గతి తప్పిన రుతురాగం
ఈ ఏడాది ‘తూర్పు’ ముంగిట రుతురాగం సరిగా పల్లవించలేదు. సరైన వర్షాలు కురిపించకుండానే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయగా.. ఈశాన్య రుతుపవనాలు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఖరీఫ్‌లో ఇక్కట్ల పాలైన రైతులు.. రబీలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు.
* ‘తూర్పు’ను కరుణించని వరుణుడు
* దయచూపని నైరుతి..
* ఈశాన్య రుతుపవనాలదీ అదే గతి!
* ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం
* అడుగంటుతున్న భూగర్భ జలాలు
* బోర్ల కింద రబీ సాగుకు ఇబ్బందులు
అమలాపురం : అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలు.. దానివెంట వచ్చే వాయుగుండాలు, తుపాన్లతో భారీ వర్షాలు కురిసి, ఖరీఫ్ పంట నీట మునిగి, రైతు నష్టపోవడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. పోనీ అలాగని ఖరీఫ్ దక్కిందనడానికీ లేదు. సరైన వర్షాలు లేక వరిపై తెగుళ్లు విజృంభించి రైతును ముంచేశాయి. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 983.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 608.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.
ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అక్టోబర్ నెలలో సగటు 214.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 109.4 మిల్లీమీటర్లు (49 శాతం తక్కువ) నమోదైంది. నవంబర్ ఆరు వరకూ 18.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ సున్నా శాతం నమోదైంది. బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల రెండు రోజులుగా చెదురుమదురు జల్లులు పడుతున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ రెండు నెలల్లో కూడా చెప్పుకోదగ్గ వర్షం లేకపోవడం రైతులను ఆందోళన గురి చేస్తోంది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరి చేలు కోతలకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో వానలు పడకూడదని రైతులు సాధారణంగా కోరుకుంటారు. అయితే అసలు దుక్కు వర్షం కూడా పడకపోవడం వారిని కలవరపెడుతోంది.
ఇక్కడ మరీ దారుణం
కొన్ని మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేవీపట్నంలో 61 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తాళ్లరేవు 59.1, ప్రత్తిపాడు 58.3, బిక్కవోలు 55.5, గండేపల్లి 54.1, కరప 53.1, అయినవిల్లి 51.4, సామర్లకోట 48, కాకినాడ రూరల్ 47.4, రాయవరం 46.3, కె.గంగవరం 45.5, సీతానగరం 45.4, మండపేట 45.2, ఆలమూరు 45.1, అనపర్తి 42.5, కొత్తపల్లి 42.4, పెదపూడిలో 40.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.
అడుగంటిన భూగర్భ జలాలు
వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. డెల్టాలో సగటున ఐదడుగులు, మెట్ట, ఏజెన్సీల్లో ఏడు నుంచి తొమ్మిదడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వచ్చే రబీలో బోర్ల కింద సాగు చేసే రైతులు నీటి కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడనుంది. ముఖ్యంగా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడి సాగు చేయడం ఇబ్బందేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే వచ్చే రబీకి గోదావరిలో నీటి ఎద్దడి ఏర్పడనున్న దృష్ట్యా తూర్పు డెల్టాలో రైతులు సాగునీటి అవసరాలకు చాలావరకూ బోర్లపైనే ఆధారపడతారు. డెల్టాలో మోటార్లపై కొబ్బరి, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు సైతం నీటి ఇక్కట్లు తప్పకపోవచ్చు.