అనంతపురం అగ్రికల్చర్: ఈ ఖరీఫ్‌లో 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలో జిగురు గోరుచిక్కుడు పంటను సాగులోకి తీసుకురావాలని కలెక్టర్ కోనశశిధర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏజేసీ ఖాఖామొహిద్ధీన్, జేడీఏ పీవీ శ్రీరామమూర్తితో కలిసి గోరుచిక్కుడు పంట గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి గుజరాత్‌కు చెందిన జితేంద్రషా, హరియానా నుంచి యాదవ్, హైదరాబాద్ నుంచి టీవీ సుబ్రమణ్యంతో పాటు జిల్లాకు చెందిన మరికొందరు వ్యాపారులు, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరుచిక్కుడు, వేరుశనగ పంటల మధ్య వ్యత్యాసం, పెట్టుబడి, దిగుబడులు, ఎంత వర్షం అవసరం ఉంటుందనే విషయాలను చర్చించారు. గోరుచిక్కుడు పంటకు ఒక వర్షం వచ్చినా పంట అంతో ఇంతో చేతికి వస్తుందని, పెట్టుబడి కూడా చాలా తక్కువన్నారు. దిగుబడిని అమ్ముకోవడమే ప్రధాన సమస్య అన్నారు.
గతంలో పండించిన పంట ఉత్పత్తి ఇప్పటికీ జిల్లాలో పలువురు రైతుల వద్ద నిల్వ ఉందని గుర్తు చేశారు. మార్కెటింగ్‌పై భరోసా కల్పిస్తే పెద్ద ఎత్తున రైతులు సాగుకు ముందుకు వస్తారని ఏడీఏలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్‌లో లభిస్తున్న ధరలు, ఏ సమయంలో మంచి ధరలు లభిస్తాయనే అంశాల గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పంటల్లా గోరుచిక్కుడుకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) లేదన్నారు. దీని వల్ల ధరల్లో తీవ్ర వ్యత్యాసాలు ( క్వింటా రూ.2వేల నుంచి రూ.10 వేల మధ్య) ఉంటాయని వివరించారు. అయితే క్వింటా రూ.4 వేలకు తక్కువగా కాకుండా ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ ధర లభించేలా దృష్టి సారించాలని జిల్లా అధికారులు, వ్యాపారులకు సూచించారు. ఒకవేళ ధరలు ఎక్కువగా ఉంటే 7 శాతం రవాణా చార్జీలు పోనూ తక్కిన ధరతో కొంటామని వ్యాపారులు తెలిపారు. ధరలు తక్కువగా ఉంటే మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.4 వేల ప్రకారం కొనుగోలు చేయించే అంశం గురించి ఆలోచిస్తామని కలెక్టర్ చెప్పారు. అదే విధంగా గోరుచిక్కుడు పంటకు ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడిరాయితీ), పంటల బీమా పథకాలు వర్తింపజేసే అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఏవోలకు లక్ష్యాలు ఇచ్చి 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటను సాగులోకి తీసుకురావాలని జేడీఏను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో విత్తనం పడేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తదుపరి చర్యలు ఆలోచిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్లు డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి, డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఏడీఏ పీపీ కె.మల్లికార్జున, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బాలభాస్కర్, డివిజన్ ఏడీఏలు, ఆయిల్‌ఫెడ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
గోరుచిక్కుడు సాగుకు ప్రోత్సాహం
Published Sun, Jul 5 2015 2:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement