ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ | Flexible office space market may rise to over Rs 14,000 cr in FY24 | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌

Published Fri, Dec 22 2023 6:02 AM | Last Updated on Fri, Dec 22 2023 6:02 AM

Flexible office space market may rise to over Rs 14,000 cr in FY24 - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ (అన్ని వసతులతో, పని చేయడానికి సిద్ధంగా ఉండే పని ప్రదేశాలు) మార్కెట్‌ మంచి జోరు మీద ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్‌ 60 శాతం వృద్ధితో రూ.14,000 కోట్లకు చేరుకుంటుందని అప్‌ఫ్లెక్స్‌ ఇండియా సంస్థ తెలిపింది. అప్‌ఫ్లెక్స్‌ కూడా ఈ రంగంలోనే సేవలు అందిస్తుంటుంది.

ఆపరేటర్లు ఒక్కో డెస్‌్కకు వసూలు చేసే చార్జీ పెరగడం, పోర్ట్‌ఫోలియో విస్తరణ మార్కెట్‌ పరిమాణం పెరిగేందుకు కారణమవుతాయని అప్‌ఫ్లెక్స్‌ నివేదిక వివరించింది. ఈ నివేదికను వీవర్క్‌ ఇండియా సీఈవో కరన్‌ విర్వాణి వెల్లడించారు. ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వార్షిక అద్దె ఆదాయం 2022–23లో రూ.8,903 కోట్లుగా ఉంటే, అది 2023–24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది.

అలాగే ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌లో ఒక్కో డెస్క్‌ నెలవారీ సగటు అద్దె 9,200 నుంచి 10,400కు.. అలాగే, అక్యుపెన్సీ (డెస్క్‌లు భర్తీ) రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది.

హైబ్రిడ్‌ పని విధానాలతో డిమాండ్‌
‘‘దేశ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ గడిచిన కొన్ని సంవత్సరాల్లో గుణాత్మకమైన మార్పును చూసింది. ఇందులో ఫ్లెక్స్‌ స్పేస్‌ తన వంతు పాత్ర పోషించింది. హైబ్రిడ్‌ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్‌ పెరుగుతోంది’’అని విర్వాణీ తెలిపారు. ‘‘కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసే వారు.

ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దేశంలో ఫ్లెక్సిబుల్‌ వర్స్‌స్పేస్‌ దిశగా వస్తున్న మార్పు ఆశాజనకంగా ఉంది’’అని అప్‌ఫ్లెక్స్‌ ఇండియా సీఈవో ప్రత్యూష్‌ పాండే వివరించారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్‌ పని విధానాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ఈ మార్కెట్‌ ఇంకా విస్తరిస్తుందని చెప్పారు.

‘‘కార్పొరేట్లు సొంతంగా పెద్ద ప్రదేశాలపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులు ఆఫీస్‌ పరిష్కారాలను అందించే వారి సేవలను పొందడాన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. దీనివల్ల పనిలో సౌకర్యంతోపాటు, వ్యయాలు ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతోంది’’అని పాండే వివరించారు. 2023 జూన్‌ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్‌ లీజింగ్‌లో కోవర్కింగ్‌ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement