అనంతపురం క్రైం : తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆతృత.. మితిమీరిన వేగం.. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం.. అధికారుల నిర్లక్ష్యం.. కారణమేదైనా ప్రజలు మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 40 రోజుల వ్యవధిలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 30 మంది మృత్యుఒడికి చేరారంటే ప్రమాదాల తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక క్షతగాత్రులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. అనంతపురంలోని మూడో రోడ్డులో నివాసముంటున్న యువ పశువైద్యాధికారి నవతేజ (27) శుక్రవారం విధి నిర్వహణ కోసం అనంతపురం నుంచి తాడిమర్రి వెళ్లేందుకు ఉదయం ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా తన తప్పేమీ లేకున్నా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మృత్యుపాలయ్యాడు. శనివారం చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓల్వో బస్సు.. ముందువెళ్తున్న లారీని ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన బాబుపిళ్లై, మద్దిశెట్టి చంద్రశేఖర్, బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ మృతి చెందాడు. వీరంతా యువకులే. ఓల్వో బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే నియంత్రించుకోలేక ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ముందు వెళ్తున్న లారీకి వెనుక ఇండికేషన్స్ వెలగలేదనే విషయం విచారణలో వెలుగు చూసింది.
ఆగస్టు 31న రాత్రి 8 గంటలకు మడకశిర మండలం తడకలపల్లి-బుళ్లసముద్రం గ్రామాల మధ్య కారు అదుపు తప్పి వేపచెట్టును ఢీకొనడంతో ఆమిదాలగొంది, ఛత్రం గ్రామాల కార్యదర్శులు లక్ష్మినారాయణరెడ్డి (38), నాగరాజు (39) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ నెల 2న కుమారుడికి కటింగ్ చేయించేందుకు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఐషర్ వాహనం ఢీకొని ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన గోవింద్‌నాయక్ (40), కుమార్తె సోనియా (6) మృత్యువాత పడగా కుమారుడు సాయి అభిషేక్ గాయపడ్డాడు. ఈ ఘటనలో భర్త, కుమార్తెను పోగుట్టుకున్న తల్లి ఆవేదన అంతాఇంతా కాదు. ఇదే నెల 4వ తేదీన కదిరి మండలం నడిమిపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో నల్లమాడ మండలం సానేవారిపల్లికి చెందిన శివయ్య (43) దుర్మరణం చెందాడు.
ప్రమాదాల్లో అధికశాతం లారీల వల్ల జరిగినవే కావడం గమనార్హం. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. ప్రమాదాల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏడాదికోసారి తూతూమంత్రంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ అంటూ వారోత్సవాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కమిటీ కూడా ప్రమాదాలను నియంత్రించడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగాక నానా హడావుడి చేసే పోలీసులు రోడ్లపై అతివేగంగా వెళ్లే వాహనాలను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు.
వేగ నియంత్రణ చర్యలేవీ
వేగ నియంత్రణ ద్వారా సగం రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చు. అయితే జిల్లాలో జాతీయ రహదారితో పాటు చిన్న చిన్న రహదారుల్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు అజాగ్రత్త, అతివేగంతో జరుగుతున్నాయి. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిద్రపోతోంది. చాలా మంది లెసైన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. డీజిల్ ఆటోల్లో జనాల్ని మూటలను కుక్కినట్టు కుక్కుతున్నారు. దీంతో డ్రైవరు వాహనాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనికి తోడు కాలం చెల్లిన వాహనాలను తిప్పుతుండడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టి అదుపు చేసుకునేందుకు ప్రయత్నించినా కాలం చెల్లిన వాహనాలు అదుపులోకి రాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అభంశుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రవాణా అధికారులు, పోలీసులు పర్యవేక్షణ పెంచి వేగ నియంత్రణ, అధికలోడు, లెసైన్స్‌లేని వాహనాలపై చర్యలు తీసుకుంటే కొద్దిమేరకు ప్రమాదాలు అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రక్తదారులు
Published Mon, Sep 8 2014 2:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement