పాత పరిశ్రమకు కొత్తగా రాయితీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కొల్లగొట్టేందుకు ఓ కంపెనీ వేసిన పన్నాగమిది. గతంలో మూతపడిన కంపెనీని తెరుస్తూ... దానికి సరికొత్తగా రాయితీలు కల్పించాలని కోరుతోంది. ఆ కంపెనీ కోరిందే తడవుగా కేవలం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రాయితీ రూపంలోనే ఏకంగా రూ.400 కోట్లకుపైగా రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లాలో సుమారు రూ.660కోట్ల వ్యయంతో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు 1993లో ఎస్‌జేకే సంస్థ ముందుకు వచ్చింది. టార్గెట్ 2000 పథకం కింద 135 శాతం అమ్మకపు పన్ను మినహాయింపును 13 ఏళ్ల పాటు కల్పిస్తూ 1997 మార్చి 21న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆర్థికవ్యవస్థ మందగించడంతో పాటు స్టీలు మార్కెట్‌కు డిమాండ్ తగ్గడంతో ప్లాంటు ఏర్పాటు కాలేదు. అనంతరం రాయితీ కాలపరిమితిని పదేళ్లకు తగ్గిస్తూ నవంబర్ 2004లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే 25 శాతం అమ్మకపు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ప్రభుత్వం కంపెనీకి 25 శాతం అమ్మకపు రాయితీని కల్పించింది. 2005 నుంచి పిగ్ ఐరన్ స్టీల్ బిల్లెట్లను (దుక్క ఇనుము) తయారుచేసిన ప్లాంటు 2008లో మూతపడింది. అనంతరం ఈ కంపెనీని 25 ఫిబ్రవరి 2013లో జర్మనీకి చెందిన కళ్యాణి గ్రూపు సంస్థ... గెరడు స్టీలు ఇండియా కైవసం చేసుకుంది. పాత ప్లాంటులోనే దుక్క ఇనుమును అవసరమైన రూపాల్లో తయారుచేసే రీ- రోలింగ్ మిల్లును మాత్రమే కొత్తగా ఏర్పాటు చేస్తోంది. పారిశ్రామిక విధానం ప్రకారం రీ-రోలింగ్ మిల్ రాయితీకి అనర్హత జాబితాలో ఉంది. కానీ 1993లో ఏర్పాటైన పాత స్టీలు ప్లాంటును చూపించి రాయితీలు పొందేందుకు సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తాము ఇప్పటివరకు ఎటువంటి రాయితీలను తీసుకోనందువల్ల తాజా పారిశ్రామిక విధానం ప్రకారం తమకు 100 శాతం వ్యాట్ రాయితీతోపాటు యూనిట్‌కు 75 పైసల చొప్పున విద్యుత్ రాయితీ, 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, ఇతర రాయితీలు కల్పించాలని కోరింది. ఏదైనా నిర్దిష్ట కాలానికి ప్రభుత్వం కల్పించిన రాయితీలను తీసుకోకపోతే అవి ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. కానీ గెరడు సంస్థ మాత్రం గతంలో రాయితీలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమని అడగడం విడ్డూరం. కంపెనీ కోరిందే తడవుగా... రాయితీలు కల్పించేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదపడం ప్రారంభించారు. అంటే 1993 నాటి ప్లాంటుకు 2010-15 పారిశ్రామిక విధానం ప్రకారం రాయితీలు ఇవ్వనున్నారన్నమాట. ఇటువంటి విచిత్రం రాష్ట్ర పారిశ్రామికరంగంలో ఎన్నడూ జరగలేదని పరిశ్రమలశాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.