బ్లో అవుట్ అదుపులోకి రావడంతో విక్టరీ గుర్తును చూపిస్తున్న మేనేజ్‌మెంట్ బృందం
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఉప్పూడి గ్యాస్ బ్లోఅవుట్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. 42 గంటలపాటు ఉత్కంఠ రేకెత్తించిన గ్యాస్ విస్ఫోటనాన్ని కట్టడిచేయడంలో ఓఎన్‌జీసీ రెస్క్యూటీమ్ మంగళవారం విజయవంతమైంది. ఓఎన్‌జీసీకి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని అడవిపేట రిగ్ పరిధిలోని ఉప్పూడి–1 బావిలో ఆదివారం గ్యాస్ బ్లోఅవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్‌ను కట్టడి చేసేందుకు ఓఎన్‌జీసీ రెస్క్యూటీమ్ ప్రయత్నించింది. ప్లాన్–ఏలో భాగంగా నీటిని ఎగసిపడుతున్న గ్యాస్ బావిపైకి ఎగజిమ్ముతూ నియంత్రించాలనుకున్నారు. అది ఫలించకపోవడంతో మంగళవారం ప్లాన్–బి ప్రకారం రసాయనాలతో కూడిన మడ్‌ను పంపింగ్ చేయడం ద్వారా ఎగసిపడుతున్న గ్యాస్‌ను అదుపులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఓఎన్‌జీసీ రెస్క్యూటీమ్‌ను పర్యవేక్షిస్తున్న ఓఎన్‌జీసీ ఆపరేషన్ గ్రూపు జనరల్ మేనేజర్ ఆదేశ్‌కుమార్, ఆపరేషన్స్ ఏరియా మేనేజర్ బి.ప్రసాదరావు సూచన మేరకు ప్లాన్– ఏ నే మెరుగైన పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు.
360 డిగ్రీల పీడనంతో అంబ్రిల్లా (గొడుగు మాదిరిగా)లా నీటిని గ్యాస్ బావిపై పంపింగ్ చేయడం ద్వారా నియంత్రించారు. ఈ ప్రక్రియను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి 10.40 గంటలకు ముగించారు. వెనువెంటనే రిస్క్ మేనేజ్‌మెంట్ టీమ్ డీజీఎం ఏబీ రామారావు వీపునకు ఆక్సిజన్ సిలెండర్‌ను తగిలించుకుని వెల్ మౌత్ వద్దకు వెళ్లి వెల్‌కేప్‌ను మూసేయడం ద్వారా ఆపరేషన్‌ను ముగించారు. మంత్రి పినిపే విశ్వరూప్ డీజీఎంతో కలిసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ఓఎన్‌జీసీ అధికారులతో కలిసి విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఏడు బృందాలలో సుమారు 70 మంది పాల్గొన్నారు. 42 గంటల తరువాత గ్యాస్ అదుపులోకి రావడంతో ఉప్పూడి సహా కోనసీమ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
పోలీసు కేసు నమోదు: ఉప్పూడి–1 బావిని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్‌పై పోలీసు కేసు నమోదైంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ ప్రకటించారు. చమురు సంస్థల అన్వేషణతో జరుగుతున్న ప్రమాదాలపై సీఎం వైఎస్ జగన్‌కు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని మంత్రులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment