప తండ్రి వెంకట రంగయ్య ఎన్నికల సమయంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.