బదిలీల గోల | Transfers | Sakshi
Sakshi News home page

బదిలీల గోల

Published Wed, Sep 3 2014 2:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Transfers

సాక్షి, అనంతపురం : జిల్లాలో అధికార యంత్రాంగానికి బదిలీల జ్వరం పట్టుకుంది. స్థాన చలనం ఖాయమని భావిస్తున్న కొందరు అధికారులు ఇప్పటి నుంచే పని మానేసి హైదరాబాద్‌కు పరుగు తీస్తున్నారు. మరికొందరు ఉదయం 11 గంటలవుతున్నా కార్యాలయాలకు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో త్వరలో భారీగా బదిలీలు జరగనున్నాయి.
 
 ఈ నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యేందుకు అవకాశం ఉన్న జిల్లా, మండల స్థాయి అధికారులు, ఇంజనీర్లు ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మండల స్థాయి అధికారి బదిలీ కావాలన్నా.. అక్కడే అతుక్కుపోవాలన్నా ఎమ్మెల్యే సిఫారసు లేఖ తప్పనిసరి. దీంతో ఆ లేఖల కోసం కుస్తీ పడుతున్నారు. ప్రధానంగా పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులు ఎక్కువ మంది హైదరాబాద్‌లో తిష్ట వేశారు. జిల్లా స్థాయి అధికారులు కొందరు ఇక్కడే ఉండాలనే ఉద్దేశ్యంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకుని సెక్రటేరియట్, అసెంబ్లీ, ప్రజాప్రతినిధుల ఇళ్లు, క్వార్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.
 
  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేసిన వారికే పోస్టింగ్ ఇప్పిస్తామని చెబుతుండడంతో చాలా మంది అధికారులు తాము టీడీపీ బ్రాండ్ అని, పార్టీ కోసం ఎన్నికల్లో పని చేశామని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. కచ్చితంగా బదిలీ ఉంటుందనుకున్న అధికారులు వేరే జిల్లాలో పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో ముందే వెతికి పెట్టుకున్నారు. ఇందు కోసం ఆయా జిల్లాల మంత్రుల కటాక్షం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో అధికారులు అంతా హైదరాబాద్‌కు క్యూకడుతున్నారు.
 
 ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా తమకు అనుకూలంగా ఉండే వారిని, సన్నిహితులను జిల్లాకు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 డివిజన్ స్థాయి అధికారుల హడావుడి జిల్లాకు చెందిన ఓ డివిజన్ స్థాయి అధికారి డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ క ృష్ణమూర్తి పాత నియోజకవర్గంలో చాలా కాలం పాటు నమ్మకంగా పని చేశారు. దీంతో ఆ అధికారిని అనంతపురం జిల్లాలోనే కొనసాగించాలని జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులంతా డిప్యూటీ సీఎం మాటను కాదనలేకపోయారు. మరో డివిజన్ స్థాయి పోలీసు అధికారి ఒకరు అక్కడే పనిచేసేలా తన సామాజిక వర్గానికి చెందిన నేత ద్వారా సిఫారసు చేయించుకున్నారు. గతంలో ఆర్వీఎం పీవోగా పనిచేసిన ఓ అధికారి కోసం రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు తెలిసింది. మరో డివిజన్ స్థాయి అధికారి తనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, మరో ఆరు నెలల పాటు తాను అక్కడే పనిచేసేలా కరుణించాలని ఎమ్మెల్యే, మంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఇప్పటికే వారు ఓకే చేసినట్లు తెలిసింది. మరో రెవిన్యూ డివిజన్ స్థాయి అధికారిని బదిలీ చేయించి.. ఆయన స్థానంలో ైవె ఎస్సార్  జిల్లాలో పనిచేస్తున్న అధికారిని ఇక్కడికి రప్పించుకునేందుకు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫారసు లేఖలు ఇచ్చారు. దీంతో పాత అధికారి తన బదిలీని నిలుపుదల చేయించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
 తీవ్ర ఉత్కంఠ
 జిల్లాలో ఇతర అధికారులు, మినిస్టీరియల్ సిబ్బందిలో బదిలీలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బదిలీల ప్రక్రియ సెప్టెంబర్ 1న మొదలు పెట్టి నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. మండల స్థాయిలో పనిచేసే ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు, ఇంజనీర్లు మొదలుకుని జిల్లా స్థాయిలో కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వరకు చాలా మంది బదిలీలు జరుగుతాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలన్నది ప్రాథమిక నిబంధన.
 
 అయితే ఈ సారి బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో జరుగుతాయా? లేదా? అన్నదే ఎక్కువ మందిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆయా శాఖల ఉద్యోగుల్లో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో 20 శాతానికి మించకుండా బదిలీ చేయాలన్నది నిబంధన. కౌన్సిలింగ్ పద్ధతి ఉంటే మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో అందరికంటే ఎక్కువ సీనియార్టీ ఉన్న వారిని బదిలీ చేస్తారు. పైగా ఆ విధానంలో తాము బదిలీ కోరుకుంటున్న ప్రాంతాలను ఎంచుకునే వీలు ఉద్యోగులకు ఉంటుంది. కౌల్సిలింగ్ పద్ధతి లేకపోతే ఆయా విభాగాల ఉన్నతాధికారుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
 
 అప్పుడు మూడేళ్లు దాటిన వారిలో ఎవరికైనా స్థాన చలనం కలగవచ్చు. ఇప్పుడు అదే ఎక్కువ ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్తబ్దత నెలకొంది. ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్ధేశం లేకపోవడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడం దానికి ఒక కారణమైతే.. బదిలీలు కొలిక్కి రాకపోవడం మరో ముఖ్య కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరిని కదిలించినా బదిలీలపైనే చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది అధికారులు కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడపడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement