ఫీవర్రీ
అనంతపురం అర్బన్ : జిల్లాలో పెద్ద సంఖ్యలో రోగులు విష జ్వరాల బారిన పడ్డారు. పదుల సంఖ్యలో రోగులకు డెంగీ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అధికారుల్లో కలవరం మొదలైంది. గత ఏడాది డెంగీతో పదుల సంఖ్యలో జనం మృత్యువాతపడ్డారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం డెంగీ కేసులే లేవని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న కేసులు అవాస్తవమని, అవి రాపిడ్ కిడ్ మెథడ్‌తో చేశారని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు చెబుతున్నారు. ఎలీసా రీడర్‌తో వైద్య పరీక్షలు చేసిన తర్వాతే డెంగీనా? కాదా? అన్నది తేల్చాలంటున్నారు. రోగం ఏదైనా సత్వర చికిత్స అందించడానికి తీసుకుంటున్న చర్యల్లో వేగం మందగించింది. అయితే ఆరోగ్య శాఖలోని మలేరియా విభాగం మాత్రం నిద్రమత్తు వీడడం లేదు.
వృథాగా ఎలీసా రీడర్
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంపీ నిధుల (రూ.6 లక్షలు)తో ఎలీసా రీడర్ పరికరం కొనుగోలు చేశారు. దీన్ని వైద్య కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగంలో ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఈ పరికరంతో ఒక్క పరీక్ష కూడా చేయలేదు. అయితే ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలీసా రీడర్‌తోనే పరీక్షలు చేస్తున్నామని ఉత్త మాటలు చెబుతోంది. కాగా మైక్రోబయాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం కొన్నేళ్లుగా రాపిడ్ మెథడ్‌తోనే పరీక్షలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన ఎలీసా రీడర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. పరీక్షలు ప్రారంభించడానికి పూణె నుంచి డెంగీ ఎలీసా కిట్స్ రావాల్సి ఉందని, ఆ బాధ్యతను మలేరియా విభాగం తీసుకోవాని మైక్రో బయాలజీ విభాగం వారు చెబుతున్నారు.
నిద్రమత్తులో వైద్య ఆరోగ్య శాఖ
జిల్లాలో రెండు నెలల వ్యవధిలో డెంగీ లక్షణాలతో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆత్మకూరు మండలం బీకే తండాకు చెందిన ఓ గర్భిణి, ఈదులపల్లికి చెందిన నరసమ్మ.. రామగిరి మండలం కొండాపురానికి చెందిన నారాయణ.. రాయదుర్గంకు చెందిన సోయెబ్‌లు డెంగీ లక్షణాలతో మృతి చెందిన వారే. అయితే అసలు డెంగీ కేసులే నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కానీ మైక్రో బయాలజీ విభాగం రికార్డులను పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి ఐదు కేసులు నమోదయ్యాయి.
జనవరిలో 14 కేసులు రాగా ఇద్దరు, ఫిబ్రవరిలో 11 రాగా ఒకటి, ఏప్రిల్‌లో 65 రాగా ఒకటి, మేలో 28 రాగా ఒక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మలేరియా విభాగం క్షేత్ర స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాల్సి ఉన్నా ఆ ఉసే కన్పించడం లేదు. ఇదిలావుండగా ప్రైవేట్ ఆస్పత్రులలో డెంగీ లక్షణాలతో పదుల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
విజృంభిస్తున్న విష జ్వరాలు
ఇటీవల వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2, 3, చిన్నపిల్లల ఓపీల్లో అధిక సంఖ్యలో జ్వర కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఓపీకి సుమారు 500 మంది రోగులు వస్తుండగా.. వంద మంది వరకు అడ్మిషన్ పొందుతుండడం ఆందోళన కల్గిస్తోంది. వాతావరణంలో మార్పులు రావడంతో ప్రధానంగా చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియాతో బాధపడుతున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఓపీ అయిపోవడానికి మధ్యాహ్నం ఒంటి గంట పడుతోంది. ఇక్కడి వైద్యులు సిఫార్సు చేసిన పరీక్షలు చేయించుకోవడానికి రోగులు ల్యాబ్‌లకు వెళితే..
వాతావరణ మార్పుతో జిల్లాలో విష జ్వరాలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్లేట్‌లెట్స్ కౌంట్ 50 వేలకు పడిపోగానే డెంగీ లక్షణాలంటూ పలువురు వైద్యులు పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. మలేరియా వల్ల కూడా ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోచ్చు. ఆర్థిక స్థోమత ఉన్న వారు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగు దీస్తుండగా, పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కయ్యాయి. వందల మంది రోగులు వస్తుండటంతో వైద్యులు, సిబ్బంది అందుకు సమాయత్తమై వైద్యం అందించలేక సతమతమవుతున్నారు. ఇందులో డెంగీ కేసులు నిర్ధారణ అయితే తమకు చెడ్డ పేరు వస్తుందని డీఎంహెచ్‌ఓ బెంబేలెత్తుతున్నారు.