Market demand
-
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (అన్ని వసతులతో, పని చేయడానికి సిద్ధంగా ఉండే పని ప్రదేశాలు) మార్కెట్ మంచి జోరు మీద ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ 60 శాతం వృద్ధితో రూ.14,000 కోట్లకు చేరుకుంటుందని అప్‌ఫ్లెక్స్ ఇండియా సంస్థ తెలిపింది. అప్‌ఫ్లెక్స్ కూడా ఈ రంగంలోనే సేవలు అందిస్తుంటుంది. ఆపరేటర్లు ఒక్కో డెస్‌్కకు వసూలు చేసే చార్జీ పెరగడం, పోర్ట్‌ఫోలియో విస్తరణ మార్కెట్ పరిమాణం పెరిగేందుకు కారణమవుతాయని అప్‌ఫ్లెక్స్ నివేదిక వివరించింది. ఈ నివేదికను వీవర్క్ ఇండియా సీఈవో కరన్ విర్వాణి వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వార్షిక అద్దె ఆదాయం 2022–23లో రూ.8,903 కోట్లుగా ఉంటే, అది 2023–24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక్కో డెస్క్ నెలవారీ సగటు అద్దె 9,200 నుంచి 10,400కు.. అలాగే, అక్యుపెన్సీ (డెస్క్‌లు భర్తీ) రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది. హైబ్రిడ్ పని విధానాలతో డిమాండ్ ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ గడిచిన కొన్ని సంవత్సరాల్లో గుణాత్మకమైన మార్పును చూసింది. ఇందులో ఫ్లెక్స్ స్పేస్ తన వంతు పాత్ర పోషించింది. హైబ్రిడ్ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది’’అని విర్వాణీ తెలిపారు. ‘‘కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసే వారు. ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దేశంలో ఫ్లెక్సిబుల్ వర్స్‌స్పేస్ దిశగా వస్తున్న మార్పు ఆశాజనకంగా ఉంది’’అని అప్‌ఫ్లెక్స్ ఇండియా సీఈవో ప్రత్యూష్ పాండే వివరించారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్ పని విధానాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ఈ మార్కెట్ ఇంకా విస్తరిస్తుందని చెప్పారు. ‘‘కార్పొరేట్లు సొంతంగా పెద్ద ప్రదేశాలపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులు ఆఫీస్ పరిష్కారాలను అందించే వారి సేవలను పొందడాన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. దీనివల్ల పనిలో సౌకర్యంతోపాటు, వ్యయాలు ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతోంది’’అని పాండే వివరించారు. 2023 జూన్ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్ లీజింగ్‌లో కోవర్కింగ్ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్ తెలిపింది. -
పాత పరిశ్రమకు కొత్తగా రాయితీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కొల్లగొట్టేందుకు ఓ కంపెనీ వేసిన పన్నాగమిది. గతంలో మూతపడిన కంపెనీని తెరుస్తూ... దానికి సరికొత్తగా రాయితీలు కల్పించాలని కోరుతోంది. ఆ కంపెనీ కోరిందే తడవుగా కేవలం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాయితీ రూపంలోనే ఏకంగా రూ.400 కోట్లకుపైగా రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లాలో సుమారు రూ.660కోట్ల వ్యయంతో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు 1993లో ఎస్జేకే సంస్థ ముందుకు వచ్చింది. టార్గెట్ 2000 పథకం కింద 135 శాతం అమ్మకపు పన్ను మినహాయింపును 13 ఏళ్ల పాటు కల్పిస్తూ 1997 మార్చి 21న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆర్థికవ్యవస్థ మందగించడంతో పాటు స్టీలు మార్కెట్‌కు డిమాండ్ తగ్గడంతో ప్లాంటు ఏర్పాటు కాలేదు. అనంతరం రాయితీ కాలపరిమితిని పదేళ్లకు తగ్గిస్తూ నవంబర్ 2004లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే 25 శాతం అమ్మకపు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ప్రభుత్వం కంపెనీకి 25 శాతం అమ్మకపు రాయితీని కల్పించింది. 2005 నుంచి పిగ్ ఐరన్ స్టీల్ బిల్లెట్లను (దుక్క ఇనుము) తయారుచేసిన ప్లాంటు 2008లో మూతపడింది. అనంతరం ఈ కంపెనీని 25 ఫిబ్రవరి 2013లో జర్మనీకి చెందిన కళ్యాణి గ్రూపు సంస్థ... గెరడు స్టీలు ఇండియా కైవసం చేసుకుంది. పాత ప్లాంటులోనే దుక్క ఇనుమును అవసరమైన రూపాల్లో తయారుచేసే రీ- రోలింగ్ మిల్లును మాత్రమే కొత్తగా ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక విధానం ప్రకారం రీ-రోలింగ్ మిల్ రాయితీకి అనర్హత జాబితాలో ఉంది. కానీ 1993లో ఏర్పాటైన పాత స్టీలు ప్లాంటును చూపించి రాయితీలు పొందేందుకు సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాము ఇప్పటివరకు ఎటువంటి రాయితీలను తీసుకోనందువల్ల తాజా పారిశ్రామిక విధానం ప్రకారం తమకు 100 శాతం వ్యాట్ రాయితీతోపాటు యూనిట్‌కు 75 పైసల చొప్పున విద్యుత్ రాయితీ, 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, ఇతర రాయితీలు కల్పించాలని కోరింది. ఏదైనా నిర్దిష్ట కాలానికి ప్రభుత్వం కల్పించిన రాయితీలను తీసుకోకపోతే అవి ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. కానీ గెరడు సంస్థ మాత్రం గతంలో రాయితీలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమని అడగడం విడ్డూరం. కంపెనీ కోరిందే తడవుగా... రాయితీలు కల్పించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం ప్రారంభించారు. అంటే 1993 నాటి ప్లాంటుకు 2010-15 పారిశ్రామిక విధానం ప్రకారం రాయితీలు ఇవ్వనున్నారన్నమాట. ఇటువంటి విచిత్రం రాష్ట్ర పారిశ్రామికరంగంలో ఎన్నడూ జరగలేదని పరిశ్రమలశాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
అమ్మబోతే అశనిపాతమే..
అమలాపురం, న్యూస్‌లైన్ :వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పడిపోతే ..మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడం సర్వసాధారణం. ఇటీవల వరదలు, తుపానులు కారణంగా కాయగూరల దిగుబడి తగ్గడంతో వాటి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రకృతి విపత్తులతో ఖరీఫ్‌లో మూడొంతుల దిగుబడి పడిపోయినా ధాన్యం ధర మాత్రం పెరగకపోవడం వెనుక అటు దళారుల దోపిడీతోపాటు ఇటు రైతుల తక్షణ అవసరాలు, వారిని ఆదుకోవలసిన ప్రభుత్వంలో క్షమార్హం కాని అలసత్వం కారణంగా నిలిచాయి. ఖరీఫ్‌లో అధికారుల అంచనా ప్రకారం 12 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు, హెలెన్ తుపాను వల్ల దిగుబడి 4 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే అంచనా వేసిన దాన్లో మూడోవంతు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆ ధాన్యం కూడా సగానికి పైగా రంగుమారిన, మొలకలు, తాలుతప్పలతో ఉంది. సుమారు రెండులక్షల టన్నుల ధాన్యం మాత్రమే నాణ్యమైన దిగుబడిగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. మొత్తం సాగులో 85 శాతం స్వర్ణరకాన్నే రైతులు పండించారు. దిగుబడి ఇంత గణనీయంగా పడిపోయిన సమయంలో ధాన్యానికి మంచి ధర రావాల్సి ఉంది. అయితే 24 క్యారట్ల పసిడి వంటి పసిమి వన్నె ధాన్యమైనా బహిరంగ మార్కెట్లో బస్తా (75 కేజీలు) ధర రూ.1,020 మాత్రమే పలుకుతోంది. దీని ప్రకారం క్వింటాల్ ధర రూ.1,360 కావడం గమనార్హం. క్వింటాల్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,310 కన్నా కేవలం రూ.50 మాత్రమే ఎక్కువ వస్తోంది. దిగుబడి తగ్గినా ధర పెరగకపోవడానికి దళారులు, ప్రభుత్వం కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నిల్వ చేసుకోలేని నిస్సహాయులు రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వారిని నిలువునా ముంచేయడంలో సిద్ధహస్తులైన ధాన్యం దళారుల పంట మరోసారి పండుతోంది. నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.50 అదనంగా ఇచ్చి కొంటున్నా రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని మాత్రం కేవలం రూ.600 నుంచి రూ.700 మధ్య కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతుల్లో చాలామంది దళారుల వద్ద అప్పులు చేసి ఖరీఫ్ పెట్టుబడులు పెట్టిన వారే. దిగుబడి తగ్గినందున కొద్దిపాటి ధాన్యాన్ని నిల్వ చేసుకోగలిగితే ముందుముందు మంచి ధర లభించే అవకాశం ఉంది. అయితే అప్పులిచ్చిన దళారులు రైతులపై ఒత్తిడి తెచ్చి ధాన్యం అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కోతలు పూర్తవుతున్న సమయంలోనే తూర్పు, మధ్యడెల్టాల్లో తీరప్రాంతాల్లో రబీసాగు ప్రారంభమైంది. నీటి లభ్యత తక్కువగా ఉండడంతో నారుమళ్లు పోయాలని అధికారులు ఒత్తిడి తేవడంతో రైతులు నూర్పులు పక్కనబెట్టి రబీపనుల్లో తలమునకలయ్యారు. ఈ కారణంగా కూలీల కొరత ఏర్పడి నూర్పులు లేక వరిపనలు కళ్లాల్లోనే ఉండిపోయాయి. వర్షాల కారణంగా కంబైండ్ హార్వెస్టర్ వంటి పెద్ద యంత్రాలతో ఒకేసారి కోతలు, నూర్పులు చేసే అవకాశం లేకపోయింది. కేవలం నూర్పులు చేసే యంత్రాలు తక్కువగా ఉండడంతో పంటలో చాలావరకు కళ్లాలకే పరిమితమైంది. ‘రైతు బంధు’ ఉన్నా విధి లేక.. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్నదాత విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రంగుమారిన, నాణ్యతలేని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అధికారుల బృందం ధాన్యం నాణ్యతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలుకు అనుమతివ్వలేదు. దీంతో దళారులు తాము ‘నిర్ణయించిందే నాణ్యత.. ఇచ్చిందే ధర’ అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ‘రైతు బంధు’ పథకంలో ధాన్యాన్ని నిల్వ చేసుకుని మార్కెట్లో ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంది. నిల్వ చేసిన ధాన్యం విలువలో 75 శాతం మార్కెట్ యార్డు రుణంగా కూడా అందిస్తుంది. ఇలా లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశమున్నా రైతులకు దీనిపై అవగాహన లేకపోవడం, అవరాలు తరుముకు రావడం, దళారుల ఒత్తిడి కారణంగా అయినకాడికి అమ్ముకోక తప్పడం లేదు.