చెన్నైలో జలమయమైన ఒక రహదారి
సాక్షి, చెన్నై: తమిళనాడును వర్షాలు వీడటం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నై, శివారు లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి. వర్షాలతో ఇప్పటికే రెండుసార్లు చెన్నై, శివారులోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడం తెల్సిందే. శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై, ఉత్తర చెన్నై పరిధిలోని సుమారు 500 వీధుల్లో మోకాలిలోతు నీరు చేరింది. శనివారం చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో..‘కేవలం ఒక్క నెల వ్యవధిలో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం చెన్నై నగర 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి’అని పేర్కొన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు.
పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల పరిధిలో అనేక చెరువులు తెగడంతో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో శనివారం వర్షాల సంబంధిత ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. కాంచీపురం నుంచి జాతీయ రహదారిని కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈశాన్య రుతుపవనాలతో ఏటా అక్టోబర్–డిసెంబర్ నెలల్లో తమిళనాట ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఇదే సమయంలో సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా 24 గంటల్లో ఆవడిలో 20 సెంటీమీటర్లు, చెంగల్పట్టులో 18 సె.మీ వర్షం కురిసినట్లు ప్రకటించింది. రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment