సాక్షి, అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.50 లక్షలు విలువ చేసే ఏసీలు, ఫ్రిజ్‌లు, బెంచీలు, టేబుళ్లు, ఫ్యాన్లు ఇతర పరికరాల కొనుగోళ్లలో గోల్‌మాల్ చోటుచేసుకుంది. ఏ వస్తువునైనా ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజనీరింగ్ విభాగం (హైదరాబాద్) వారి ఆధ్వర్యంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అయితే కళాశాలలోని ఓ ఉన్నతాధికారి ఆ నిబంధనలు పాటించలేదని స్పష్టమౌతోంది. టెండర్లు పిలవకుండానే కొనుగోలు చే శారు. వైద్య ఆరోగ్య శాఖ హైదాబాద్‌లోని ఓ ఉన్నతాధికారి అనంతపురం మెడికల్ కళాశాలలోని ఉన్నతాధికారికి క్లాస్‌మేట్ కావడంతో ఇద్దరూ కలసి హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఈ పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ వస్తువుల కొనుగోళ్లలో 35 శాతానికి పైగా కమీషన్ ఉండేలా బిల్లులు సృష్టించారు. బిల్లుల మంజూరులో ఏడీ లోకనాథం సంతకం అవసరమైంది. సంతకం చేయాలని ఓ ఉన్నతాధికారి ఏడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా పరికరాలు కొనుగోలు చేశారని, అందులో నాసిరకం పరికరాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో విచారణ జరిగితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన ఏడీ సంతకం పెట్టడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో కళాశాలలోని ఆ ఉన్నతాధికారికి ఏడీకి మధ్య గొడవ రాజుకుంది.
తాను కళాశాల ఇన్‌చార్జ్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నాన ని, కచ్చితంగా సంతకం పెట్టి తీరాలని హుకుం జారీ చేయడమే కాకుండా డీఎంఈతో మాట్లాడి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బెదిరిచడంతో విధిలేని పరిస్థితిలో ఏడీ సంతకాలు చేసినట్లు సమాచారం. మార్కెట్‌లో రూ.15 వేలు విలువ చేసే ఫ్రిజ్‌ను రూ.30 వేలకు కొనుగోలు చేసినట్లు, ఒక్కో ఫ్యాన్ ధర రూ.1200 ఉంటే రూ.5 వేలకు కొనుగోలు చేసినట్లు, టేబుళ్లు, కుర్చీలు మార్కెట్ ధర కంటే మూడింతలు అధికధరకు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి మంజూరు చేయించుకున్నట్లు తెలిసింది.
ఇందులో ఎవరికి వెళ్లాల్సిన వాటాలు వారికి అందినట్లు కళాశాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) విజిట్ అనంతరం ఇందులో సగం వస్తువులన్నీ మాయమైపోయినట్లు కళాశాల వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రతి ఎంసీఐ విజిట్ ముందు ఈ రకంగా వస్తువులన్నీ పాడయ్యాయని కొనుగోలు చేయడం మెడికల్ కళాశాలలో ఆనవాయితీగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి.
చేయి తడిపితేనే బిల్లు
ఏడాది క్రితం చిత్తూరు జిల్లా నుంచి బదిలీపై అనంతపురం మెడికల్ కళాశాలకు వచ్చిన ఓ అధికారి డాక్టర్లకు సంబంధించిన బిల్లులు, ఇతర వాటికి సంబంధించి పైసలు ఇవ్వనిదే ఫైలు ముట్టుకోవడం లేదని పలువురు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి నోటీసుకు తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. మెడికల్ కళాశాల మొత్తం ముగ్గురు సిబ్బంది కనుసైగలతో నడుస్తోంది.
ఆ ముగ్గురు అనంతపురంలో మెడికల్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి బదిలీ లేకుండా ఇక్కడే తిష్టవేసుకున్నట్లు తెలిసింది. మరో ఉద్యోగి.. ఉన్నతాధికారికి స్వయాన బంధువు కావడంతో ఇక్కడ ఏళ్లతరబడి పాతుకు పోయినట్లు సమాచారం. మొత్తం కళాశాలలో ఫ్లంబింగ్, టాయిలెట్స్, బాత్‌రూములు రిపేరీల పేరుతో ప్రతినెలా వేలాది రూపాయల బిల్లులు డ్రా చేయడంలో ఆ ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు, దీనికి మరో ఇద్దరు ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు బేఖాతరు..
పరిపాలన బాధ్యతలు చూసే వైద్యులు.. క్లినిక్‌లు, ల్యాబ్‌లు నడపరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ స్వయంగా పెథాలజీ ల్యాబ్ నడుపుతున్నారు. ఇక్కడికి వచ్చే ప్రొఫెసర్లలో కొందరు ఉదయం 11 గంటలకే క్లినిక్‌లకు తిరుగు ముఖం పట్టినా ప్రిన్సిపాల్ ప్రశ్నించే సాహసం చేయడం లేదు. ఒక వేళ ప్రశ్నించినా మీరు కూడా ల్యాబ్ నడుపుతున్నారని ఆ ప్రొఫెసర్లు ఆమె పైనే దండెత్తే పరిస్థితి నెలకొంది. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రొఫెసర్లు కళాశాలకు వచ్చినా రాకపోయినా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఇన్ని సమస్యలు ఉన్న మెడికల్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడం వల్ల మిగిలిన వారిది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వం, జిల్లా మంత్రులు ఈ వ్యవహారంపై విచారణ చేయించి మెడికల్ కళాశాలను సంస్కరించకపోతే అదనపు సీట్లు రావడం ప్రశ్నార్థకం కానుంది.
నేను రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను కాదు
రెగ్యులర్ ప్రిన్సిపాల్ అయితే ల్యాబ్‌లు నిర్వహించకూడదు. నేను రెగ్యులర్ ప్రిన్సిపాల్ కాదు. అయినా తిరుపతి లాంటి ప్రాంతాల్లోనే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నేను నిర్వహించేది ఏముంది.. అయినా నేను విధులు ముగించుకున్న తరువాతే సాయంత్రం పూట ల్యాబ్‌కు వెళ్తాను. కళాశాలకు మేము ఎటువంటి వస్తువులూ నేరుగా కొనుగోలు చేయలేదు. మాకు ఏ వస్తువు కావాలన్నా డీఎంఈకి లేఖ రాస్తాం. ఆయన సరే అంటే నేరుగా కొనుగోలు చేస్తాం. లేదంటే ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు తెలిపితే వారే పరికరాలు కొనుగోలు చేసి కళాశాలలో అమరుస్తారు. అంతేకానీ మేము కళాశాల కోసం ఏ పరికరాలూ కొనుగోలు చేయలేదు.
- డాక్టర్ నీరజ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అనంతపురం
కొనుగోల్‌మాల్
Published Fri, Aug 8 2014 3:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement