సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో ప్రతి వ్యవసాయ బోరుకూ బిందు సేద్యం పరికరాలను (డ్రిప్) అనుసంధానించాలని గురువారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) జిల్లా అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే ఇందుకు అవసరమైన నిధులు, విధివిధానాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈ పథకం అమలైతే జిల్లాలో బోరు బావుల కింద సాగు చేస్తున్న ప్రతి రైతకూ గరిష్ట పరిమితితో నిమిత్తం లేకుండా పూర్తిగా సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందుతాయి. ప్రస్తుతం జిల్లాలో 1.90 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. మరో 28 వేల బోర్లకు విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
వీటిని కూడా కలుపుకుంటే జిల్లాలో దాదాపు 2.18 లక్షల బోర్లు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకు జిల్లాలో 1.46 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందాయి. జిల్లాలో ప్రస్తుతం 4.25 లక్షల ఎకరాల్లో ‘డ్రిప్’ కింద పంటలు సాగవుతున్నాయి. ఐదెకరాల లోపు భూమి ఉన్న ప్రతి సన్నకారు రైతుకూ 90 శాతం సబ్సిడీపై ‘డ్రిప్’ పరికరాలను ఇస్తున్నారు. సబ్సిడీ మొత్తం గరిష్టంగా లక్ష రూపాయలకు మించకుండా సీలింగ్ అమలవుతోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాలకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిచాలని ఏపీఎంఐపీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనిలో భాగంగా జిల్లాలో ఈ సంవత్సరం 28,750 ఎకరాల్లో డ్రిప్ సదుపాయం అందిచనున్నారు.
రెండు మూడు రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక కూడా ప్రారంభించనున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీ అమలుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా రాలేదు. రైతులందరికీ సంతృప్త స్థాయిలో డ్రిప్ పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలన్నది కొత్త ప్యాకేజీ ఉద్దేశం. అటువంటప్పుడు ఇంతవరకు అమలవుతున్న ‘సబ్సిడీ గరిష్టంగా లక్ష రూపాయల లోపు’ అన్న నిబంధన ఉండక పోవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీ మొత్తంపై పరిమితి లేకుండా రైతుకు ఎంతమేరకు అవసరమైతే అంత మేరకు డ్రిప్ పరికరాలను అందించాల్సి ఉంటుంది.
స్పెషల్ ప్యాకేజీకి ప్రతిపాదనలు
మామూలుగా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో 28,750 ఎకరాలకు డ్రిప్ సౌకర్యం కల్పించనున్నాం. అందుకోసం లబ్ధిదారుల ఎంపిక మొదలు పెడుతున్నాం. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున ఐదు లక్షల ఎకరాలకు డ్రిప్ సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి సబ్సిడీ శాతం, గరిష్ట మొత్తం లాంటి విధివిధానాలు ఇంకా రాలేదు.
- ఎం. వెంకటేశ్వర్లు, ఏపీఎంఐపీ పీడీ
జిల్లాలో ప్రతి బోరుకూ ‘డ్రిప్’
Published Fri, Jul 11 2014 2:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement