అమ్మబోతే అశనిపాతమే..
Published Sat, Dec 28 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పడిపోతే ..మార్కెట్‌లో వాటికి డిమాండ్ పెరగడం సర్వసాధారణం. ఇటీవల వరదలు, తుపానులు కారణంగా కాయగూరల దిగుబడి తగ్గడంతో వాటి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రకృతి విపత్తులతో ఖరీఫ్‌లో మూడొంతుల దిగుబడి పడిపోయినా ధాన్యం ధర మాత్రం పెరగకపోవడం వెనుక అటు దళారుల దోపిడీతోపాటు ఇటు రైతుల తక్షణ అవసరాలు, వారిని ఆదుకోవలసిన ప్రభుత్వంలో క్షమార్హం కాని అలసత్వం కారణంగా నిలిచాయి. ఖరీఫ్‌లో అధికారుల అంచనా ప్రకారం 12 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, హెలెన్ తుపాను వల్ల దిగుబడి 4 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే అంచనా వేసిన దాన్లో మూడోవంతు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆ ధాన్యం కూడా సగానికి పైగా రంగుమారిన, మొలకలు, తాలుతప్పలతో ఉంది. సుమారు రెండులక్షల టన్నుల ధాన్యం మాత్రమే నాణ్యమైన దిగుబడిగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. మొత్తం సాగులో
85 శాతం స్వర్ణరకాన్నే రైతులు పండించారు. దిగుబడి ఇంత గణనీయంగా పడిపోయిన సమయంలో ధాన్యానికి మంచి ధర రావాల్సి ఉంది. అయితే 24 క్యారట్ల పసిడి వంటి పసిమి వన్నె ధాన్యమైనా బహిరంగ మార్కెట్‌లో బస్తా (75 కేజీలు) ధర రూ.1,020 మాత్రమే పలుకుతోంది. దీని ప్రకారం క్వింటాల్ ధర రూ.1,360 కావడం గమనార్హం. క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,310 కన్నా కేవలం రూ.50 మాత్రమే ఎక్కువ వస్తోంది. దిగుబడి తగ్గినా ధర పెరగకపోవడానికి దళారులు, ప్రభుత్వం కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.
నిల్వ చేసుకోలేని నిస్సహాయులు
రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వారిని నిలువునా ముంచేయడంలో సిద్ధహస్తులైన ధాన్యం దళారుల పంట మరోసారి పండుతోంది. నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.50 అదనంగా ఇచ్చి కొంటున్నా రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని మాత్రం కేవలం రూ.600 నుంచి రూ.700 మధ్య కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతుల్లో చాలామంది దళారుల వద్ద అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడులు పెట్టిన వారే. దిగుబడి తగ్గినందున కొద్దిపాటి ధాన్యాన్ని నిల్వ చేసుకోగలిగితే ముందుముందు మంచి ధర లభించే అవకాశం ఉంది.
అయితే అప్పులిచ్చిన దళారులు రైతులపై ఒత్తిడి తెచ్చి ధాన్యం అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కోతలు పూర్తవుతున్న సమయంలోనే తూర్పు, మధ్యడెల్టాల్లో తీరప్రాంతాల్లో రబీసాగు ప్రారంభమైంది. నీటి లభ్యత తక్కువగా ఉండడంతో నారుమళ్లు పోయాలని అధికారులు ఒత్తిడి తేవడంతో రైతులు నూర్పులు పక్కనబెట్టి రబీపనుల్లో తలమునకలయ్యారు. ఈ కారణంగా కూలీల కొరత ఏర్పడి నూర్పులు లేక వరిపనలు కళ్లాల్లోనే ఉండిపోయాయి. వర్షాల కారణంగా కంబైండ్ హార్వెస్టర్ వంటి పెద్ద యంత్రాలతో ఒకేసారి కోతలు, నూర్పులు చేసే అవకాశం లేకపోయింది. కేవలం నూర్పులు చేసే యంత్రాలు తక్కువగా ఉండడంతో పంటలో చాలావరకు కళ్లాలకే పరిమితమైంది.
‘రైతు బంధు’ ఉన్నా విధి లేక..
ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్నదాత విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రంగుమారిన, నాణ్యతలేని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అధికారుల బృందం ధాన్యం నాణ్యతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలుకు అనుమతివ్వలేదు. దీంతో దళారులు తాము ‘నిర్ణయించిందే నాణ్యత.. ఇచ్చిందే ధర’ అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ‘రైతు బంధు’ పథకంలో ధాన్యాన్ని నిల్వ చేసుకుని మార్కెట్‌లో ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంది. నిల్వ చేసిన ధాన్యం విలువలో 75 శాతం మార్కెట్ యార్డు రుణంగా కూడా అందిస్తుంది. ఇలా లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశమున్నా రైతులకు దీనిపై అవగాహన లేకపోవడం, అవరాలు తరుముకు రావడం, దళారుల ఒత్తిడి కారణంగా అయినకాడికి అమ్ముకోక తప్పడం లేదు.
Advertisement