అమలాపురం, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలతో గడిచిన ఐదేళ్లలో జిల్లా రైతులు నాలుగుసార్లు ఖరీఫ్ పంట ను కోల్పోయారు. ఒక్క 2011లో మాత్రమే ఖరీఫ్‌సాగు పండగా ఆ ఏడాది సాగు సమ్మె చేయడం వల్ల కోనసీమలో 13 మండలాల్లో 90 వేల ఎకరాల్లో సాగు చేయక రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారు. మిగిలిన నాలుగేళ్లు అక్టోబరు, నవంబరు నెలల్లో వస్తున్న భారీ వర్షాలు, తుపానుల వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాబట్టుకోలేక పోతున్నారు. తాజాగా ఈ ఏడాది హెలెన్ తుపాను వల్ల 2.80 లక్షల ఎకరాల్లో, అంతకుముందు భారీ వర్షాల వల్ల 1.60 లక్షల ఎకరాల్లో వెరసి జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినడంతో రైతులు అంచనాలకు అందని రీతిలో నష్టపోయారు.
వరుస ఖరీఫ్ నష్టాలతో కుదేలైన రైతులకు ప్రభుత్వ పరిహారం సైతం అందడంలేదు. గత ఏడాది నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఏడాది తర్వాత హెలెన్ తుపాను విరుచుకుపడే సమయానికి సైతం పూర్తిగా చెల్లించకపోవడం వారిపై ప్రభుత్వానికున్న దారుణమైన నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. నీలం నష్ట పరిహారంగా మూడున్నర లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల పెట్టుబడి రాయితీ అందాల్సి ఉండగా ఇప్పటివరకు వందకోట్లు మాత్రమే విడుదల చేశారు. మరో రూ.30 కోట్లు త్వరలో విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నష్టం నమోదుకు సవాలక్ష నిబంధనలు, పరిహారం పంపిణీకి నెలలపాటు ముఖం వాచేలా ఎదురు చూసేలా చేస్తున్న కిరణ్ సర్కారు తీరు రైతుల సహనానికి అగ్నిపరీక్షలా మారింది.
మళ్లీ మళ్లీ చావుదెబ్బలు
ఇదే నేపథ్యంలో హెలెన్ విరుచుకుపడి, మరోసారి అన్నదాతను చావుదెబ్బ కొట్టింది. పంట దక్కలేదన్న నిరాశ, ప్రకృతిని ఎదురించలేని నిస్సహాయత, ప్రభుత్వ సహకారం లేదనే ఆక్రోశం.. వెరసి రైతుల గుండెల్లో సుడిగుండాలు రేగుతున్నాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ‘అడుక్కునే వాళ్లలా కనిపిస్తున్నామా?’ అని అధికారులపై విరుచుకుపడే వారు కొందరైతే.. చేతులారా పెంచిన చేలను కోయకుండానే దున్నించేస్తున్న వారు కొందరు. కరప, ఉప్పలగుప్తంలలో ఆది, సోమవారాల్లో జరిగిన సంఘటనలే హెలెన్ తుపాను రైతులను ఎంతగా కలచి వేసిందో, వారి దిటవుగుండెలను ఎంతగా అవిసిపోయేలా చేసిందో నిదర్శనం.
తీరప్రాంత మండలాల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ముంపునీరు దిగే అవకాశంలేకపోవడం, పంటకోత కోసినా కూలీల ఖర్చులు కూడా చేతికి వచ్చే అవకాశం లేదనే ఆక్రోశంతో కరప గ్రామానికి చెందిన కౌలు రైతు మేడిశెట్టి రామచంద్రరావు ఆదివారం తన వరి చేనును ట్రాక్టర్‌తో దున్నించేశాడు. ప్రకృతిని వికృతంగా చేస్తున్న దాడిని ఎదిరించలేని అసహాయత, ప్రభుత్వం ఆదుకోదనే నిస్పృహతోనే ఆ రైతు ఈ చర్యకు దిగాడు. ప్రతి కంకినీ కంటికి రెప్పలా చూసుకునే రైతే.. ఏకంగా చేనునే దున్నించేశాడంటే జిల్లాలో అన్నదాతల అంతరంగాల్లో చెలరేగుతున్న బాధల తుపాను ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు.
‘ముష్టివాళ్లమనుకుంటున్నారా..?’
ఇక ప్రభుత్వం తమ పట్ల కనబరుస్తున్న ఉపేక్ష కూడా రైతులను కోపోద్రిక్తులను చేస్తోంది. ఉప్పలగుప్తానికి చెందిన సుమారు 300 మంది రైతులు సోమవారం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని నీలం నష్ట పరిహారమే ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఇవ్వలేదని విరుచుకు పడ్డారు. హెలెన్‌తో కలిగిన నష్టానికి పరిహారం ఎప్పుడిచ్చేదీ స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఆగ్రహంతో పాటు ఆవేదన తన్నుకు రాగా ‘పరిహారం అడిగితే బిచ్చగాళ్ల కంటే హీనంగా కనిపిస్తున్నామా?’ అని గద్గద స్వరాలతో ఆక్రోశించారు. తహశీల్దారు జె.సింహాద్రి వారిని అనునయించారు. ఆకలి తీర్చే రైతులు శోకిస్తే ఏ రాజ్యానికీ శ్రేయస్కరం కాదని పాలకులు గుర్తించాలి. అన్నదాతల కృషి కాలయమునితో చెలగాటంగా మారిపోవడం యావత్తు సమాజానికీ చేటని గుర్తించాలి. వారిని ఆదుకోవడానికి సమస్త శక్తియుక్తులూ వినియోగించాలి. లేదంటే వారి కన్నీరే ఉప్పెనై.. ఆ ఉప్పెనలో వ్యవసాయమనే వృత్తే కొట్టుకుపోయే ముప్పు ఉంది. అదే జరిగితే మన మాగాణాలు బీళ్లవుతాయి. మనం ప్రతి గింజనూ దిగుమతి చేసుకోవలసిన ‘పరాన్నజీవుల’మవుతాం.
తట్టుకోలేని నష్టాలతో తల్లడిల్లుతున్న రైతులు
Published Tue, Nov 26 2013 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement